Religious Extremism: విషం.. విషాదం.. గుణపాఠం
ABN , Publish Date - Jun 20 , 2025 | 02:40 AM
పాకిస్థాన్ నుంచి ఏం నేర్చుకోగలం? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్నే అసంబద్ధంగా అనిపిస్తుంది! పహల్గాం దారుణం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ వ్యతిరేక ఉద్వేగాల్లో ఊగిపోవటమే ఎక్కువ కనపడుతోంది.
పాకిస్థాన్ నుంచి ఏం నేర్చుకోగలం? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్నే అసంబద్ధంగా అనిపిస్తుంది! పహల్గాం దారుణం.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ వ్యతిరేక ఉద్వేగాల్లో ఊగిపోవటమే ఎక్కువ కనపడుతోంది. ఉద్వేగాల్లో ఊగిపోతున్నప్పుడు తార్కిక ఆలోచన మందగిస్తుంది. గతం–వర్తమానం మధ్య సంబంధాలను పట్టించుకోలేం. దీర్ఘకాలిక దృష్టితో వ్యవహారాలను చూడలేం. నిలకడగా విషయాల లోతుల్లోకి వెళ్లలేం. ఇవన్నీ అవగాహనకు అడ్డంకులుగా నిలిచే మాట నిజమే! ఈ లోటుపాట్లు ఉన్నా ఉద్వేగభరిత వాతావరణం వాస్తవాల తీరంవైపు వెళ్లేందుకూ కొంత తోడ్పడుతుంది. దేశాల చరిత్రల నుంచి గుణపాఠాలు నేర్చుకునేలా చేస్తుంది. నియంతృత్వ రాజ్యం కిరాతకాల నుంచీ మతతత్వ ఉన్మాదాల నుంచీ, మైనారిటీల దారుణ అణచివేతల నుంచీ దూరంగా ఉందామనుకుంటే పాకిస్థాన్ నుంచి మనం నేర్చుకునేది చాలానే ఉంటుంది. మతం ఏదైనా కావచ్చు. దాన్ని రాజకీయ ప్రయోజనాలకూ, ప్రభుత్వ విధానాలకూ ఆధారం చేసుకుంటే జరిగే నష్టం భారీగా ఉంటుంది. మెజారిటీ మతోన్మాదంతో పౌరహక్కులు హరించుకుపోతాయి. మతంలో మంచిచెడులు ఉన్నాయని చెప్పటమే జాతి వ్యతిరేకత అయిపోతుంది. మతాన్ని వ్యతిరేకించటం దేశద్రోహంగా మారిపోతుంది. లౌకిక వాదం విదేశీ సిద్ధాంతంగా ముద్రపడుతుంది. పాశ్చాత్య వైపరీత్యంగా సామ్యవాద దృక్పథంపై వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. స్వేచ్ఛా ఆలోచనలకూ, ప్రయోగాలకూ సంకెళ్లు పడతాయి. మొత్తంగా దేశమే ఆలోచనలపరంగా అధోగతి వైపుగా అడుగులు వేస్తుంది. మానవ మేధే సంకుచితమై పోతుంది. ఈ విపరిణామాలన్నిటికీ పాకిస్థాన్ ఎలా రంగస్థలంగా మారిపోయిందో వివరిస్తూ ఆ దేశానికే చెందిన ప్రముఖ పరిశోధకురాలు ఫరానాజ్ ఇస్పాహానీ అద్భుతమైన పుస్తకం రాశారు. పాకిస్థాన్ అంటే పవిత్రభూమి అనే అర్థమూ ఉంది. అట్లాంటి పవిత్రభూమిని మరింత పవిత్రంగా మారుస్తామనే లక్ష్యంతో మతతత్వవాదులు ఒడికట్టిన దారుణాలను ‘ప్యూరిఫయింగ్ ద ల్యాండ్ ఆఫ్ ద ప్యూర్’లో లోతుగా విశ్లేషించారు. అమెరికాలోనూ నివసించి ఆ తర్వాత పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున ఒక దఫా నేషనల్ అసెంబ్లీకీ ఫరానాజ్ ఎన్నికయ్యారు. అయినా తాను ఒకనాడు ప్రాతినిధ్యం వహించిన పార్టీ తప్పిదాలనూ, వైఫల్యాలనూ, పరిమితులనూ నిశితంగా విమర్శించారు. ఇస్లామిక్ తీవ్రవాదానికి అల్పసంఖ్యాక వర్గాలు.. పాక్‌లోలాగా భారీగా బలి అవ్వటం ఎక్కడా జరగలేదు.
1947 నాటి భారత నాయకత్వం పాకిస్థాన్ ఒక రాజ్యంగా మనుగడ సాగిస్తుందని భావించలేదు. ఎప్పటికైనా అది భారత్‌లో మళ్లీ కలవక తప్పదనే ప్రకటనలు అప్పుడు చాలా వెలువడ్డాయి. వాటికి భిన్నంగా పాకిస్థాన్ ఇప్పటికీ ఒక రాజ్యంగా కొనసాగుతూ ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యయుగంలో ఆధునిక విలువలపరంగా పాకిస్థాన్ విఫల దేశంగానే మిగిలిపోయింది. ఆధిపత్య వర్గాలు మతాన్ని ఆయుధంగా చేసుకుని అధికారాన్ని నిలుపుకొనే ప్రయత్నాల్లో ఆలోచనలూ, ప్రవర్తనలూ ఎంతటి విషతుల్యంగా మారిపోతాయనటానికి పాకిస్థాన్‌ను ఉదాహరణగా చెప్పుకొన్నా ఆ ప్రమాదం భారత్‌కు పూర్తిగా లేదనీ భరోసా ఇచ్చుకోలేం. మతంకోణంతో ఆలోచించటం ఇటీవల కాలంలో పెరిగిపోతోందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పాఠశాలలూ, కళాశాలల బోధనల్లో ఏకపక్ష చరిత్రలూ, వక్రీకరణలూ పెరిగిపోతున్నాయి. హిందూ–ముస్లిం సంస్కృతులూ పరస్పర విరుద్ధమైనవేనంటూ వ్యాఖ్యానాలూ, రెండిటి మధ్యా వెయ్యేళ్లకు పైగా సంఘర్షణలూ సాగుతున్నాయంటూ సూత్రీకరణలూ వెల్లువెత్తుతున్నాయి. హిందూ సంస్కృతికి అందరూ లోబడి మసలాలనే వాదనలూ బలపడుతున్నాయి. మతాలు మనుషులకు కొత్తకాదు. భిన్న దేవతారాధనలూ కొత్తకాదు. ఒక మత ఆధిపత్యానికి పెద్దపీట వేసే మతతత్వాలు మాత్రం కొత్తవైనవి. రాజకీయాలు, అధికార తాపత్రయాలు లేకుండా మతతత్వాలు ఊపిరిపోసుకోలేవు. అవి లేనిదే వాటిని ఆచరణలో పెట్టే శక్తులు వ్యవస్థీకృతంగా వ్యవహరించలేవు. 1949లో ప్రకటించిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానంతోనే పాకిస్థాన్‌లో మతతత్వ రాజకీయాలకు పునాది పడింది. ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటుచేయటమే రాజ్యాంగ రచన లక్ష్యంగా ఆ తీర్మానం పేర్కొంది. దాన్ని పాక్ రాజ్యాంగ సభ ఆమోదించింది. పాకిస్థాన్ ఏర్పాటుకు కీలక సూత్రధారి అయిన జిన్నా అప్పటికే మరణించారు. జిన్నా బతికి ఉంటే దాన్ని ఆమోదించేవారా? వ్యతిరేకించేవారా? అన్న విషయంపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. హిందువులూ ముస్లింలూ రెండు విభిన్న జాతులకు చెందుతారనే సిద్ధాంత ప్రచారంతో పాకిస్థాన్ ఏర్పాటు కోసం జిన్నా రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టటం తీవ్ర మత విభజనపరమైన ఆలోచనలకు దారితీసింది. అందులో సందేహం లేదు. కానీ ప్రత్యేక దేశంగా పాకిస్థాన్ ఏర్పాటు ఖాయమని తేలిపోయిన తర్వాత జిన్నా ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడలేదు. పాకిస్థాన్ రాజ్యాంగ సభలో 1947 ఆగస్టు 11న చేసిన ఉపన్యాసంలో మతానికి, రాజ్యానికి సంబంధంలేదని స్పష్టంగా వ్యాఖ్యానించారు. కుల, మత, జాతుల ఆధారంగా పాక్ ప్రభుత్వ వ్యవహారాలు ఉండవనీ ప్రతి పౌరుడికీ తాననుకున్న రీతిలో గుడికి, మసీదుకు, చర్చికి వెళ్లే స్వేచ్ఛ ఉందనీ చెప్పారు.
నవీన పాకిస్థాన్‌లో హిందువు హిందువుగా ఉండడనీ, ముస్లిం ముస్లింగా ఉండడనీ, క్రిస్టియన్ క్రిస్టియన్‌గా ఉండడనీ, ప్రతి వ్యక్తీ పౌరుడుగా మాత్రమే గుర్తింపు పొందుతాడనీ మతం వ్యక్తిగత విశ్వాసానికి మాత్రమే పరిమితమవుతుందనీ ఘనంగా చెప్పారు. అందుకు అనుగుణంగా గవర్నరు జనరల్‌గా ఉండగా కొన్ని నిర్ణయాలూ తీసుకున్నారు. హిందువైన జోగేంద్రనాథ్ మండల్‌ను న్యాయశాఖ మంత్రిగా నియమించారు. అహ్మదీయ శాఖకు చెందిన జఫరుల్లా ఖాన్‌కు తొలి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. మతరాజ్యం గురించి మాట్లాడటాన్నీ గర్హించారు. అలాగే పదవుల్లో మైనారిటీ షియాలకూ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. చాలామంది అనుకున్నట్లుగా జిన్నా ఇస్లాంలోని ప్రధాన సున్నీ శాఖకు చెందినవారు కాదు. ఆయన షియా ముస్లిం. విషాదం ఏమిటంటే తర్వాతి కాలంలో షియాల ఊచకోత పాక్‌లో సర్వసాధారణమైంది. అలాగే అహ్మదీయులను ముస్లింలుగా పరిగణించకూడదంటూ రాజ్యాంగ సవరణనే తీసుకొచ్చారు. మతతత్వ ఆలోచనలు అధికారాన్ని సాధించటానికీ, నిలబెట్టుకోటానికీ అవసరమైనప్పుడు చరిత్ర వక్రీకరణ సర్వసాధారణంగా జరుగుతుంది. జిన్నా రాజ్యాంగసభలో చేసిన ఆ ఉపన్యాసాన్ని పలు విధాలుగా తొక్కిపట్టి, సాధారణ ప్రజలకు దాన్ని చేరకుండా చేయటమే ఇందుకు నిదర్శనం. పాక్ తొలి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ దానికి పూనుకున్నారు. ద్విజాతి సిద్ధాంతాన్ని తిరస్కరించేలా జిన్నా ప్రసంగం ఉండటం పాకిస్థాన్ మనుగడకే ప్రమాదంగా పరిగణించారు. అందుకే దానికి పూర్తి విరుద్ధంగా రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని రూపొందించారు. పవిత్ర ఖురాన్‌లోని బోధనలకు అనుగుణంగా వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని తీర్చిదిద్దుకునేలా ముస్లింలకు తోడ్పటమే రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాన్ని ఇస్లామిక్ పరిభాషలో నిర్వచించటంతోనే తర్వాతి కాలంలో మతపరమైన చట్టాలకు అడుగులు పడ్డాయి. మతాల వారీగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరచారు. అన్ని మతాలకు చెందిన పౌరులు ఉమ్మడి ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకుండా చేశారు. రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం ఆమోదం పొందిన వెంటనే ముస్లిం మతగురువులు రంగంలోకి దిగి 22 సూత్రాల ప్రణాళికను ప్రకటించి షరియా చట్టాన్ని అమలుపరచటమే ప్రభుత్వ ధ్యేయం కావాలని డిమాండు చేశారు. ముస్లిం పురుషుడు మాత్రమే దేశాధినేత కావాలని స్పష్టం చేశారు.
ముస్లింలతో సమానంగా ముస్లిమేతరులకు హక్కులు ఉండకూడదనీ వాదించారు. మతగురువుల డిమాండ్లలో చాలా వాటిని ఆమోదిస్తూ 1956లో రాజ్యాంగాన్ని తయారుచేయటంతోనే పాక్ గతితప్పింది ముస్లిమేతరులను రాజ్యాధినేతగా అర్హత లేకుండా నిబంధనను పొందుపరచారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్‌గా దేశాన్ని పేర్కొన్నారు. తర్వాతి కాలంలో రాజ్యాంగాలను రద్దు చేయటం, పునరుద్ధరించటం చేసినా అంతకంతకూ మతతత్వ ప్రకరణలను పెంచారే కానీ తగ్గించలేదు. జియా ఉల్ హక్ కాలంలో రాజ్యాంగం, చట్టాలు పూర్తిగా మతతత్వంతో నిండిపోయాయి. ఎన్నికల ద్వారా ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడినా వాటిని తొలగించలేక పోయారు. దైవదూషణ చట్టాలతో లక్షలాది మందిని ఖైదుచేశారు. మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఎంతటి బీభత్సాన్ని, ఎంతటి మానవహక్కుల హననానికి పాల్పడ్డారో ఫరానాజ్ తన పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వర్ణించారు. ప్రభుత్వాల వెన్నుదన్నుతో, ప్రధాన పార్టీల పూనకాలతో మతతత్వం పేట్రేగితే మాటలో, చేతలో, చేతనలో ఎంత అమానవీయతా ఎంత క్రూరత్వమూ ప్రబలిపోతుందో వర్ణించలేం. దేశ విభజన నాటికి ఉమ్మడి పాకిస్థాన్‌లో 23 శాతం ముస్లిమేతరులు ఉండేవారు. ఇప్పటి పాకిస్థాన్‌లో వాళ్ల సంఖ్య 3 శాతానికి పడిపోయింది. ముస్లింమేతరుల్లో ప్రధానంగా హిందువులు ఒకనాటి తూర్పు పాకిస్థాన్‌లో (బంగ్లాదేశ్) అధికంగా (20శాతం) ఉండేవారు. 1961 నాటికి వారి శాతం 12 శాతానికి పడిపోయింది. అభద్రతాభావంతో, దాడులతో తల్లడిల్లి భారత్‌కు వలసలు రావటం వల్లే అది జరిగింది. జిన్నా ఏరికోరి నియమించిన న్యాయశాఖ మంత్రి జోగేంద్రనాథ్ మండల్ కూడా భారత్‌కు తరలిరాక తప్పలేదు. పాక్ సైన్యం బంగ్లాదేశ్‌లో (1971) పాల్పడిన ఊచకోతలతో లక్షలమంది హిందువులు శాశ్వతంగా భారత్‌కు వచ్చారు. పాక్ ముస్లింల్లో షియా వర్గం సంఖ్య 20 నుంచి 25 శాతం వరకూ ఉంటుంది. అహ్మదీయుల జనాభా ఒక శాతానికి పరిమితమైంది. అహ్మదీయులను తమని తాము ముస్లింలమని చెప్పుకొంటే దాన్ని శిక్షార్హం చేశారు. వారి చూపునీ, చేష్టనీ, మాటనీ దైవదూషణగా పరిగణించేలా చట్టాలను చేశారు. 1990ల తర్వాత అఫ్గనిస్థాన్ నుంచి తిరిగొచ్చిన మత తీవ్రవాదులు ఆధునిక ఆయుధాలతో మైనారిటీల ప్రాణాలు తీయటం సాధారణ చర్యలుగా మారిపోయాయి.
2009–2015 మధ్య 1659 మంది షియాలను అలాగే చంపివేశారు. అహ్మదీయులను సమర్థించిన న్యాయవాదులను, నిర్దోషులుగా ప్రకటించిన న్యాయమూర్తులను కాల్చిచంపటంతో కోర్టులు కూడా హడలెత్తిపోయాయి. అసియాబీబీ అనే అహ్మదీయ నిరక్ష్యరాస్య మహిళను దైవదూషణ చట్టం కింద అకారణంగా ఖైదుచేస్తే పరామర్శించటానికి వెళ్లిన పంజాబ్ గవర్నర్‌ను కాల్చిచంపటం అంతర్జాతీయంగా సంచలనమైనా పరిస్థితిలో మార్పురాలేదు. మతవాదులను సంతృప్తిపరచటానికి ఆధునిక ప్రజాస్వామిక సిద్ధాంతాలను పణంగా పెట్టటంతో, సమన్యాయపాలనకు తిలోదకాలు ఇవ్వటంతో మైనారిటీలు బలిపశువులు అయ్యారు. మైనారిటీలను నిరంతరం అభద్రతతో ఉంచి, వారి ప్రతిచర్యనూ అనుమానంతో చూసి, రాజ్యవిధేయతను అనుక్షణం నిరూపించుకోమని శీలపరీక్షలు కోరి హింసకు పాల్పడటం వల్లే పాక్ చరిత్ర రక్తసిక్తం అయింది. భారత్ ఉపఖండ విషాదం, బీభత్సం అదే!
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)