Share News

Language Politics: న్యూ ఇండియాలో నిరర్థక భాషా సమరాలు

ABN , Publish Date - Jul 04 , 2025 | 01:39 AM

ఈ దేశంలో ఇంగ్లీషు మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు రానున్నాయి. అటువంటి భారతదేశ ఆవిర్భావం మరెంతో దూరంలో లేదు అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిభాషించారు మరాఠీ భాషీయులపై హిందీని రుద్దేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్ని సహించబోమని మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన నాయకుడు రాజ్‌ ఠాక్రే గర్జించారు.

Language Politics: న్యూ ఇండియాలో నిరర్థక భాషా సమరాలు

భాషాయుద్ధాలు చేస్తున్నవారు తాము విఫలం కానున్న పోరాటాలు చేస్తున్నామనే సత్యాన్ని గ్రహించాల్సిన అవసరమున్నది. అవి తాత్కాలిక రాజకీయ లబ్ధినివ్వవచ్చునేమో కాని నిరవధిక ప్రయోజనాలను సమకూర్చలేవు. భాషా వైవిధ్యమే భారతదేశ మహా బలం. బహు–భాషా నైపుణ్యాలు స్పర్థాత్మక సానుకూలతలను కల్పిస్తాయి. కొత్త ఆలోచనలు చేయలేని రాజకీయవేత్తలే భాషా దురహంకారాన్ని పనిగట్టుకుని ప్రోత్సహిస్తున్నారు. అయితే యువ భారతీయులలో అత్యధికులు ఉద్యోగార్థులే గానీ భాషా దురభిమానులు కానే కారు.

‘ఈ దేశంలో ఇంగ్లీషు మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు రానున్నాయి. అటువంటి భారతదేశ ఆవిర్భావం మరెంతో దూరంలో లేదు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిభాషించారు ‘మరాఠీ భాషీయులపై హిందీని రుద్దేందుకు జరిగే ఎటువంటి ప్రయత్నాన్ని సహించబోమని’ మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన నాయకుడు రాజ్‌ ఠాక్రే గర్జించారు. ‘మరాఠీ మాతృభాషగా ఉన్న ప్రజల్లో హిందీ ద్వారా విభజనలు సృష్టించేందుకు ఎట్టి పరిస్థితులలోను పూనుకోవద్దు’ అని శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. ‘తమిళనాడులో తమిళ భాషకు యుక్తమైన స్థానముండాలని గట్టిగా కోరడం నేరమా? అలా కోరినందుకే, తమ భాషే అన్నిటికీ అర్హమైనదని సంకుచితంగా ఆలోచించే కొంతమంది మనలను తమిళ భాషా దురభిమానులు అని నిందిస్తున్నారు; తమిళ భాషావాదులు జాతివ్యతిరేకులు అని ఆక్షేపిస్తున్నారు. నిజానికి భాషా దురభిమానులు ఎవరు? హిందీ భాషా దురహంకారులే. జాతీయ భాషా ప్రతిపత్తి హిందీ హక్కు అని ఆ భాషా దురహంకారులు విశ్వసిస్తున్నారు. ఆ అభిజాత్యాన్ని, ఆధిపత్యాన్ని మనం ప్రతిఘటించడాన్ని దేశద్రోహంగా వారు పరిగణిస్తున్నారు’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ నిరసించారు.


మన రాజకీయ పార్టీల అజెండాలలో భాషా ‘యుద్ధాలు’ మళ్లీ ప్రాధాన్యం పొందుతున్నాయి. భాషా దురభిమానం స్వతంత్ర భారత రాజకీయాలలో మొదటి నుంచీ ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగపడుతూ వస్తోంది. సుదీర్ఘ విరామమనంతరం రాజకీయులు మళ్లీ ఆ అస్త్రాన్ని ఝుళిపిస్తున్నారు. అది తుప్పుపట్టి పోయిందని ప్రజలు భావిస్తున్నారు. దాన్ని ప్రయోగిస్తున్నవారు తమ కపట ఉద్దేశాలను కప్పిపుచ్చగలరా? కాలం కుమ్మరించిన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నాయకులు సంకుచిత రాజకీయ అజెండాలను తలకెత్తుకుంటున్నారు.


అమిత్‌ షా మనోవేదన ఏమిటి? ఆంగ్ల భాషా ప్రాభవంపై ఆయన అయిష్టత, ఆగ్రహం సంఘ్‌ పరివార్‌ హిందీ–హిందూ–హిందుస్తాన్‌ భావజాల జనితాలే, సందేహం లేదు. ఇంగ్లీషు వలస పాలన అవశేషమని, ‘భారతీయ సంస్కృతి’కి అది విరుద్ధమైనదని ఆ భావజాలం విశ్వసిస్తుంది. అమిత్‌ షా ఆ భావజాల అనుయాయుడు. అయితే మన హోం మంత్రి తన విద్యార్థి జీవితంలో అహ్మదాబాద్‌లోని సెయింట్‌. జేవియర్‌ కళాశాలలో ఒక బయోకెమిస్ట్రీ కోర్సులో చేరారు. ఆ కళాశాల ఆంగ్ల విద్యాధికులు అయిన ఉన్నతవర్గాల వారి విద్యాలయంగా సుప్రసిద్ధమైనది. ఆ తరువాత ఆయన అదే నగరంలోని సీయూ షా కళాశాలకు మారారు. అమిత్‌ షా తనయుడు జే షా (క్రికెట్‌ క్రీడా సామ్రాజ్య సర్వోన్నత సంస్థ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు) అహ్మదాబాద్‌లోని లయోలా హాల్‌లో చదివారు. ఉన్నతవర్గాలవారు తమ పిల్లల విద్యాభ్యాసానికి అగ్రప్రాధాన్యమిచ్చే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో అదొకటి.


అయినా అమిత్‌ షా ఆంగ్ల భాష పట్ల తన అసహ్యాన్ని ఎన్నడూ దాచుకోలేదు. అహ్మదాబాద్‌లోని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆయన ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ విలేఖరి. భారతదేశ అగ్రగామి వార్తాపత్రిక అయిన ఆ దినపత్రికను తాను చదవనే చదవనని రాజీవ్‌కు ఒకసారి అమిత్‌ షా (గుజరాత్‌ మంత్రిగా ఉన్న కాలంలో) చెప్పారట. అది ఇంగ్లీష్‌ డైలీ కావడమే అందుకు కారణమని కూడా ఆయన సెలవిచ్చారు. నెలల అనంతరం ఒక ఎన్నికల ప్రచార సభలో రాజీవ్‌ను చూసిన అమిత్‌ షా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన ఒక వార్త విషయమై ఆక్షేపణ తెలిపారట. మీరు ఇంగ్లీష్‌ పత్రికలు చదవరు కదా ఆ వార్త విషయం ఎలా తెలిసింది అని రాజీవ్‌ ప్రశ్నించగా మీ పత్రికను నేను చదవకపోయినా అందులో వచ్చిన వార్త గురించి చాలా మంది నాకు చెప్పారని అమిత్‌ షా వెన్వెంటనే తీక్షణంగా సమాధానమిచ్చారట.


అమిత్‌ షా వలే ఠాక్రేలు కూడా తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకే పంపారు. హిందీలో సంభాషించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని కూడా వారు మానుకోలేదు. అయినప్పటికీ ఠాక్రేల రాజకీయాలు నిరంతరం ‘మరాఠీ–ఫస్ట్‌’ అజెండా ప్రాతిపదికనే ఉంటాయి. అమిత్‌ షా దృష్టిలో ‘హిందీ–కేంద్రిత ప్రపంచ దృక్పథం’ నెహ్రూవియన్‌ కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కోగల ‘జాతీయవాద శక్తి’గా భారతీయ జనతా పార్టీని నిలిపేందుకు దోహదం చేసేది కాగా, ఠాక్రేలకు భాషా వివాదాన్ని మళ్లీ రగిలించడమనేది శివసేన సంస్థాపకుడు బాల్‌ ఠాక్రే ఆద్య అజెండా ‘భూమి పుత్రుల ఉద్యమం’ను పునరుద్ధరించే ప్రయత్నమే. బొంబాయిలోని మరాఠీయేతర భాషీయులను నిరంతరం తెగనాడినప్పటికీ కార్టూనిస్ట్‌గా ఆయన మొదట పనిచేసింది ఒక ఇంగ్లీష్‌ డైలీ (ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌)లో మరి. ఇప్పుడు శివసేన ఒకటికి మూడు ‘సేన’లుగా చీలిపోయి అస్తిత్వ సంక్షోభంలో ఉన్నది. అందుకే కాబోలు యువ ఠాక్రేలు తమ ప్రాభవాన్ని పునరుద్ధరించుకునేందుకు మరాఠీ భాషా దురభిమానాన్ని రెచ్చగొట్టేందుకు ఉద్యుక్తులయ్యారు.


సరే ఎమ్‌కే స్టాలిన్‌కు, ఆయన పార్టీ డీఎంకేకు హిందీ బూచీని ముంచుకొస్తున్న మహా ముప్పుగా తమ ప్రజలకు చూపడం కొత్త పరిణామమేమీ కాదు. తమిళనాడులో ఎన్నికలు జరిగే ప్రతిసారీ ప్రజల మాటా మంతీ, పిచ్చా పాటీ అంతా ఈ హిందీ బూచీ గురించే సాగుతూ ఉంటుంది. హిందీని రుద్దడానికి కేంద్రం పూనుకుంటుందని స్టాలిన్, ఆయన సహచరులు గగ్గోలు పెడుతుంటారు. 1960లలో ద్రవిడ పార్టీ ఉత్థానం హిందీ వ్యతిరేక ఆందోళనాగ్నుల నుంచే జరిగింది. ద్రవిడ సంస్కృతీ పునరుద్ధరణ, వికాసాన్ని అడ్డుకునేందుకే హిందీని తమకు వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారని డీఎమ్‌కే నేతలు ఆరోపించడం పరిపాటి. ఆరు దశాబ్దాల అనంతరం మోదీ ప్రభుత్వ కొత్త విద్యా విధానం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని అమలుపరిచేందుకు స్టాలిన్‌ ప్రభుత్వం ససేమిరా అంటోంది. తమిళ ప్రజలపై హిందీని రుద్దేందుకే ఆ విధానాన్ని ప్రవేశపెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. తమిళనాడులో తమిళ భాషకే తొలి, మలి, తుది ప్రాధాన్యమని స్టాలిన్‌ స్పష్టం చేస్తున్నారు. అయితే డీఎమ్‌కే ప్రథమ కుటుంబంలోని యువతరం వారు తమ పిల్లలను ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలకే పంపిస్తున్నారు చెన్నెలోని ప్రైవేట్‌ పాఠశాలలు త్రిభాషా సూత్రాన్ని అమలుపరిచేందుకు మొగ్గుచూపుతున్నాయి. హిందీకి సముచిత ప్రాధాన్యమిచ్చేందుకు అవి వెనుకాడడం లేదు.


బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాషను వ్యతిరేకిస్తున్న పాతకాలం నాటి సోషలిస్ట్‌ లోహియా వాదుల నుంచి హిందుత్వ వాదులు, ప్రాంతీయ యోధుల వరకు అందరూ తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకే పంపిస్తున్నారు! ఇంగ్లీష్‌కు వ్యతిరేకంగా గొంతు చించుకుంటున్న అమిత్‌ షా, కేంద్ర కేబినెట్‌లోని తన సహచరులలో ఎంత మంది తమ పిల్లలను హిందీ లేదా ప్రాంతీయ భాషా మాధ్యమ పాఠశాలలకు పంపుతున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. కనీసం అరడజను మంది కేంద్ర కేబినెట్‌ మంత్రుల పిల్లలు ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుతున్నారు. ఇంగ్లీష్‌ను ఇంకెంత మాత్రం వలసపాలన అవశేషంగా కాకుండా ఆశయ సాధనకు, స్వీయ అభివృద్ధికి మార్గంగా భావిస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ ప్రాంతానికి అయినా వెళ్లి చూడండి. సర్వత్రా ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కోచింగ్‌ సెంటర్‌లు కనిపిస్తాయి. ‘న్యూ’ ఇండియా యువత సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశాలను అవి సమకూరుస్తున్నాయి. ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నందుకు సిగ్గుపడకపోగా ఆ భాషా పటిమలో మేటి అయ్యేందుకు యువ భారతీయులు ఆరాటపడుతున్నారు. విచారకరమైన విషయమేమిటంటే విద్యాలయాలలో ఆంగ్ల భాషా బోధన ప్రమాణాలు ప్రశస్తంగా లేవు. గుజరాతీ యువతకు ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కొరవడినందునే ఆ నైపుణ్యాల ఆధారిత సేవల రంగంలో గుజరాత్‌ వెనుకబడి పోయింది.


ముంబై మహా నగర జీవనంలో కూడా ఇప్పుడు (గతంలో ఎన్నడూ లేని రీతిలో) మహారాష్ట్రియన్‌ స్వరూప స్వభావాలు తక్కువగా ఉన్నాయి. హిందీ, కేవలం ఈ నగర విశ్వవిఖ్యాత బాలీవుడ్‌ సినిమా పరిశ్రమ భాష మాత్రమే కాదు, జీవనోపాధికి ఉత్తర భారతావని నుంచి వలసవచ్చిన వివిధ వృత్తులవారు అద్వితీయంగా పెంపొందిస్తోన్న స్థానిక భాష. సౌందర్యమూ, సౌలభ్యమూ ఉన్న ముంబై యాస అది. ఈ విశ్వనగర పలుకులమ్మ ఝంకారంలో బాంబే వెర్సెస్‌ ముంబై వెర్సెస్‌ బంబాయి చర్చకు ప్రాధాన్యమేముంటుంది? అది ప్రయోజనశూన్యమైనది. ఈ మహానగర జీవన సందడి భాషాపరమైన విభజనలు, వ్యత్యాసాలపై అస్తిత్వ ఆందోళనలు, జీవిత అనిశ్చితులకు సంబంధించిన భయాలకు తావులేకుండా చేస్తోంది. నిజమే, మరాఠీ భాషా అభిజాత్యం ఇంకా ప్రభావశీలంగా ఉన్నది. అయితే ఒక భాషకు మరో భాషకు వ్యతిరేకంగా ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఇంకెంత మాత్రం లేదు.


ఈ వాస్తవాలు స్పష్టం చేస్తున్నదేమిటి? భాషాయుద్ధాలు చేస్తున్నవారు తాము విఫలం కానున్న పోరాటాలు చేస్తున్నామనే సత్యాన్ని గ్రహించాల్సిన అవసరమున్నది. అవి తాత్కాలిక రాజకీయ లబ్ధి నివ్వవచ్చునేమో కాని నిరవధిక ప్రయోజనాలను సమకూర్చలేవు. భాషా వైవిధ్యమే భారతదేశ మహా బలం. బహు–భాషా నైపుణ్యాలు స్పర్థాత్మక సానుకూలతలను కల్పిస్తాయి. కొత్త ఆలోచనలు చేయలేని రాజకీయవేత్తలే భాషా దురహంకారాన్ని పనిగట్టుకుని ప్రోత్సహిస్తున్నారు. అయితే యువ భారతీయులలో అత్యధికులు ఉద్యోగార్థులే గానీ భాషా దురభిమానులు కానే కారు.

-(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - Jul 04 , 2025 | 01:39 AM