జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలను నెలకొల్పాలి
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:50 AM
తెలంగాణలో 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నా, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇప్పటికీ కేవీలు లేవు. ప్రతి జిల్లాలో కనీసం ఒక కేవీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,254 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణలోని కేవీల సంఖ్య 35. ఇందులో అధికశాతం రాజధాని చుట్టు పక్కలే కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే 2016 లెక్కల ప్రకారం తెలంగాణలో 31 కేవీలు ఉన్నాయి. అంటే ఈ పదేళ్లలో రాష్ట్రంలో కేవలం 4 కేంద్రీయ విద్యాలయాలు మాత్రమే కొత్తగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు లేవు. ఉత్తర తెలంగాణలోని నిర్మల్, ఆసిఫాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో కేవీలు లేవు. మధ్య తెలంగాణలోని హైదరాబాద్(6), మేడ్చల్(9) జిల్లాల్లో మాత్రం ఇతర జిల్లాల్లో కంటే ఎక్కువ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలోని వనపర్తి, జోగుళాంబ, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ కేవీల ఊసే లేదు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, హనమకొండ, జనగాం, మెదక్, వికారాబాద్ జిల్లాల ప్రజలూ కేవీల ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా పలు జిల్లాల్లో కేవీలు లేకపోవడం వల్ల అక్కడి విద్యార్థులు ప్రామాణిక సీబీఎస్‌ఈ విద్యను కోల్పోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కనీసం ఒక కేవీ స్కూల్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి కేవీలను సాధించే దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ శాటిలైట్ పాఠశాలలు లేదా ఈ–కేవీల స్థాపనపై దృష్టి పెట్టాలి.
– పారుపల్లి ఆంజనేయులు
విద్యా పరిశోధకులు