Share News

Kakani Venkataratnam: ప్రజా నాయకుడు ‘కాకాని’

ABN , Publish Date - Dec 25 , 2025 | 02:42 AM

నాయకులు చాలా మంది ఉంటారు. ప్రజా నాయకులు కొందరే అవుతారు. కాకాని వెంకటరత్నం అందుకు ఓ ఉదాహరణ. ఆయన చనిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అయినా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవడమే...

Kakani Venkataratnam: ప్రజా నాయకుడు ‘కాకాని’

నాయకులు చాలా మంది ఉంటారు. ప్రజా నాయకులు కొందరే అవుతారు. కాకాని వెంకటరత్నం అందుకు ఓ ఉదాహరణ. ఆయన చనిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అయినా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవడమే కాక, ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రజా పోరాటాలలో నిమగ్నుడైన ఆయనను ‘ఉక్కు కాకాని’ అని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు.

కుల మతాలకి అతీతంగా ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం, ముఖ్యంగా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లంటే కాకానికి ప్రత్యేక అభిమానం. స్థానిక పనుల కోసం ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడకూడదని, స్థానికంగా ప్రజలు సహకరించుకుంటే ప్రజాస్వామ్యం బలపడుతుందని కాకాని ప్రచారం చేసేవారు. ఆయనది ఎలిమెంటరీ స్కూల్ చదువే, అయినా ఎన్నో వేల మంది పెద్ద చదువులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులే కొద్దో గొప్పో విద్యాలయాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేశారు.

వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమ మంత్రిగా కాకాని ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు అమోఘం. గ్రామాల్లో పేదరికాన్ని, ముఖ్యంగా ఒంటరి మహిళ ఆర్థిక స్థితిగతులు మారాలంటే, వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం పాడి, గుడ్డు ముఖ్యమని గమనించి, ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాడిపరిశ్రమలో మధ్యవర్తుల బెడదపోతేగాని బీదరికాన్ని నిర్మూలించలేమని నిర్ణయించుకున్నారు. నేను 1952లో రాజకీయ ఓనమాలు నేర్చుకుంది ఆయన ద్వారానే. గుజరాత్‌ రాష్ట్రం ఆనంద్‌లో ఉన్న నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) ద్వారా మార్పులు తీసుకురావచ్చు అని భావించారు. ఆ సంస్థ చైర్మన్‌ను అత్యవసరంగా కలవాలి అని బరోడాలో ఉన్న నన్ను కోరారు. కురియన్‌తో గంటసేపు సమావేశం అయ్యాం. పొడిపొడి ఇంగ్లీషులో కురియన్‌ని కాకాని ఎంతో మెప్పించారు. మహిళలని ఎలా ఆదుకోవచ్చో ఆయన చెప్పిన విధానం నాకు ఇప్పటికీ గుర్తు.


కాకాని వ్యవసాయం, పాడి పరిశ్రమల మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారనేది 50 సంవత్సరాల తర్వాత కూడా రాజకీయ పార్టీలకతీతంగా చెప్పే విషయం. కృష్ణా జిల్లాలో చాలామంది ప్రజలు 80 సంవత్సరాల క్రింద జిల్లా బోర్డు ప్రెసిడెంట్‌గా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ముఖ్యంగా ఆయన విద్య, వ్యవసాయం, రహదారి రంగాల్లో తీసుకున్న శ్రద్ధ... ప్రతి గ్రామంలో పాఠశాలలు పెట్టించిన విధానం... స్థానికులను ఏ విధంగా పురికొల్పి, పాల కేంద్రాల ఏర్పాటులో పాత్రధారులను చేశారు అనేవి గొప్ప విషయాలు.

గ్రామాల్లో ఆయన సాధించిన విజయాలు చూసి జమీందార్లు, ఎంతోమంది భూ కామందులు కలిసి కాకానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కాకుండా ప్రయత్నించారు. అయినా కాకాని ప్రజానాయకుడుగా పేరొందారు. సిద్ధాంతాలని వ్యతిరేకించి, రైతు కూలీలకు కాకాని వెంకటరత్నం నమ్మే నాయకుడు అవ్వడం కమ్యూనిస్టులకి నచ్చలేదు. వాళ్ళ పార్టీ భవిష్యత్తు, మనుగడకే ఆయన ముప్పు అని భావించారు. కమ్యూనిస్టు పార్టీ కాకాని మీద కత్తి కట్టి, ఆయన్ని చంపే ప్రయత్నాలు కూడా చేసింది. అయితే వాళ్లెవరూ కాకాని లంచగొండి అని శంకించకపోగా, ఆయన కార్యదీక్ష, క్రమశిక్షణను మెచ్చుకున్న వాళ్లే.

కాకాని వెంకటరత్నం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కూడా 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, యువకులకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో చెప్పి, ఉద్యమాన్ని ఉధృత స్థితికి తీసుకువెళ్లారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాల్ని, వ్యతిరేకిస్తూ గన్నవరం విమానాశ్రమంలో ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు విమానం ఆగకుండా జరిగిన కాండలో యువకుల మీద పోలీసులు జరిపిన కాల్పులను తట్టుకోలేక కాకాని చివరకు ప్రాణాలే విడిచారు.

కాకాని ఆశించిన ప్రత్యేక రాష్ట్రం 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలయినా ఇంతవరకు ఆయన జ్ఞాపకార్థం ఏ అభివృద్ధి కార్యక్రమం, స్ఫూర్తి చిహ్నం చేపట్టలేదు. అంతకు ముందెప్పుడో పెట్టిన కాకాని విగ్రహాన్ని కూడా తొలగించారు. విజయవాడలో ఆ సర్కిల్‌ని కాకాని పేరుతో కాకుండా ‘బెంజ్‌ సర్కిల్‌’ అనే పిలుస్తున్నారు. ఎట్టకేలకు కాకాని విగ్రహాన్ని బ్రిడ్జి కింద అతి కష్టం మీద మళ్లీ పెట్టారు, అదీ జిల్లా ప్రముఖుల పట్టుదల వల్ల. కనీసం ఈ 54వ వర్ధంతికైనా కాకాని వెంకటరత్నం పేరు మీద ‘అమరావతి అవుటర్‌ రింగ్ రోడ్డు’కు పేరు పెట్టాలి.

డాక్టర్ నాగులాపల్లి భాస్కర్‌రావు

వ్యవస్థాపకులు, సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌

(నేడు కాకాని వర్ధంతి)

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..

Updated Date - Dec 25 , 2025 | 02:42 AM