Share News

Political Criticism: అధికారం మత్తు పోకనే సీఎంపై దుర్భాషలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:40 AM

సూదికి బెజ్జ‌ముంద‌ని జ‌ల్లెడ వెక్కిరించిన‌ట్లుంది మాజీ మంత్రి కేటీఆర్ తీరు..

Political Criticism: అధికారం మత్తు పోకనే  సీఎంపై దుర్భాషలు

సూదికి బెజ్జ‌ముంద‌ని జ‌ల్లెడ వెక్కిరించిన‌ట్లుంది మాజీ మంత్రి కేటీఆర్ తీరు! బూతులు, రోత మాట‌ల‌తో ఆయ‌న నోరు నానాటికీ మురుగు కాల్వ‌ను మించిపోతోంది. అదేమ‌ని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే ‘ముఖ్య‌మంత్రికి దీటుగా స‌మాధానం’ అంటూ గ‌ప్పాలు కొడుతున్నాడు. తెలంగాణ ప్రాంతంలో బూతుల‌కు, రోత మాట‌ల‌కు ప్రాణం పోసిందే తన తండ్రి కేసీఆర్ అనే విష‌యం కేటీఆర్ గుర్తుంచుకోవాలి. ప‌త్రిక‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌లు, సొంత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్తల‌తో పాటు ప్ర‌ధాన‌మంత్రినీ, కేంద్ర మంత్రుల‌ను సైతం నోటికొచ్చిన‌ట్లు మాట్లాడిన చ‌రిత్ర కేసీఆర్‌ది. నిత్యం బొంకుల‌తో, ఊక‌దంపుడు ఉప‌న్యాసాల‌తో ప‌దేళ్ల పాటు మ‌భ్య‌పెట్ట‌డం వల్లనే విసిగిన ప్ర‌జ‌లు కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ప‌క్క‌న‌పెట్టారు. ప్ర‌తిప‌క్షంలో పెట్టినా తీరు మారక‌పోబ‌ట్టే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి గుండు సున్నా ఇచ్చారు. ఇంత చేసినా కేటీఆర్ తీరు మార‌డం లేదు. పైగా రేవంత్‌రెడ్డి భాష బాగా లేదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. తండ్రి హ‌యాంలో అంతులేని అధికారం చెలాయించిన కేటీఆర్‌కు ఇంకా ఆ మత్తు దిగ‌డం లేదు. ఆయ‌న బీఆర్ఎస్ అధ్య‌క్షుడు కాదు, ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నాయ‌కుడు కాదు. ఒక ఎమ్మెల్యే మాత్ర‌మే. కానీ ప్ర‌జ‌లు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నిత్యం అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేస్తున్నాడు.


అధికారం పోవ‌డ‌మే కేటీఆర్‌కు పీడకల అయితే, ఇంటి పోరు ఆయనను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తండ్రి త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేస్తాడ‌ని కేటీఆర్ ఆశించాడు. యువ‌రాజు మ‌హారాజుగా ప‌ట్టాభిషిక్తుడు అవుతాడంటూ కేటీఆర్ తొత్తులు కొంద‌రు భజన ఆరంభించారు. కానీ కేటీఆర్ స‌మ‌ర్థతపై న‌మ్మ‌కం లేని కేసీఆర్ ఆయ‌న‌ను దూరం పెట్టారు. పోనీ 2023 ఎన్నిక‌ల త‌ర్వాతైనా త‌న‌కు ప‌ట్టం క‌డ‌తార‌ని భావిస్తే ప్ర‌జా తీర్పు ఆయ‌న‌ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. గొర్రెల కుంభ‌కోణం, మ‌ద్యం కుంభ‌కోణం, కాళేశ్వ‌రం క‌మీష‌న్ల బాగోతం, ఫోన్ ట్యాపింగ్‌లతో విసిగిపోయిన తెలంగాణ ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌ను ఓడించి వాత‌లు పెట్టారు. ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లిన త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు త‌మ‌ను ఎందుకు తిర‌స్క‌రించారో కేటీఆర్‌కు అర్థం కావడం లేదు. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌రుక్ష‌ణం నుంచే కేటీఆర్ విషం క‌క్క‌డం ప్రారంభించాడు. 2009లో త‌న‌తో పాటు ఎమ్మెల్యే అయిన రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోయాడు. ఒక సామాన్యుడు, అదీ ఒక రైతుబిడ్డ, వెనుక‌బ‌డిన పాల‌మూరు నుంచి వ‌చ్చిన రేవంత్‌రెడ్డిని ప్ర‌జ‌లు తమ నాయకుడిగా ఎన్నుకోవ‌డం కేటీఆర్ అహాన్ని దెబ్బ‌తీసింది. నాటి నుంచే రేవంత్‌రెడ్డిపైన, ప్ర‌జ‌ల‌పైన, వారి తీర్పుపైన నిప్పులు క‌క్క‌డం మొద‌లుపెట్టాడు. నానాటికీ దిగ‌జారుడు విమ‌ర్శ‌ల‌తో మూసీని మించిన మురికి వ్యాఖ్య‌లు చేస్తున్నాడు. మూసీకి ఒక‌ప్పుడు మంచి నీరు అందించిన చ‌రిత్ర ఉంది. కానీ కేటీఆర్‌కు, ఆయ‌న కుటుంబానికి ఏనాడూ మంచి మాట‌లు మాట్లాడిన గతం లేదు. కేటీఆర్ విమ‌ర్శ‌ల్లో నిజాయితీ లేదు, వాటికి ఒక ప్రాతిప‌దిక లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డం, అధికారం పోయిన త‌ర్వాత పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు ద‌క్క‌క‌పోవ‌డం, చివ‌ర‌కు బీఆర్ఎస్ఎల్పీ నాయ‌క‌త్వాన్ని సైతం కేసీఆర్ త‌న ద‌గ్గ‌రే ఉంచుకోవ‌డం, ఓ వైపు చెల్లెలి తిరుగుబాటు... ఇవ‌న్నీ కేటీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మ‌రోవైపు బావ హ‌రీశ్‌రావు పార్టీని హ‌స్త‌గ‌తం చేసుకుంటారేమోన‌న్న బెంగ ఆయనను వెంటాడుతోంది. ఈ ఒత్తిడినంతా ముఖ్య‌మంత్రిపై తిట్ల రూపంలో కేటీఆర్ వెళ్లగ‌క్కుతున్నాడు. ఇంట గెలిచి, ర‌చ్చ గెల‌వాల‌నేది సామెత‌. ముందు ఆయ‌న త‌న ఇంట్లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకొని త‌ర్వాత ముఖ్య‌మంత్రిపై విమ‌ర్శ‌లు చేయాలి. ప‌థ‌కాల్లో లోపాల‌పైన స‌ద్విమ‌ర్శ‌లు చేస్తే దానికి విలువ‌, ప్ర‌యోజ‌నం ఉంటుంది. అలాగాక బూతుల‌తోనే రెచ్చిపోతే రేపు జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు అభ్య‌ర్థులు దొర‌క‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంది.


ఎక‌రానికి రూ.12వేలు రైతు భ‌రోసా, ప్ర‌తి కుటుంబం తినేలా స‌న్న బియ్యం పంపిణీ, అన్న‌దాత‌ల‌కు రూ.21 వేల కోట్ల రుణ‌మాఫీ, స‌న్న వ‌డ్లు క్వింటాకు రూ.500 బోన‌స్‌, 77 వేల ఉద్యోగ నియామ‌కాలు, హాస్ట‌ల్ విద్యార్థుల‌కు డైట్‌, కాస్మొటిక్ చార్జీల పెంపు, మ‌హిళా సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాలు, ఆడ బిడ్డ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, 200 యూనిట్ల‌లోపు ఉచిత విద్యుత్‌, పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంతో తెలంగాణలో ప్ర‌తి ఒక్క ఇంటికి సంక్షేమ ఫ‌లాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అంద‌జేస్తున్నారు. కేవ‌లం ఏడాదిన్న‌ర‌లోనే తెలంగాణ పాల‌నా రంగంపై చెర‌గ‌ని ముద్ర‌వేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న మూడేళ్ల‌లో ఇదే రీతిలో పాల‌న కొన‌సాగిస్తే త‌మ పార్టీకి నామ‌రూపాలు ఉండ‌వ‌న్న విష‌యం కేటీఆర్‌కు తెలుసు. అందుకే పాల‌నాప‌ర‌మైన విమ‌ర్శ‌లు మాని నీచ‌మైన ప‌ద‌జాలంతో ముఖ్య‌మంత్రిపై కేటీఆర్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అధికారం, అహంకారంతో పాటు కేటీఆర్‌ అన్నిరకాల మ‌త్తులూ వదిలించుకొని, సంస్కార‌యుత‌మైన భాష మాట్లాడాలి. లేకపోతే ఇప్ప‌టికే చిత్త‌యిన బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ గడ్డ మీదనే భూస్థాపితం కావ‌డం ఖాయం.

-చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి లోక్‌స‌భ స‌భ్యులు, భువ‌న‌గిరి

Updated Date - Jul 25 , 2025 | 01:40 AM