Share News

National Pledge of India: ప్రతిజ్ఞ పలకటమే కాదు, పాటిద్దాం

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:55 AM

మనం చిన్నప్పుడు స్కూల్లో రోజూ భారత దేశం నా మాతృభూమి అని ఎలుగెత్తి ప్రతిజ్ఞ చేస్తామే... దాని రచయిత తెలుగువాడైన పైడిమర్రి ..

National Pledge of India: ప్రతిజ్ఞ పలకటమే కాదు, పాటిద్దాం

మనం చిన్నప్పుడు స్కూల్లో రోజూ ‘భారత దేశం నా మాతృభూమి’ అని ఎలుగెత్తి ‘ప్రతిజ్ఞ’ చేస్తామే... దాని రచయిత తెలుగువాడైన పైడిమర్రి వెంకటసుబ్బారావు అన్న సంగతి దాని రచన జరిగిన ఏభై ఏళ్ళ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆంధ్రజ్యోతిలోనే తొలిసారి 2011లో ‘ప్రతిజ్ఞ పద శిల్పి పైడిమర్రి’ పేరుతో ఓ వ్యాసం వచ్చింది. ఈ వ్యాసాన్ని పైడిమర్రి కుటుంబ సభ్యులు అందించిన వివరాల ఆధారంగా ఎలికట్టె శంకరరావు రాశారు. అనంతరం ఆయన జీవిత చరిత్రను యమ్‌. రామ్‌ప్రదీప్ రాశారు. హిందీలో ఆర్. రఘునందన్ రాశారు.


స్వాతంత్ర్య ఉద్యమం అనంతరం వచ్చిన గీతాలలో ‘ప్రతిజ్ఞ’కి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నల్గొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామానికి చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు 1962లో ప్రతిజ్ఞ రాసారు. ఆ సంవత్సరం చైనా – భారతదేశాల మధ్య యుద్ధం సందర్భంగా పౌరులలో దేశభక్తిని పెంచడానికి ఆయన ఈ ‘ప్రతిజ్ఞ’ రాసారు. 1965 జనవరి 26న భారత ప్రభుత్వం దానిని జాతీయ ప్రతిజ్ఞగా ఆమోదించింది. దేశభక్తి గీతాలకు, ఈ ప్రతిజ్ఞకు తేడా ఉంది. దేశభక్తి గీతాలని రాగయుక్తంగా ఆలపిస్తాం. ప్రతిజ్ఞను ఎలుగెత్తి చదువుతాం. ప్రతిజ్ఞ అంటే ఒక హామీ. కానీ ఈ ప్రతిజ్ఞ చదివిన మనలో ఎంతమంది దాన్ని పాటిస్తున్నాం! పైడిమర్రి ఆశించినట్లు కులమతాలకు అతీతంగా దేశాన్నీ, దేశ ప్రజలనీ సోదరసమానంగా ప్రేమిస్తున్నామా? ప్రతిజ్ఞని పలకటమే గాక, ఆ పదాలని పాటించినప్పుడే మన దేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

– యమ్. రామ్‌ప్రదీప్ ,(నేడు పైడిమర్రి వర్ధంతి)

Updated Date - Aug 13 , 2025 | 04:55 AM