Share News

Professor Aldas Janaiah: ఏ కోణంలోనూ కాళేశ్వరాన్ని సమర్థించలేం

ABN , Publish Date - Jul 02 , 2025 | 02:37 AM

పార్లమెంట్‌ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ గతం తెలిసీ కాళేశ్వరంపై ఎందుకీ నిందలు పేరుతో జూన్‌ 19న ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసం కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపించింది.

Professor Aldas Janaiah: ఏ కోణంలోనూ కాళేశ్వరాన్ని సమర్థించలేం

పార్లమెంట్‌ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ‘గతం తెలిసీ కాళేశ్వరంపై ఎందుకీ నిందలు’ పేరుతో జూన్‌ 19న ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసం కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపించింది. అది ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, కేవలం రాజకీయ కోణంలో రాసిన వ్యాసం. వినోద్ కుమార్ తన వ్యాసంలో తుమ్మిడిహెట్టి వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించడం అశాస్త్రీయమని, మేడిగడ్డ వద్ద నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకమే శాస్త్రీయమని వాదించారు. ఈ వాదన అవాస్తవమే గాక, ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం. 2015లోనే కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత పొందేందుకు రిటైర్డ్‌ ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ఆ కమిటీ తన నివేదికలో స్పష్టంగా తుమ్మిడిహెట్టి ప్రాంతమే ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలమని పేర్కొంది. భౌగోళికంగా తక్కువ ఎత్తులో ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి అనువు కాదని, అది ఆర్థికంగా తలకు మించిన భారమవుతుందని కూడా కమిటీ నివేదికలో హెచ్చరించింది. అయినా సరే, ఆ ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ సిఫారసులను పక్కకుపెట్టి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం’గా పునర్నామకరణం చేసి, ప్రాజెక్టు స్థలాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని తానే నిర్ణయించానని, ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానేనని కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రకటించారు. ఆ విధంగా, కేవలం మూడేళ్ళ లోపే ఈ ప్రాజెక్టును నిర్మించామని చెబుతూ, 2019లో అట్టహాసంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కానీ నాలుగేళ్ళు కూడా పూర్తికాకముందే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో కీలకమైన పిల్లర్లు కుంగిపోయాయి. దీనివల్ల బ్యారేజీలో నిల్వ చేసిన నీటిని సముద్రంలోకి వదిలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా, కేసీఆర్ ప్రభుత్వ కాలంలోనే మేడిగడ్డ బ్యారేజ్‌ను మూసివేయాల్సి వచ్చింది. ఈ అంశాలేవీ ప్రస్తావించకుండా, గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సమర్థించడమే ప్రధానంగా వినోద్‌ కుమార్‌ వ్యాసం కొనసాగింది. ఆయన వ్యాసంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2007లో ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు వ్యయంతో పోలుస్తూ, కాళేశ్వరం వ్యయాన్ని లక్ష కోట్ల రూపాయలకు పెంచడాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. నిజానికి, 2007లో ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి అప్పటి ప్రభుత్వం 2010లో నిర్మాణ వ్యయాన్ని రూ.38,000 కోట్లుగా తుది అంచనా వేసింది.


ఇందులో సుమారు 20 శాతం వ్యయాన్ని ఖర్చు చేయడంతో పాటు, ముఖ్యమైన నిర్మాణ పనులు 2014 నాటికి ప్రారంభమయ్యాయి. అంతేకాక, ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ఇలా ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉండగానే, 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అకస్మాత్తుగా నిలిపివేసింది. పేరు మార్చి రీడిజైనింగ్ పేరుతో ప్రాథమిక బారేజీని తుమ్మిడిహెట్టి ప్రాంతం నుంచి మేడిగడ్డకు మార్చింది. దీంతో ప్రాజెక్టు వ్యయం ఒక్కసారిగా లక్ష కోట్ల రూపాయలకు పెరిగింది. అప్పటికే ప్రాణహిత–చేవెళ్ల పథకంపై ఖర్చైన రూ.7,000కోట్ల వ్యయాన్ని లెక్కచేయకుండా, తనకు తానే నియమించిన రిటైర్డ్‌ ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ సిఫారసులను పూర్తిగా విస్మరించి, మేడిగడ్డ వద్ద బారేజీ నిర్మించారు. ఎలాంటి ఆర్థిక లేదా శాస్త్రీయ ప్రమాణాలను పాటించని ఈ భారీ వ్యయాన్ని ఎలా సమర్థించగలం? రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఈ అంశాలపై అవగాహన లేదంటే ఎవరు నమ్మగలరు? ఇంకొక ముఖ్యమైన అంశం: కేంద్ర ప్రభుత్వ విభాగమైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన నివేదికలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై చేసిన కీలకమైన ఆర్థిక, శాస్త్రీయ అభ్యంతరాలను వినోద్ కుమార్ తన వ్యాసంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగ్ నివేదిక ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టు సమాజానికి లాభసాటిగా ఉండే ప్రాజెక్టు కాదని స్పష్టంగా వెల్లడైంది. ఖర్చు చేసిన ప్రతి 100 రూపాయలకు కేవలం 52 రూపాయల లాభమే సమాజానికి లభిస్తుందని నివేదిక పేర్కొంది. అంతేగాక, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తిగా పూర్తిచేయాలంటే అదనంగా మరో రూ.50,000 కోట్లు అవసరమవుతాయని కాగ్ తెలిపింది. ఇప్పటివరకు ఖర్చు చేసిన లక్ష కోట్ల రూపాయల పెట్టుబడికి సరైన ఫలితాలు రాకపోవడమే కాకుండా, నిర్వహణ వ్యయం కూడా చాలా అధికంగా ఉంటుందని కాగ్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చయ్యాయి.


ఇప్పుడు మరో రూ.50వేల కోట్లు ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం? పైగా, ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు సమాజానికి ఉపయోగపడుతుందనే నమ్మకానికి ఎటువంటి ఆధారాలు లేకపోవడం విషాదకరం. ఉదాహరణకు, 2022–23, 2023–24 సంవత్సరాల్లో తెలంగాణ సుమారు 250 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచినప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టేనని గొప్పగా చెప్పుకుంది. అయితే 2023 అక్టోబరులో కాళేశ్వరం బ్యారేజ్‌లో పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేశాక కూడా, 2023–24లో రాష్ట్రం వరి ఉత్పత్తి మరింతగా పెరిగి సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నులతో రికార్డు స్థాయికి చేరింది. దీన్ని బట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే వరి ఉత్పత్తి పెరిగిందన్న వాదనలో ఏమాత్రం నిజం లేదని అర్థమవుతుంది. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరగటానికి ప్రధాన కారణాలు 2014 నుంచి 2024 మధ్య కాలంలో రైతుల స్వంత ఖర్చుతో తవ్వించుకున్న బోరుబావుల సంఖ్య 16 లక్షల నుంచి 30 లక్షలకు పెరగడం, గడచిన దశాబ్దంలో వర్షపాతం అనుకూలంగా ఉండడం, అలాగే రైతుల కృషి! అంతేతప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకూ, పెరిగిన వరి ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు. కాబట్టి, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిన ఈ ప్రాజెక్టుపై ఇక మరింత ఖర్చు చేయకుండా, దాని బదులు ఇప్పటికే సుమారు 80 శాతం పూర్తయిన ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెడితే మంచిది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా కొన్ని ముందడుగులు వేస్తున్న నేపథ్యంలో, అభివృద్ధిని కోరుకునే అన్ని వర్గాలు కూడా ఈ విషయాన్ని ఇదే దృక్కోణంలో ఆలోచించాలి.

ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఉపకులపతి,

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం

Updated Date - Jul 02 , 2025 | 02:43 AM