P.V.G. Raju Legacy: జనహృదయాధీశుడు
ABN , Publish Date - May 02 , 2025 | 07:28 AM
పి.వి.జి. రాజు గారు, విజయనగర పూసపాటి సంస్థానానికి చెందిన చివరి మహారాజు, ప్రజా సేవ, విద్య, సామాజిక సంస్కరణలలో విశిష్ట పాత్ర పోషించారు. ఆయనకు చెందిన ద లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం గ్రంథం, ఆయన జీవితం, సేవలు, మరియు ప్రజలకు చేసిన మార్పులను బలంగా ప్రతిబింబిస్తుంది.
‘‘I see no sense in the children being seperated from their countrymen and in their having no manner of education in their language. India is not a barbaric country; it has schools and colleges, some of which are as good as the best of them in England.’’
ఇది తొంబై ఏళ్ల క్రితం సంగతి. విజయనగర సంస్థాన అధిపతి మహారాజా అలక్ నారాయణ్ జమీందారీ వ్యవహారాల్ని నిర్వహించడంలో అసమర్థులనీ, కాబట్టి ఆయన్ని జమీందారుగా తప్పించి వారి పిల్లల్ని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీకి పంపించాలనీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. దానిని న్యాయస్థానంలో సవాలు చేస్తూ మహారాజా అలక్ నారాయణ్ తన పిల్లల్ని ఈ దేశంలోనే ఎందుకు ఉంచాలో చెబుతూ న్యాయమూర్తి ఎదుట స్వయంగా చేసిన వాదనే ఆ పై మాటలు. ‘‘పిల్లల్ని స్వదేశస్తుల నుండీ, స్వభాష నుంచి వేరు చేయడం అర్థరహితం’’ అంటూ, ‘‘భారతదేశ మేమీ అనాగరిక దేశం కాదు; ఆ మాటకొస్తే మీ ఇంగ్లండుతో పోటీపడగల విద్యాసంస్థలు ఇక్కడున్నాయి,’’ అన్నారు అలక్ నారాయణ్. ఇంకా స్వాతంత్రం రాని కాలంలో రెండు సొంత విమానాలు, వాటి కోసం విమానాశ్రయం, అంతులేని ఆస్తి పాస్తులు, ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి హోదా ఉన్న ఒక యువరాజు నోటి వెంట న్యాయస్థానంలో వచ్చిన మాటలివి. ఇక న్యాయమూర్తి సంస్థానానికి అనుకూలంగా తీర్పు ఇవ్వక తప్పలేదు.
ఆ ఒక్క తీర్పే విజయనగర సంస్థానానికి చెందిన ఆఖరి మహారాజుగా పూసపాటి విజయరామ గజపతి రాజు (పి.వి.జి. రాజు) గారిని ఈ దేశపు విలక్షణ దార్శనికుడిగా మలచగలిగింది. చిట్టచివరి విజయనగర సంస్థానాధిపతి పి.వి.జి రాజు గురించి గత ఏడాది ఏప్రిల్‌లో ‘The Last Maharaja of Vizianagaram’ అనే విలువైన గ్రంథం ప్రచురితమైంది. ‘‘దేశమును ప్రేమించు మన్నా, మంచియన్నది పెంచుమన్నా; దేశమంటే మట్టి కాదోయి, దేశమంటే మనుషులోయ్’’ అన్న గురజాడ అప్పారావు వాక్యాలతో గ్రంథం ప్రారంభం అవుతుంది. అశోక్ గజపతిరాజు ముందుమాటతో 80 పైబడ్డ అరుదైన ఫోటోలు, ఛాయా చిత్రాలతో కలిసి చదివించే చారిత్రక కథనం ఇది.
విజయనగర పూసపాటి సంస్థానం దేశంలోనే విస్తృతమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం. స్వాతంత్య్రానికి పూర్వం స్పష్టమైన బ్రిటిష్ వ్యతిరేక వైఖరితో ఎన్నికలలో పోటీ చేసి ఏకంగా 56వేల మెజార్టీ సాధించిన ఘనత ఈ సంస్థానానిది. సర్వేపల్లి రాధాకృష్ణ మొదలుకొని సర్ సి.వి. రామన్ వరకూ, మహాజ్ఞాని మాక్స్ ముల్లర్ నుంచి మహా వైజ్ఞానికుడు ఐన్‌స్టీన్ వరకూ సంస్థానం తలవని, కలవని ప్రజాపక్ష బుద్ధిజీవులు లేరు. జస్టిస్ పార్టీ నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ ఇతరేతర అన్ని రాజకీయ పార్టీలు, వాటి సిద్ధాంతాలతో లోతైన అవగాహన కలిగిన రాజ కుటుంబం విజయనగర పూసపాటి సంస్థానం.
‘దక్షిణాది బనారస్’గా పేరు గాంచిన విజయనగరంలో విజయనగర కోట కోసం స్థలం సూచించిన వ్యక్తి ఒక సూఫీ సాధువు, హజరత్ సయ్యద్ ధన్కేశ వలీబాబా. శతాబ్దాల చరిత్ర కలిగిన రాజ కుటుంబానికి సంబంధించిన నిర్మాణానికి ఒక ముస్లిం సూఫీ సాధువు మార్గదర్శకుడు కావడం అరుదైన విషయం. నాటి బలీయమైన మత సామరస్యానికి ఇది ప్రతీక. ఇప్పటికీ కోట వద్ద ఆయన దర్గా ఉంది. పి.వి.జి. రాజు గారిది విశ్వజనీన మతం. అందుకే ప్రజలు అందరి కోసం కోటలో ఒక మాసోనిక్ ఆరాధనాలయం కూడా నిర్మించారు. బుర్రకథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారి నుంచి ఎలెక్ట్రానిక్ కార్పొరేషన్ అధినేత అయ్యగారి సాంబశివరావు వరకూ రాజావారి ఉదారత్వంతో వికసించిన కుసుమాలు చాలానే ఉన్నాయి.
ఇక ఆయన చేసిన విద్యా సాంస్కృతిక సేవా కార్యక్రమాల వివరాలు, దానధర్మాల చిట్టా విప్పితే అది మరో మహాగ్రంథం అవుతుంది. రాణి ఎలిజబెత్, ఫిలిప్ యువరాజు మొదలు ఎందరో ప్రముఖులు విజయనగర సంస్థానం ఆతిథ్యం పొందారు. ఒకసారి జపాన్‌లో జరిగిన ఏదో కార్యక్రమానికి వెళ్ళిన షహనాయి విద్వాంసుడు బిస్మిల్లాఖాన్‌ను విజయనగరం నుంచి అక్కడకు వెళ్ళిన ఒక ప్రముఖుడు పలకరించగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ఆ సంస్థానంలోని ఆతిథ్యాన్ని తల్చుకుని మురిసిపోయాడట.
పి.వి.జి రాజు చివరి వరకూ ప్రజానేతగానే వెలిగారు. పార్టీలతో సంబంధం లేకుండా సగటు మనిషి పక్షానే నిలిచారు. అట్టడుగు వర్గాల కోసం చేయగలిగినంతా నిష్కామ కర్మగా చేశారు. విద్యార్థి దశలో కాలిఫోర్నియాలోని ఒక రెస్టరెంట్‌లో కూడా కొంత కాలం పనిచేయడం ఒక యువరాజు జీవితంలో ఊహించలేం. జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టు నాయకులతో పి.వి.జి. రాజు గారికి ఉన్న అనుబంధం అసాధారణమైంది. సమానతను క్రియాశీలంగా పాటించిన రాజవంశీయులు, జమీందారులు అరుదు. సోషలిస్ట్ పార్టీ సమావేశాలు జరిగినప్పుడు చోటా మోటా నాయకులు సైతం ఖరీదైన హోటల్ గదుల్లో ఉండేవారు కానీ పి.వి.జి. రాజు మాత్రం పార్టీ ఆఫీస్‌లో నేల మీద ఒక చాప పరచుకుని హాయిగా నిద్రపోయేవారట. ఇలాంటి నమ్మశక్యం కాని ఘటనలు రాజు గారి జీవితంలో అనేకం. ఆయన డైరీల ఆధారంగా రూపొందించిన ఈ గ్రంథం ఒక మంచి ప్రయత్నం. స్వయంగా ఆయనే స్వీయచరిత్ర రాసి ఉంటే ఇంకెంత గొప్పగా ఉండేదో అనే ఆశ మాత్రం పాఠకుడికి కలుగుతుంది. నూటొక్క సంవత్సరాల క్రితం జన్మించిన ఆయన ముప్పయ్యేళ్ళ క్రితం కన్నుమూశారు.
ఉన్నత విద్యావంతుడు, మేధావి, విస్తృత యాత్రికుడు, స్వతంత్ర ఆలోచనాశీలి, స్వేచ్ఛా ప్రియుడు, సంఘ సంస్కర్త, అన్నిటికీ మించి అసంఖ్యాక ప్రజల ఆకాంక్షలకు నిలువెత్తు రూపంగా తిరుగాడిన పి.వి.జి రాజు మరణ వార్త విని సుమారు రెండు లక్షల మంది ప్రజానీకం స్వచ్ఛందంగా సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చారంటే ప్రజల హృదయాల్లో ఆయనకి ఉన్న విశిష్ట స్థానం అర్థమౌతుంది. రాజ్యాలేలే రాజులు అనేకమంది ఉండొచ్చు. కానీ, జన హృదయాల్లో నిలిచే రాజులు అరుదుగా మాత్రమే ఉంటారు. అందులో పివిజి రాజు గారొకరు.
-గౌరవ్
(సామాజిక కార్యకర్త)