Share News

Telugu Emotional Poetry: దిగులు చూపుల పద్యం

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:12 AM

హాస్టల్‌కి వెళ్లే అమ్మాయిని వీడి పోవడం వల్ల తల్లిదండ్రుల మనసు నిండిన బాధను కవిత అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. గత జ్ఞాపకాలు, ఇంటి వేడి, కుటుంబ ప్రేమ అన్నీ కలిసిన ఒక నాస్టాల్జిక్ అనుభూతిని వ్యక్తీకరిస్తుంది.

Telugu Emotional Poetry: దిగులు చూపుల పద్యం

పిల్ల, హాస్టల్ కెళుతోంది

కురవడానికి సిద్ధంగా ఉన్న

మేఘంలా ఉంది నా ముఖం

వాళ్ళ అమ్మ ముఖంలో

తీగల మీద వాలిన

జిట్టపిట్టల్లా కనీళ్లు

మా రాత్రులు గుర్తుకొస్తున్నాయ్

మాటలతో పండిన రాత్రులు

అలా వంగి

మా ఇంట్లో వినిపించే కథలు విన్న

చంద్రుడు

కిటీకిలో నుంచి

లోపలికి తొంగి చూసే

మనోరంజ మొక్క

మా ఉదయాలు

జ్ఞప్తికొస్తున్నాయ్

టీ తాగుతున్నప్పుడు

మాతో కలిసి

కిరణాల గుడికట్టిన సూర్యుడు

ఎదురింటి అద్దాల నీడతో అల్లిన బొమ్మ

మా కబుర్లు వింటూ

ఆనందించిన నీడలు

మెరుగుపడ్డ క్షణాలు

ఈ రాత్రికి

మాతో పాటే చంద్రుడికి నిద్ర పట్టదు

కోడిపిల్లల్లా కదిలే చుక్కలు

మా ఇద్దరి మధ్య

ఖాళీలో దిగులు కదులుతోంది

హాస్టల్ కిటీకి లోనుంచి

ఒక జత కళ్ళు బయటకు చూస్తున్నట్టే

ఇంటి

తలుపు తీయడానికి

నాలుగు చేతులు ఉవిళ్ళూరుతుంటాయి

-సుంకర గోపాలయ్య

94926 38547

Updated Date - Jun 09 , 2025 | 12:12 AM