Share News

Kashmir Local Militants: పహల్గాం మథనంలో కశ్మీరీలు

ABN , Publish Date - May 09 , 2025 | 02:04 AM

కశ్మీర్ లోయలోని యువత శాంతి, సమానత్వం, మరియు అభివృద్ధి కోరుకుంటూ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడాలని ఆశిస్తోంది. కశ్మీరీల కోసం నిజమైన న్యాయం మరియు సామర్థ్యంతో కూడిన సమాజ నిర్మాణం ముఖ్యం.

Kashmir Local Militants: పహల్గాం మథనంలో కశ్మీరీలు

శ్మీరీలుగా మేము ఎవరం? సంఘర్షణ వల్ల గుర్తింపు పొందాలని మేము కోరుకోవడం లేదు. మా సామర్థ్యాలతో మేము ఎవరమో నిర్ణయింపబడాలని కోరుకుంటున్నాం. ప్రపంచం నుంచి వేరుపడాలని మేము ఆశించడం లేదు. మేము కేవలం రాజకీయ పరిస్థితులకు బాధితులం మాత్రమే కాదు, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఇంకా సమున్నత వృత్తి నిపుణులుగా పేరుగాంచాలని మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం.’– ఇవి సోపోర్‌ పట్టణానికి చెందిన ఒక 17 ఏళ్ల విద్యార్థిని మాటలు. రక్త కాసారమై పోయిన కశ్మీర్‌ లోయలో ఆశాభావం, నైరాశ్యం ఎనలేని వ్యాకులతతో సహజీవనం చేస్తున్నాయి. కశ్మీరీ ముస్లిం గురించి గతానుగతమైన భావనల నుంచి బయటపడి జీవన ఉన్నతికి తోడ్పడే ఆకాంక్షాభరిత సమాజంలో భాగమయ్యేందుకు యువ కశ్మీరీలు ఆరాటపడుతున్నారు. ఆ ఆరాటం వారిని కొత్త ఆలోచనలకు పురిగొల్పుతోంది. నైరాశ్యాన్ని వీడి తెగింపుతో వ్యవహరించేలా ప్రోత్సహిస్తోది. అయితే తీవ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతున్నవారూ కచ్చితంగా ఉన్నారు. ఇది కొట్టివేయలేని వాస్తవం. కశ్మీరీ సమాజం సంక్లిష్టమైనది. సోపోర్‌ విద్యార్థిని శాంతి కోసం చేసిన విజ్ఞప్తికి సమాంతరంగా ప్రతీకారానికి పాల్పడితీరాలని కర్కశంగా ఇస్తున్న పిలుపులూ మీకు కశ్మీర్‌ లోయలో వినబడతాయి. సంఘర్షణలు ఎడతెగకుండా జరుగుతున్న ప్రదేశంలో చాలా మంది బహిరంగంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను వారిలో అంతర్గతంగా ఉన్న భయమే నిర్దేశిస్తుందనడం సత్యదూరం కానేకాదు. పహల్గాంలోని బైసరన్‌ హరిత మైదానంలో ఉగ్రవాదుల ఘాతుకం, దాని పర్యవసానాల ప్రభావంతో కశ్మీరీలు మళ్లీ మథనంలో పడ్డారు. పాత, కొత్త సమస్యలు అన్నిటినీ పరిగణనలోకి వివిధ దృక్కోణాలలో ఆ మథనం సాగుతోంది. సుడిగాలి వేగంతో కశ్మీర్‌ లోయలో విస్తృతంగా చేసిన పర్యటనలో నేను గ్రహించిన పది అంశాలను వివరంగా తెలియజేస్తాను. మొదటిది. పహల్గాం ఘటనపై కశ్మీరీ సమాజంలోని అన్ని వర్గాలలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. అవి నిర్నిబంధమైనవి. మనసు లోతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చివేయడం పట్ల సమస్త కశ్మీరీలు స్వతస్సిద్ధమైన భావోద్వేగాలతో ప్రతిస్పందించారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు వాటిని తాము ఖండించకపోవడం గురించి చాలా మంది పరితాపం చెందుతున్నారు.


భయంతో తాము మౌనంగా ఉండిపోవడం వల్లే ఉగ్రవాదులు మరింతగా తెగించుతున్నారని కశ్మీరీలు భావిస్తున్నారు. రెండవది. పహల్గాం పర్యాటకులలో హిందువులు ఎవరో గుర్తించి మరీ వారిని కాల్చివేయడం పట్ల కశ్మీరీలు తీవ్ర వేదనతో ప్రతిస్పందించారు. మత విద్వేషంతో జరిగిన ఘాతుకాన్ని వారు నిరసిస్తున్నారు. ఇస్లామిక్‌ తీవ్రవాదం ఇటీవలి దశాబ్దాలలో కశ్మీర్‌ లోయలోకి ప్రవేశించిన ఇస్లామిక్‌ తీవ్రవాదం కశ్మీరీ పండిట్‌లను స్వస్థలాల నుంచి వెళ్లగొట్టింది. ఇది, ఉదాత్త ‘కశ్మీరియత్‌’ భావనకు పూర్తిగా విరుద్ధమైనది. ఆ వెలివేత కశ్మీర్ చరిత్రకు ఒక తీరని కళంకం. మూడవది. పహల్గాం ఘటన కశ్మీర్ లోయలోని పాకిస్థాన్‌ మద్ద్దతుదారులకు విద్యద్ఘాతమయింది. కశ్మీరీ ప్రయోజనాలను కాపాడే శక్తిగా పాకిస్థాన్‌ను కశ్మీరీలు ఇంకెంత మాత్రం భావించడం లేదు. ఇంటెలిజెన్స్‌ వర్గాలవారి వైఫల్యం వల్లే పహల్గాం ఘటన సంభవించిందని విశ్వసిస్తున్నవారు సైతం పాకిస్థాన్‌ నాయకులు తమ బాధ్యతను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న వాదనలు పూర్తిగా మోసపూరితమైనవని ఖండిస్తున్నారు.నాల్గవది. స్థానిక మిలిటెంట్లకు దశాబ్దం క్రితం ఉన్న ఆదరణ, మద్దతు ఇప్పుడు లేనేలేదు.2016లో హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీని కొత్త మిలిటెన్సీకి ఒక పోస్టర్‌ బాయ్‌గా పరిగణించేవారు ఆ ఏడాది అతడు భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు తెలిపారు. స్వతంత్ర కశ్మీర్ కోసం పోరాడుతున్న వర్గాలలో మినహా ప్రజల్లో విస్తృత స్థాయిలో స్థానిక మిలిట్లెంట్లకు ఆదరణ, మద్దతు లభించడంలేదు. ఐదవది. కశ్మీర్‌ లోయలో పాకిస్థాన్‌కు మద్దతు గణనీయంగా తగ్గిపోయినప్పటికీ దానికి సమతుల్యంగా భారత రాజ్య వ్యవస్థతో సాన్నిహిత్యం పెరగలేదు.నిజమేమిటంటే మోదీ ప్రభుత్వం ముస్లిం –వ్యతిరేకి అని కశ్మీరీలు భావిస్తున్నారు. ఏకైక ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్‌కు 2019లో రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా కుదించివేసిన అనంతరం కశ్మీరీలలో ఆ భావన మరింత ప్రగాఢమయింది. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉంచేందుకే తమ రాష్ట్రానికి రాష్ట్ర హోదా రద్దు చేశారని కశ్మీరీలు భావిస్తున్నారు.


ఆరవది. కేంద్రం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మనస్తాపం చెందుతున్న కశ్మీరీలకు 2024 ఎన్నికలు ఎటువంటి ఊరట నివ్వలేదు. ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పట్ల సదభిప్రాయం ఉన్నప్పటికీ ఆయన తమ ప్రయోజనాలను కాపాడ గల నాయకుడుగా కశ్మీరీలు భావించడం లేదు. న్యూఢిల్లీ పాలకులు అనుసరిస్తున్న కశ్మీర్‌ వ్యతిరేక విధానాలపై పోరాడే పటిమ, చొరవ ఆయనకు లేవనే అసంతృప్తి కశ్మీరీలలో బాగా ఉన్నది. ఏడవది. కశ్మీర్ లోయలో అడుగడుగునా భద్రతా దళాల మోహరింపు కనిపిస్తుంది. తమను అడుగడుగునా నియంత్రించడాన్ని కశ్మీరీలు నిరసిస్తున్నారు. ఆ అణచివేత నుంచి బయటపడేందుకు వారు ఆరాటపడుతున్నారు. నిత్యం ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌లు, గాలింపు చర్యలు వారిని క్రుంగదీస్తున్నాయి. ఉగ్రవాద దాడి జరిగిన ప్రతిసారీ మిలిటెంట్‌ కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేని వారిని నానా వేధింపులకు గురిచేయడాన్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పహల్గాం ఘటన అనంతరం ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేని వారి గృహాలను సైతం కూల్చివేయడాన్ని వారు గర్హించారు. ఎనిమిదవది. భారత రాజ్యవ్యవస్థ నిరంకుశ పాలనకు తాము శాశ్వత బాధితులమనే భావన కశ్మీరీలలో ఉన్నది. ఈ కారణంగానే విశాల భారతదేశంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఒక కశ్మీర్‌ విద్యార్థి వేధింపులకు గురవుతున్నాడన్న వార్త కశ్మీర్ లోయ అంతటా దావానలంలా వ్యాపిస్తోంది. ‘ప్రధానస్రవంతి’ భారతీయులు తమను ఉద్దేశపూర్వకంగానే ‘జాతి–వ్యతిరేకులు’గా ప్రచారం చేస్తున్నారని కశ్మీరీలు చాలా మంది వాపోతున్నారు. ఉగ్రవాద చర్యలు చోటుచేసుకున్న ప్రతిసారీ తమను ఏదో ఒక విధంగా ఉమ్మడి శిక్షకు గురి చేస్తున్నారని కశ్మీరీలు కలత చెందుతున్నారు. తొమ్మిదవది. కశ్మీరీలకు శాంతి, ఐశ్వర్యాల లబ్ధి సమకూరేందుకు అవకాశాలు అధికంగానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో కశ్మీర్ లోయకు పర్యాటకులు వెల్లువెత్తడం ప్రారంభమయింది.


కశ్మీర్‌ పర్యాటక ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుంది. సరిగ్గా ఈ తరుణంలో చోటుచేసుకున్న పహల్గాం ఉగ్రదాడి ఆ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. తక్కువ తలసరి ఆదాయం, అత్తెసరు ఉద్యోగ అవకాశాలతో కునారిల్లుతున్న కశ్మీరీలు తమ విలక్షణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ విశాల భారత ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ఆరాటపడుతున్నారు. కశ్మీరీల ఆకాంక్ష పదవ, చివరి పరిశీలనకు తీసుకువస్తుంది. బైసరన్‌ హత్యాకాండ ఎంత భీతావహాన్ని సృష్టించినప్పటికీ కశ్మీర్‌ లోయలో శాంతి స్థాపనకు అదొక కొత్త అవకాశాన్ని కల్పించింది! విడ్డూరమే అయినప్పటికీ ఇదొక వాస్తవం. ఉగ్ర దాడితో కశ్మీర్‌లోయ స్తబ్దమైపోయింది. హింసాకాండను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్న వారితో సంబంధాలు నెలకొల్పుకోవడం, వారి ఆందోళనలకు మద్దతునివ్వడం చాలా ముఖ్యం. బైసరన్‌ హతులకు నివాళిగా, ఇతర బాధితులకు సంఘీభావంగా శ్రీనగర్‌ నడిబొడ్డున కొవ్వొత్తుల ప్రదర్శనలు జరుగుతున్నాయి; సోపోర్‌ లాంటి పట్టణాలలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి; బైసరన్‌ హత్యాకాండకు పాల్పడినవారికి గరిష్ఠ శిక్ష విధించాలని కశ్మీర్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు; కశ్మీర్‌ లోయలో సర్వత్రా పాకిస్థాన్‌కు మద్దతు తగ్గిపోతోంది. ఇటువంటి సానుకూల పరిస్థితులలో భారత ప్రభుత్వమూ, పౌర సమాజమూ కశ్మీరీలతో అర్థవంతమైన రీతిలో ఆత్మీయ అనుబంధాలను పెంపొందించుకునేందుకు హృదయపూర్వకంగా ప్రయత్నించాలి. హిందూ– ముస్లిం ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగా వ్యవహరించకూడదు. కశ్మీరీలను లక్ష్యంగా చేసుకునే చర్యలు చేపట్టకూడదు; నిర్ణయాలు తీసుకోకూడదు. దుష్ట, విఫల పాకిస్థాన్‌ రాజ్య వ్యవస్థకు విరుద్ధంగా నిజమైన లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థకు నెలవుగా వర్ధిల్లుతున్న భారత్‌ ఆదర్శ స్ఫూర్తి ప్రాతిపదికన కశ్మీరీలకు సన్నిహితమవ్వాలి. భారత జాతీయ జీవన స్రవంతిలో తామూ భాగమేనన్న భావన వారిలో సుస్థిరంగా నెలకొల్పాలి.

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

Updated Date - May 09 , 2025 | 02:18 AM