Share News

Telangana Agriculture: ఖరీఫ్‌ సాగు సమస్యలు తీరేనా

ABN , Publish Date - May 28 , 2025 | 06:35 AM

విత్తనాలు, ఎరువులు సరఫరాలో లోటు, నకిలీ విత్తనాలు రైతుల్ని ఆపత్తులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం సాగు విస్తీర్ణం పెంచేందుకు, రైతులకు సకాలంలో సహాయం అందించాలని కోరుతోంది.

Telangana Agriculture: ఖరీఫ్‌ సాగు సమస్యలు తీరేనా

వానాకాలం పంటల సాగుకు సన్నద్ధం కావాలని... అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేసే కంపెనీలు, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని...’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వ్యవసాయశాఖ అధికార్లతో ఇటీవలే సచివాలయంలో జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ...ఇప్పటికే అన్ని జిల్లాలకు సరిపడ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని... ఈ సీజన్‌లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని రైతుల నుంచి డిమాండ్‌ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయని, సీఎంకు అధికారులు వివరించారు. కానీ, ఆచరణలో ప్రతి సంవత్సరం జరుగుతున్నది మరో విధంగా ఉంటున్నది. ఈ సంవత్సరం కూడా దానికి భిన్నంగా ఉండబోదని భావించాల్సి వస్తున్నది. మొత్తం విత్తన అవసరాల్లో ప్రభుత్వ విత్తన సరఫరా 20శాతం మాత్రమే. అలాగే ఎరువుల కొరత కూడా ఉంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని సాధారణం కంటే ముందే తాకాయి. తెలంగాణలో కూడా రుతుపవనాలు వ్యాపించాయి. ఫలితంగా రాష్ట్రంలో తొలకరి జల్లులు పడుతున్నాయి.


దీంతో రైతాంగానికి ఆశ కలుగుతోంది. గత ఏడాది అకాల వర్షాలు, నాసిరకం, కల్తీ విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవటం వంటి సమస్యలన్నీ రైతులను నష్టపరిచాయి. దీంతో రైతు ఆత్మహత్యలు కొనసాగాయి. ఇది బాధాకరమైన విషయం. అయినా సాగునే నమ్ముకొన్న రైతాంగం బాధల్ని దిగమింగుకొని మళ్ళీ ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు సిద్ధపడ్డారు. ‘తమది రైతు ప్రభుత్వమ’ని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖరీఫ్‌ సాగుకు అన్ని విధాలా తోడ్పడాలి. రాష్ట్రంలో ఈ సంవత్సరం కోటి 34 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ఖరీఫ్‌లో సాగు కానున్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 66.80 లక్షల ఎకరాల్లో, పత్తి 50 లక్షల ఎకరాల్లో... అలాగే మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న, సోయాబీన్‌, మినుములు, కంది, ఇతర ఉద్యానవన పంటలు వేయనున్నారు. ఇందుకు వరి విత్తనాలు 16.70 లక్షల క్వింటాళ్ళు, 90 లక్షల పత్తి ప్యాకెట్లు, క్వింటాళ్ల కొద్దీ సోయాచిక్కుడు విత్తనాలు అవసరం అవుతాయి. అయితే విత్తనాలు అందుబాటులో ఉంచామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా, విత్తనాల లోటును ఆసరా చేసుకొన్న వ్యాపారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రభుత్వం కఠిన చర్యల పేరుతో విత్తన కంపెనీలపై కాకుండా, అమ్మేవారిలో కొందరిపై చర్యలు చేపట్టి, చేతులు దులుపుకుంటున్నది.


ఇది నకిలీ విత్తన సమస్యకు పరిష్కారం కాదు. ఈ సందర్భంగా జన్యు శాస్త్ర్వేత్త సుమన్‌ సహాయ్‌ చెప్పిన మాటలు గమనార్హం. ‘‘విత్తనాలపై ప్రైవేట్‌, కార్పొరేట్‌ బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యం భారత్‌లో వ్యవసాయ రంగానికి పెనుముప్పుగా మారింది. అన్నదాతలకు నష్టాలను మిగల్చటంతో పాటు నేల సాంద్రత దెబ్బతినటంతో సహా అనేక దుష్పరిణామాలకు కారణమవుతోంది. హరిత విప్లవ సమయంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో విత్తనాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. మొదట్లో అవి విత్తనాలను ఉత్పత్తి చేయించి రైతులకు పంపిణీ చేయించేవి. క్రమేపీ వాటిని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు కార్పొరేట్‌, బహుళజాతి సంస్థల రాజ్యం నడుస్తోంది.’’ ‘‘సాగు విస్తీర్ణం లక్ష్యాలను ప్రైవేట్‌ రంగం తమకు అనుకూలంగా మార్చుకొంటోంది. రైతులను మోసం చేస్తోంది. కొనుగోలు చేసే రైతులకు రశీదులు ఇవ్వడం లేదు. విత్తన నాణ్యతను ముందుగా గుర్తించే వ్యవస్థ లేదు. పంటలు వేసి నష్టపోయిన తరువాతే లోపాలు బయటపడుతున్నాయి. మోసపూరిత సంస్థలపై చర్యల్లేవు. రైతులకు నష్టపరిహారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు.’’ ఈ పరిస్థితులన్నీ మారాలి. వాస్తవానికి ఖరీఫ్‌ సాగుకు విత్తనాలు, ఎరువులతో పాటు, రుణాలు, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులూ అవసరమే. అవి కౌలు రైతులతో సహా పేద, మధ్యతరగతి రైతాంగానికి సగం సబ్సిడీతో సకాలంలో ప్రభుత్వమే అందించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సరఫరా చేయాలి. అన్ని పంటలకు స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధర చట్టబద్ధంగా కల్పించి అమలు చేయాలి. ఇందుకు కేంద్ర, రాష్ట్ర పాలకులు తగిన ప్రణాళికలు రూపొందించి కృషి చేయాలి. అప్పుడే ఖరీఫ్‌ సాగుతో సంతృప్తికరమైన ఫలితాలు వస్తాయి.

-కెచ్చెల రంగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత ఐక్య రైతు సంఘం

Updated Date - May 28 , 2025 | 06:37 AM