Share News

Singareni Employees: సింగరేణి మెడికల్ కోటా 50 శాతానికి పెంచాలి

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:13 AM

సింగరేణిలోని సిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో ఉద్యోగుల పిల్లలకు ప్రస్తుతం 5 శాతం కోటా సీట్లను అమలు చేస్తున్నారు.

Singareni Employees: సింగరేణి మెడికల్ కోటా 50 శాతానికి పెంచాలి

సింగరేణిలోని ‘సిమ్స్‌’ మెడికల్‌ కాలేజీలో ఉద్యోగుల పిల్లలకు ప్రస్తుతం 5 శాతం కోటా సీట్లను అమలు చేస్తున్నారు. కానీ ఈ కోటాను 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. రామగుండంలోని ‘సింగరేణి ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ & సైన్సెస్‌’ (SIMS)లో మొత్తం 150 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో 23 సీట్లు ఆలిండియా కోటాకు అధికారులు కేటాయించారు. మిగిలిన 127 సీట్లలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు 5 శాతం.. అంటే కేవలం 7 సీట్లు మాత్రమే కేటాయిస్తున్నారు! దీనివల్ల సింగరేణి ఉద్యోగుల పిల్లలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. ఈ వైద్య విద్యాసంస్థలో నియత ప్రాతిపదికన, ‘నీట్‌’ మెరిట్ ఆధారంగా మాత్రమే విద్యార్థుల ఎంపిక జరుగుతోంది. సిమ్స్‌లో తమ పిల్లలకు కనీసం 15–25 శాతం కోటా అవసరమని సింగరేణి ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో సుమారు 42 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గనుల్లో నిత్యం ప్రమాదకరమైన పనులు చేస్తూ, సంస్థ అభివృద్ధికే తమ జీవితాల్ని అంకితం చేశారు. వారి పిల్లలకు వైద్య విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించడం న్యాయం మాత్రమే కాదు, అది ప్రభుత్వ బాధ్యత కూడా.


SIMS ఏర్పాటు కోసం ‘ఎస్‌సీసీఎల్‌’ గతంలో సుమారు రూ. 500 కోట్లకు పైగా తన సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి ఖర్చు పెట్టింది. అంత పెట్టుబడి పెట్టినందుకైనా వారికి ప్రతిఫలం ఇవ్వాలని సింగరేణి ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానికులైన వారి పిల్లలు సిమ్స్‌లో వైద్యవిద్యను అభ్యసించి, తిరిగి ఆ ప్రాంతంలోనే సేవ చేస్తే, గ్రామీణ వైద్యరంగం బలోపేతమవుతుంది. స్థానిక వనరులతోనే సేవలను సమర్థంగా అందించగలిగే అవకాశముంటుంది. నీట్‌ వంటి కఠినమైన పరీక్షలకు సంబంధించిన పోటీతో వారి పిల్లల్లో స్ఫూర్తితో పాటు విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి. ఈ కోటా పెంపుతో అనేక ప్రయోజనాలున్నాయి. అయితే ఈ సీట్ల పెంపు డిమాండ్‌ శాతం పలు రకాలుగా ఉంది. ప్రస్తుతం కోటా శాతం సీట్ల సంఖ్య 150. ప్రస్తుతం సింగరేణి పిల్లలకు ఇస్తున్న కోటా 5 శాతం (7 సీట్లు). ఉద్యోగ సంఘాల డిమాండ్‌ ప్రకారం చూస్తే 15 శాతం (22 సీట్లు). నియోజకవర్గం/MLAల సిఫార్సుల మేరకు 25 శాతం (37 సీట్లు), కుటుంబ సంక్షేమానికి సరైన ప్రాతినిధ్యం వహించేలా నిర్ణయిస్తే 50 శాతం (75 సీట్లు) కేటాయించవలసి ఉంటుంది.


అయితే ఇలా సీట్ల కోటా పెంచడం వల్ల అనేక సవాళ్లు తలెత్తుతాయి. కానీ వాటికి పరిష్కార మార్గాలున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కుల, ఇతర కోటాలతో కలిపి 50శాతం మించకూడదు. కొత్త కోటాను అమలుచేసే టప్పుడు జాతీయ చట్టాల ప్రకారం కచ్చితంగా అమలు చేయాలి. ఎస్‌సీసీఎల్‌ కోటాలోనూ నీట్‌ మెరిట్‌ను తప్పనిసరిగా అనుసరించాలి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్య్లూఎస్‌ ఉప–వర్గీకరణనూ వర్తింపజేయవచ్చు. సామాజిక న్యాయభావన పరంగా చూస్తే.. ఇతర సామాజిక వర్గాలవారు ఈ కోటా పెంపును అన్యాయంగా భావించే అవకాశం ఉంది. అందుకే దశలవారీగా అమలు చేయడం ద్వారా సామాజిక సమతుల్యతను సాధించవచ్చు. కోటా సీట్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. ఉద్యోగుల పిల్లలు అనే అర్హత నిర్ధారణకు ఎస్‌సీసీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలి. నీట్‌ ర్యాంక్ ఆధారంగా స్పష్టమైన ఎంపిక వ్యవస్థ ఉండాలి. ఈ కోటా పెంపును దశలవారీగా అమలు చేయాలి. ఉదాహరణకు.. వైద్య విద్య మొదటి సంవత్సరం: 15 శాతం కోటా (2025), రెండో సంవత్సరం: 30 శాతం (2026), మూడో సంవత్సరం: 50 శాతం (2027) అమలు చేయడం ఉత్తమం. ఈ దశలవారీ పెంపు ద్వారా సమర్థతను పరిశీలించి, సామాజిక ప్రశాంతతను కాపాడవచ్చు.


ఈ కోటా అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలి. ఆరోగ్యశాఖ ద్వారా ప్రత్యేక జీవో జారీ చేయించాలి. ఎస్‌సీసీఎల్‌ యాజమాన్యం, ఉద్యోగ సంఘాలతో సంప్రదించి నిబంధనలు రూపొందించాలి. నియంత్రణ కోసం ‘మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీ’లను ఏర్పాటు చేయాలి. ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా అభ్యర్థుల వివరాలు, ఎంపికల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధికి సుదీర్ఘకాలంగా చురుకైన భాగస్వామి. వారి కుటుంబాల అభివృద్ధికి ఈ మెడికల్ కోటా 50 శాతం పెంపుతో.. వైద్య విద్యార్థులకు సమాజం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లవుతుంది. స్థానిక యువతలో వైద్యవిద్యపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో స్ఫూర్తిని, సమాజానికి సేవ చేసే తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కోటా పెంపుతో కేవలం విద్యావకాశాలే కాదు.. ఒక ప్రాంతీయ న్యాయానికి, సేవల పట్ల సమాజ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.

-దాసారపు శ్రీనివాస్‌ కన్వీనర్‌,

కోల్‌బెల్ట్‌ డాక్టర్స్‌ ఫోరమ్‌

Updated Date - Jul 16 , 2025 | 01:13 AM