Dr. Jasti Durgaprasad: చరిత్ర రచనా శాస్త్రవేత్త
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:03 AM
తెలుగులో చరిత్ర రచన ప్రారంభమై చాలా కాలమే అయింది. 19వ శతాబ్ది నుంచి చాలా మంది చరిత్రకారులు తమదైన ధోరణిలో చరిత్రను పుటలకెక్కించారు. చరిత్ర రచన వేరు. చరిత్ర రచన ఎట్లా సాగుతుందో, దాని చరిత్ర ఏమిటో, తత్వమేమిటో తెలియచేసే చరిత్ర రచనాశాస్త్రం వేరు.
తెలుగులో చరిత్ర రచన ప్రారంభమై చాలా కాలమే అయింది. 19వ శతాబ్ది నుంచి చాలా మంది చరిత్రకారులు తమదైన ధోరణిలో చరిత్రను పుటలకెక్కించారు. చరిత్ర రచన వేరు. చరిత్ర రచన ఎట్లా సాగుతుందో, దాని చరిత్ర ఏమిటో, తత్వమేమిటో తెలియచేసే చరిత్ర రచనాశాస్త్రం వేరు. చరిత్ర సకల అధ్యయన అంశాలకు తల్లి అయితే; చరిత్ర రచనాశాస్త్రం ఆ తల్లికి తల్లి. తెలుగులో చరిత్ర రచన ఎవరితో ప్రారంభమైందనేది పక్కన పెడితే, తొలి చరిత్ర రచనాశాస్త్ర రచయిత మాత్రం డా. జాస్తి దుర్గాప్రసాద్. చరిత్రకారుడు, శాసన పరిష్కర్త, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర నిపుణుడు అయిన దుర్గాప్రసాద్ చరిత్ర రచన ఎంత నిష్పాక్షికంగా, శాస్త్రీయమై ఉండాలో చెప్పే చరిత్ర రచనాశాస్త్రాన్ని అంతే నిష్పాక్షికంగా, శాస్త్రీయంగా నలభై ఏళ్ల క్రితమే తెలుగులో రచించారు. ఇది చరిత్రను తాత్వికంగా నిర్వచించడమే కాక ప్రాచ్య, పాశ్చాత్య దేశాల చరిత్ర రచనా రీతులను మొదటిసారి తెలుగువారికి పరిచయం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాల పోస్ట్ గ్రాడ్యుయేట్ చరిత్ర విభాగ అధ్యాపకుడుగా, విభాగ అధ్యక్షుడిగా, కళాశాల ప్రిన్సిపల్‌గా, పీజీ కోర్సెస్ డైరెక్టర్‌గా పనిచేసిన దుర్గాప్రసాద్, పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామలో లభించిన 387 శాసనాల్లో ప్రతిఫలించిన భీమేశ్వరాలయ చరిత్రను దీర్ఘకాలం కృషి చేసి వెలికి తెచ్చారు. శాసనాల ద్వారా చరిత్రను నిర్మించిన చరిత్రకారులు అంతకుముందు చాలా మంది ఉన్నా, ఎనభైల నాటికి చరిత్ర రచన సంతరించుకున్న ఆధునిక దృక్పథాన్ని అందుకున్న ఈ పరిశోధన, రాజకీయ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక పరిస్థితుల అధ్యయనానికి ప్రాధాన్యతనిచ్చి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో భీమమండలం అని పిలువబడిన ద్రాక్షారామ ప్రాంత చరిత్రను సరిగ్గా గుర్తించగలిగింది. 1980 లలో భారతదేశంలో ప్రారంభమై Feudalism Debateగా ప్రపంచవ్యాప్తంగా సాగిన చర్చను భీమమండలానికి అన్వయించిన దుర్గాప్రసాద్, ఐరోపా తరహా భూస్వామ్య వ్యవస్థ ఇక్కడ లేదని తేల్చారు.
ఈ పరిశోధనలో 11–16 శతాబ్దాల మధ్య లిపి పరిణామం దుర్గాప్రసాద్‌ను ఉత్తమస్థాయి paleographerగా రుజువుచేసింది. ప్రాచీన భాషాసాహిత్యాల మీద ఆయనకున్న అధికారం ఈ పరిశోధనను సంపద్వంతం చేసింది. తెలుగు అకాడమి కోసం పూర్తిగా ఆయనే రాసిన ఆంధ్రుల చరిత్ర రెండు భాగాలలో, సహ రచయితగా ఉన్న భారతదేశ చరిత్ర రెండు భాగాలలో క్లుప్తత, వాక్యనిర్మాణంలో బిగువూ, సమతూకం కల్గిన పదప్రయోగం– దుర్గాప్రసాద్ చరిత్రకారుడు కాకపోయినట్లయితే సాహిత్యకారుడు అయ్యేవారనిపిస్తాయి. దాదాపు పది చరిత్ర గ్రంథాలు-, కొన్ని స్వయంగా, కొన్ని తన సమకాలికుడు అయిన డా. కె.ఎస్. కామేశ్వరరావుతో కలిసి పదిహేను వరకు పరిశోధనాపత్రాలు రాసిన దుర్గాప్రసాద్, విద్యావేత్తగానే కాక నిర్వాహకుడిగా కూడా చరిత్ర పల్లకి మోశారు. ప్రారంభమైన రెండవ సంవత్సరంలోనే తమ కళాశాలలో వార్షిక సమావేశం నిర్వహించడంతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్‌తో మొదలైన ఆయన ప్రయాణం దాదాపు నాలుగు దశాబ్దాలపాటు పరస్పర పూరకంగా, తేజోవంతంగా సాగింది.
ఉప కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడుగా సంస్థ నిరాఘాటంగా నడవడంలో, వివిధ కళాశాలలు వార్షిక సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చేటట్లు చేయడంలో ఆయన కాడి పట్టారు. సంస్థ రజతోత్సవాలు నిర్వహించుకునే నాటికి ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కావడం సంస్థ కోసం దుర్గాప్రసాద్ పడిన పాతికేళ్ల శ్రమకు, చూపిన అంకితభావానికి లభించిన గుర్తింపు. కళాశాలలో తమ విభాగాధిపతి, మార్గదర్శి అయిన డా. గరిగిపాటి రుద్రయ్యచౌదరి మరణానంతరం ఆయన పేరిట పాతిక సంవత్సరాలపాటు నిర్వహించిన స్మారకోపన్యాసాలకు చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్రాల్లో నిపుణుల్ని, ముఖ్యంగా యువ పరిశోధకుల్ని ఆహ్వానించి, ప్రసంగ పాఠాలను ముందుగానే రప్పించి, ముద్రించి, నిర్వహించడం ద్వారా ఆ వ్యక్తిని పునర్జీవితుణ్ణి చేయడమేకాక, చరిత్రను సజీవంగా ప్రవహింపజేశారు. ఇస్లామ్ ధర్మసూత్రాల్లో ఒకటైన ‘జకత్’ (సంపాదనలో కొంత శాతం పేదలకు పంచడం) నుంచి స్ఫూర్తి పొందిన దుర్గాప్రసాద్ తన సంపాదనలో 1968 నుంచి పది శాతం, 1993 నుంచి నలభై శాతం, 2008 నుంచి ఎనభై శాతం ప్రజాహితం కోసం ఇచ్చేస్తున్నారు. ఇచ్చింది చెప్పుకోకూడదనే నియమం పెట్టుకున్న దుర్గాప్రసాద్, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో, జీవిత సహచరికి కూడా చెప్పరు కాబట్టి మనకు తెలిసే అవకాశం లేదు. కానీ, తణుకు నుంచి వస్తున్న ‘దారిదీపం’ మాసపత్రికకు ఇటీవలే ఈ వ్యాసకర్త ద్వారా యాభై వేల రూపాయలు విరాళంగా ఇచ్చి, పత్రికలో ప్రకటించవద్దని చెప్పడంతో తెలిసింది. ఉభయభాషాప్రవీణ జాస్తి వెంకటనరసింహారావు, దుర్గాంబ దంపతులకు 1946లో జన్మించిన దుర్గాప్రసాద్, చిన్ననాటనే తల్లిని కోల్పోయారు. దుగ్గిరాల, కూచిపూడి, తెనాలిలలో పాఠశాల విద్యను పూర్తిచేసుకుని, విజయవాడ లయోలా కళాశాలలో డిగ్రీ చదివి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య ఓరుగంటి రామచంద్రయ్య వంటి గురువుల దగ్గర చరిత్ర, పురావస్తుశాస్త్రాల్లో ఎంఏ చేశారు. ద్రాక్షారామ శాసనాల మీద జరిపిన పరిశోధనకు డాక్టరేట్ పట్టా పొందారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరి వెంకటరమణయ్య, ముసునూరి సాంబశివరామమూర్తి వంటి ముందు తరం చరిత్రకారుల నుంచి స్ఫూర్తి పొందిన దుర్గాప్రసాద్, ఈ జూలై ఒకటవ తేదీతో ఎనభయ్యో పడిలో పడనున్నారు.
-కొప్పర్తి వెంకటరమణమూర్తి
-సుశీలాదేవి