Journalist Activism: ఉద్యమాల జంగ్ సైరన్
ABN , Publish Date - May 28 , 2025 | 06:41 AM
సింగరేణి కార్మికుడు, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ జీవితం పోరాటం కోసం అంకితం. ఆయన సమాజంలో వ్యవస్థాపకుల కవిత్వంతో ప్రజల హక్కుల కోసం అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.
‘పాలకులు వస్తుంటారు, పోతుంటారు. జర్నలిస్ట్‌ల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. దేశ రక్షణలో మేం జవాన్ల కంటే ఏం తక్కువ కాదు. మేం చరిత్ర రికార్డ్ చేస్తం, ఎవ్వరికీ భయపడేది లేదు’ అంటూ కడదాక ప్రజల కోసమే బతికిన నల్లనేల మట్టి బిడ్డ ఎండీ మునీర్. సింగరేణి కార్మికుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, సీనియర్ జర్నలిస్ట్‌గా ఆయన సేవలు విశిష్టమైనవి. బెల్లంపల్లిలో సాధారణ సింగరేణి కార్మికుని కడుపున పుట్టిన మునీర్‌ది చిన్ననాటి నుండి అభ్యుదయ భావజాలమే. సీపీఐ అనుబంధ యువజన సంఘం ఏఐవైఎఫ్‌లో నాయకుడిగా పని చేశాడు. అదే సమయంలో తనకు మందమర్రిలో సింగరేణి కార్మికుడిగా ఉద్యోగం వచ్చింది. అలా మందమర్రితో సుదీర్ఘకాలం అనుబంధం ఏర్పడింది. ఎక్కడ ఉన్నా పాలకులను ప్రశ్నించడమే బాధ్యతగా భావించాడు మునీర్. అట్లా సింగరేణి సమస్యలపై గొంతెత్తి నినదించాడు. సింగరేణిని పాలకులు నిర్వీర్యం చేయాలనుకున్న ప్రతీసారి ‘సింగరేణి బచావ్’ అంటూ మునీర్ ముందువరసలో నిలిచి లడాయి చేశాడు. లెక్కలతో సహా వివరించి పాలకులను నిలదీశాడు. దీంతో మునీర్‌పై కక్షగట్టిన యాజమాన్యం మునీర్‌ను పలుమార్లు బదిలీ చేసింది. పోరాటమే శ్వాసగా బతికిన మునీర్ తెలంగాణ ఉద్యమంలో సైతం కీలక భూమికను పోషించారు. సకల జనుల సమ్మె జరిగినపుడు జేఏసీ చైర్మన్‌గా పనిచేశారు.
70వేల మంది కార్మికులను తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిపిన ఘనత మునీర్‌దే. తెలంగాణ ఏర్పాటుతోనే సింగరేణి మనుగడ సాధ్యమని బలంగా నమ్మాడు మునీర్. అందుకే బొగ్గుగని ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని భుజస్కంధాల మీద మోశాడు. మునీర్ పోరాటానికి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులు సైతం ఆశ్చర్యపడ్డారు. పలుమార్లు ఆయనతో చర్చలు జరిపి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాలంలోనే ప్రజల పక్షాన కలం పట్టి కథనాలు రాశాడు. పలు దినపత్రికల్లో విలువైన వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. అదే సమయంలో విప్లవోద్యమానికి సైతం దగ్గరయ్యాడు. నమ్మిన విలువల కోసం నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. నాలుగున్నర ఏళ్ళ జైలు జీవితాన్ని సైతం అనుభవించాడు. పెరోల్ మీద బయటికి వచ్చిన సమయంలో ఆయనను అంతం చేయాలని భావించారు. చావు నీడలా వెంటాడుతున్నా వెన్ను చూపలేదు. అనారోగ్యం బారినపడ్డాడు. గుండె జబ్బు కారణంగా మూడు స్టంట్లు పడ్డాయి. అయినా సరే ఆ కలం ఆగిందే లేదు. పోలీసులు ఆయనను నిర్బంధించి కాలి గోర్లను పీకి ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. మరోవైపు సింగరేణి యాజమాన్యం ‘‘ఉద్యోగం కావాలో, ఉద్యమం కావాలో?’’ తేల్చుకొమ్మంది. 33 ఏళ్ళు సింగరేణిలో పని చేసిన మునీర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉద్యోగానికి రాజీనామా లేఖను రాసి, అధికారుల మొహాన కొట్టి పూర్తికాలం జర్నలిస్ట్‌గా మారాడు. సింగరేణి కార్మిక నాయకుడిగా ఎంతటి సాహసోపేతమైన పాత్ర పోషించాడో, జర్నలిస్ట్‌గా సైతం అంతే చారిత్రాత్మకమైన పోరాటం చేశాడు. మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చేసి చూపించేవాడు. పోరాటమే తన జీవన విధానంగా మార్చుకున్నాడు. ‘‘హమ్నే ఖాయి కసమ్/ ఉస్ జండే తలే/ మౌతు మంజూర్హై/ జంగ్ ఏ మైదాన్‌మే/ హమ్ జుకునేవాలా నహీ’’ అంటూ తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్‌ల సంఘం ఆవిర్భావ సభలో రాష్ర్ట కార్యదర్శిగా మునీర్ చారిత్రాత్మక ప్రసంగం చేశాడు. తెలంగాణ రాష్ర్ట ఉద్యమంలో ఎన్నో హామీలను ఇచ్చిన నాయకులు, రాష్ర్టం సాధించుకున్న తరువాత మాత్రం వాటిని గాలికి వదలడం మీద మునీర్ మండిపడ్డాడు. జీవితాంతం ఉద్యమాలు, పోరాటాల్లోనే బతికిన మన కాలపు కలం యోధున్ని ఆరుపదుల వయసులోనే కేన్సర్ కబళించింది. ఉద్యమకారుడిగా తెలంగాణ నేల విముక్తి కోసమే జీవించిన బొగ్గుబావుల మట్టిబిడ్డ మునీర్ అకాల మరణం తెలంగాణ నేలకు తీరని లోటు.
- పసునూరి రవీందర్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు,
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం