సామాజిక విప్లవ ప్రవక్త
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:09 AM
‘దేశమనే దేహానికి శూద్రులే ప్రాణం.. వారే రక్తనాళాలు’- ఈ మాటలు అనేక సందర్భాలలో నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. మహాత్మా జ్యోతిబా ఫూలే. ప్రజాస్వామ్యం...
‘దేశమనే దేహానికి శూద్రులే ప్రాణం.. వారే రక్తనాళాలు’- ఈ మాటలు అనేక సందర్భాలలో నాకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. మహాత్మా జ్యోతిబా ఫూలే. ప్రజాస్వామ్యం పరిణతి చెంది.. పరిఢవిల్లుతున్న వర్తమాన సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కుల వ్యవస్థ ప్రాతిపాదిక సమాజ గమనం ఉన్న సమయంలో.. అంటరానితనం కొన్ని కోట్ల మంది జీవితాల్లో అతి సామాన్యమైన విషయంగా ఉన్నప్పుడు-, ఒక వ్యక్తి అణగారిన జీవితాల గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం.. దానివల్ల ఎదురయిన కష్టనష్టాలను ఓర్చుకొని ముందుకు సాగటం అంత సులభం కాదు. అందుకే ఈనాటికీ మనకు జ్యోతిబా ఫూలే ఆరాధ్యుడయ్యాడు. కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచి ఉన్నాడు. ‘మహాత్మా’ అనే బిరుదు మన దేశంలో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి మనకు స్వాతంత్ర్యాన్ని తేవటంలో కీలక భూమిక పోషించిన గాంధీకి. రెండోది మన సమాజానికి పునాదిరాళ్లుగా నిలిచిన నిమ్న వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన ఫూలేకి.
19వ శతాబ్దంలో దళితుల పరిస్థితి కడు దీనంగా ఉండేది. జీవితాలు చాలా దుర్భరంగా ఉండేవి. అడుగడుగునా అవమానాలు ఎదురవుతూ ఉండేవి. ఇలాంటి సామాజిక నేపథ్యంలో ఫూలే 1827, ఏప్రిల్ 11న ప్రస్తుత మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవటం ఆయన జీవితంలో ఒక విషాదం. ఆ రోజుల్లో పాఠశాల విద్య అతి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. అణగారిన వర్గాల కోసం కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవ మిషనరీలు పాఠశాలలను ప్రారంభించాయి. ఫూలే అలాంటి ఒక పాఠశాలలో విద్యను అభ్యసించాడు. ఆ సమయంలో ఒక రోజు తన స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు. ఆ స్నేహితుడు బ్రాహ్మణుడు. పెళ్లి ఊరేగింపులో స్నేహితుడి కుటుంబ సభ్యులు కొందరు ఫూలేను తీవ్రంగా అవమానించారు. అది ఫూలే జీవితాన్ని మలుపు తిప్పింది. సమాజంలోని శూద్రులు, అతి శూద్రులకు ప్రతి రోజు ఎదురవుతున్న కుల వివక్షపై స్పష్టత రావటానికి ఈ వ్యక్తిగత అనుభవం ఆయనకు ఒక పునాది. 1840లో 13వ ఏట ఫూలేకు సావిత్రి బాయితో వివాహం జరిగింది. ఈ వివాహం ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. శూద్ర, అతిశూద్రుల పరిస్థితులు బాగుపడాలంటే -విద్యను ఒక ఆయుధంగా మలుచుకోవాలని ఫూలే భావించాడు. విద్య వల్ల సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన కలగటమే కాకుండా.. కలిసి చేయాల్సిన పోరాటానికి నేపథ్యం ఏర్పడుతుందనేది ఆయన భావన. ఈ దిశగా ఆయన 1848లో అంటరాని బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు. ఆ సమయంలో అది ఒక విప్లవం. ఈ పాఠశాల విజయం సాధించటంతో రెండో పాఠశాలను కూడా మొదలుపెట్టాడు. పగటిపూట పనికి వెళ్లే బాలికలు చదువుకోవటం కుదరదు కాబట్టి 1855లో రాత్రి బడులు ప్రారంభించాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటూ- దానికి తగినట్లు వ్యూహాలను రచించటంలో ఫూలే విజయం సాధించాడు.
అణగారిన వర్గాల అభివృద్ధిలో స్త్రీ, పురుషుల వివక్ష కూడా కారణమని ఆయన భావించాడు. మహిళలకు సాధికారత లభిస్తే- వారు మంచి విలువలు కలిగిన సమాజానికి ఆలంబనగా నిలుస్తారని నమ్మాడు. 19వ శతాబ్దంలో మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. భార్యాభర్తల మధ్య వయస్సు వ్యతాసం ఎక్కువ ఉండటం వల్ల భర్తలు త్వరగా మరణించేవారు. మహిళలు వితంతువులుగా మారేవారు. వీరి పట్ల సమాజంలో చాలా చులకనభావం ఉండేది. వీరికి రెండో వివాహం చేయటానికి ఫూలే పూనుకున్నాడు. వితంతు పునర్వివాహాల వల్ల అనేక మంది మహిళల జీవితాలు బాగుపడ్డాయి. అలాంటి మరో సున్నితమైన సమస్య- వితంతువులు గర్భిణులు కావటం. చాలా మంది వితంతువులు గర్భస్రావం చేయించుకోవటానికి ప్రయత్నించేవారు. వీరిలో చాలా మంది మరణించేవారు కూడా! ఫూలే వీరికి అండగా నిలవటంతో పాటు వితంతు గర్భస్రావ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించాడు. ఈ సమస్యపై పోరాడిన తొలి వ్యక్తి ఫూలే.
మానవ ప్రస్థానంలో -‘సత్యం.. సమానత్వం’ అనేవి రెండు ప్రాథమిక సూత్రాలని.. అణగారిన ప్రజలు అభివృద్ధి చెందటానికి ఇవే ప్రాతిపదికలని భావించి ‘సత్యశోధక్ సమాజ్’ అనే సంస్థను ఫూలే ప్రారంభించాడు. వర్ణవ్యవస్థలో అనేక అవమానాలకు గురయినవారు, అగ్రకులాల ఆధిపత్యం వల్ల బానిసలుగా మారినవారు, బానిసత్వమే తమ జీవనమనే అమాయక భావనలలో ఉన్నవారిలో చైతన్యాన్ని తీసుకురావటమే ఈ సంస్థ ఉద్దేశం. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఫూలే రాసిన ‘గులాంగిరి’లోని భావనలు కొన్ని కోట్ల మందిలో ఆలోచనలు రేకెత్తించాయి. వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేలా చేశాయి. తన జీవితం మొత్తం నిమ్న కులాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ఫూలే 1890, నవంబర్ 28న కన్నుమూశారు. ఫూలే మరణించి 130 ఏళ్లు దాటినా- ఆయన ఆలోచనలు ఈ రోజుకు అణగారిన వర్గాలలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. కోట్లాది ప్రజలు ఆయనను మహాత్ముడిగా కొలుస్తున్నారు.
వర్తమాన సమాజంలో జ్యోతిబా ఫూలే ఆలోచనలకు చాలా ప్రాధాన్యం ఉంది. చాలాకాలంగా వెనకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే అలవాటు ప్రబలంగా ఉంది. ఈ దృష్టి కోణాన్ని మార్చుకొని వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా చేయాలి. నిరుపేద బీసీలకు మోడల్ స్కూల్స్ ప్రారంభించటం, ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకొనేలా స్కాలర్‌షిప్‌లు ఇవ్వటం, సంప్రదాయ వృత్తులలో ఉన్నవారికి అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందించి వారి ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరేలా చేయటం, బ్యాంకుల నుంచి రుణాలు అందించటం... మొదలైన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అందిస్తున్నాం. ఇవన్నీ వెనకబడిన వర్గాల వారికి ఉపకరమవుతాయి. వీటితో పాటు- సమానత్వం అనేది అన్ని వర్గాల వారిలో ఒక కుటుంబ విలువగా మార్చేందుకు కృషి చేయాలి. సత్యశోధక్ సమాజ్ వంటి సంస్థలు దీనికి మరింత చేయూత నివ్వాలి. అప్పుడే ఫూలే కలలు కన్న సత్యం, సమానత్వం సాధించగలుగుతాం.
పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
(నేడు జ్యోతిబా ఫూలే జయంతి)
For AndhraPradesh News And Telugu News