Share News

Jupaka Subhadra Poem: అంగడి అందాలు

ABN , Publish Date - May 05 , 2025 | 03:09 AM

జూపాక సుభద్ర ఈ కవితలో అందాన్ని ఆడవారి శరీరానికి మాత్రమే పరిమితం చేసే సమాజ దృష్టిని తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్‌, మార్కెట్‌, మల్టీ నేషనల్స్ దుశ్చర్యలపై ఆవేశంతో, ప్రతిఘటించే తెలంగాణ ఆడబిడ్డల హక్కుల గొంతుకను వినిపించారు.

Jupaka Subhadra Poem: అంగడి అందాలు

దునియా దేశాల మహిళామణుల్ని అందాల బందిఖానాలేసి హద్దు పొద్దెరుగకుంటా ఆడదేహాలతో ఆడే జూదాలు. లోకంల ఆడయినా, మగయినా, సెట్టయినా పిట్టయినా అందమంటే సూసే సూపు సుతారమే గానీ, రూపు గాదనే లెక్కున్నది. అందాలంటే ఆడోళ్లకే పేటెంట్స్ అంటగట్టి, గంటకొట్టింది పేట్రియార్కీ పెత్తనమే.

ఆడపిల్లలను అంగట్లమ్మి తక్కెట్ల జోకనీకి యేసీ యెసట్లేసి సాపలను ఎండబెట్టినట్టు, యేడా గింత కండ కానరాకుంట ఎండబెట్టి పారం కోళ్లోలే పడతుల తనువుల్ని తాకట్టు పెట్టే యాపార సోపాన సామ్రాజ్యాలకు, కార్పోరేట్ కాస్మెటిక్స్‌ల కరిగిచ్చి కమిరిచ్చి మరిగిచ్చి కొలతల కొలిమిల్లో కోతలు పడే ఫాన్సీ ప్లాస్టిక్ అంద సందాల విందులకు,

మహిళా మాంసం కొట్టులు బెట్టి సరుకు సౌదలు అమ్ముకునే సంతలకు, స్పాల, సర్జరీల, సూదులు గుచ్చి మాలిష్‌ల మర్దనల్ల లైఫోసక్షండ్ల ఫిక్సింగ్‌ల కుదిచ్చి కుదిలింపుల్ల కుదబడ్డ హంసలను హింసల బెట్టే మల్టీ కంపెనీ అంగడి గద్దలకు గీ మట్టికాళ్ళ మైసమ్మల గడ్డమీదనే గద్దేసి అందాల మీద కాసే పందాల పండుగైంది.

మా కళల కాంతుల్ని కండ్లకద్దుకొని, నాగరిక వైభవ వారసత్వ సంపదను సంకనేసుకొనేదంతా,

గీ గడ్డ మీది వనరుల్ని బైటి దేశాల పెట్టుబడి పెయిని నింపుకొని పెంపు జేస్కోనీకే. రామప్ప రాగిణీ సరాగాల సంగతుల్ని సముద్రాల్ని సవ్వాల్ జేసే సెరువు బరువుల్ని సెరిగి పోని సేనేత పోత సెంగావి హంగుల్ని నెత్తురు చుక్క నేలరాలని విప్లవం విరాజిల్లిన బౌద్ధ ఆనవాళ్లను అద్దుకున్న బుద్ధవనాన్నీ ముద్దాడబోయే బ్యూటీలూ మీ రూరల్ టూరిజం దారుల, హెరిటేజ్ వాక్‌ల ఎదురయ్యే ఉపాధి పనులను


ఉప్పుసకన్నా సూడుండ్రి తట్ట తలకెత్తుకోకున్నా నీడ లేని కాడ నిమిషం నిలుసోండ్రి ముక్కులు మూసుకోకుంట మున్సిపాల్టీ మురుగు సెత్తకాడ సీపురు సేత బట్టుండ్రి... మిలమిలలన్నీ మలమల మాడ్తయి. గీడ ఆడోల్ల అందాలంటే, తంగేడు, గునుగులు, తీరుగోరంటల నూరొక్క తియ్యటి పదాల సెమట సెరువు సెంపల బత్కమ్మ పాట. మన్ను వాసనల బొడ్డూడని బోనంకొండ ఆట.

గీడ యింకా మట్టితనాలు మాసిపోలే యెట్టితనాలు యెలిసిపోలే తెల్లారని తెలంగాణ తెప్ప వచ్చే వచ్చే పాయె పాయె. వూదు కాలింది లేదు, పప్పుడికింది లేదు శిశిరాలు శిథిలమ్‌ కాలే. అంతా, ధోకా, దగా. దోఖా దొర్లిపోలే దగా దాగిపోలే మోసపోయిన మొకమ్మీద గీ మిస్ వరల్డ్ అహో మహోదయాలు. బందూకులు బరిసెలు ఎక్కుబెట్టి నిలబడి కలెబడే అందం,

కొంగు నడుముకు సుట్టి కొడువండ్లు బట్టి సుక్కల్ని తెంపి కొప్పున ముడిసిన తాటి ముంజల తీపులు యీ గడ్డమీది ఆడబిడ్డలు. మాకు సందమామను అందుకొనే సదువుల సక్కదనాలు, ఉద్యోగాలు, వూల్లేలే ఉగాదులు, భూమి జాగల మీద, ఇండ్లు వాకిండ్ల మీద మా పేర్లకు పెద్దిర్కాల జెండాలు, ఆకాశమంత ఆత్మగౌరవ రాజ్యాలు, కులాలు కూలిపోయే మతాలు మట్టయే అందాల బందాలు, దాడులు, దండనలు, హత్యాచారాలు, ఔమానాలు తొంగి సూడని తొవ్వల


ఆడిపాడే వెన్నెల అందాలు, ఖగార్‌లను ఖలాస్ జేసే ఆకు బట్టిన అడివి అందాలు, పొరుగు దేశాల్ని పచ్చినెత్తుటి ముద్దను జేసే యుద్ధాలను పొలిమేర్లకు తరిమే పొద్దుల అందాలు కావాలే.

మల్టీ కంపినీ మార్కెట్‌లూ, మిస్ వరల్డ్ వనితలూ, గీ మా అందాలన్నీటిని దునియంతా దున్నిపోయుండ్రి లేకుంటే, గీ మీ పోటీల ఖేల్ ఖతం, దుకునమ్ బందు.

-జూపాక సుభద్ర

‘లైఫ్‌ డ్రామా’, ‘భూమి నవ్వడం చూశాను’ ఆవిష్కరణ

రాధకృష్ణ కర్రి ‘లైఫ్‌ డ్రామా’, అమూల్య చందు ‘భూమి నవ్వడం చూశాను’ కవితా సంపుటాల ఆవిష్కరణ మే 11 ఉ.10 గంటలకు విజయవాడలోని ఎంబీవీకే బాలోత్సవ్‌ భవన్‌లో జరుగుతాయి. ఆవిష్కర్త నగ్నముని. సభలో వసీరా, శాంతిశ్రీ, వాణిశ్రీ, సుధామురళి మాట్లాడతారు.

- లలిత పబ్లికేషన్స్


రెండుతరాల కవిసంగమం

రెండు తరాల కవి సంగమం, సీజన్‌ 2, సిరీస్‌ 40 కార్యక్రమం మే 10, సా.6గంటలకు సౌజన్యవేదిక, నిజాం కాలేజి ప్రాం గణం, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. పాల్గొను కవులు: ప్రసేన్, చిగురాల్ పల్లి ప్రసాద్, కల్యాణి కుంజ, బాలు అగ్నివేష్, మేనావథ్ రఘు (నిజాం కాలేజి విద్యార్థి).

-కవిసంగమం

పీచర సునీతారావు పురస్కారాలు

పీచర సునీతారావు చతుర్ధ వార్షిక పురస్కారాల కోసం కవిత్వంలో తండా హరీశ్ గౌడ్ (‘గాలి లేని చోట’); విమర్శలో ఎం. దేవేంద్ర (‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ’); కథా విభాగంలో పిన్నంశెట్టి కిషన్ (‘లేంబాళ వాటిక కథలు’), జడా సుబ్బారావు (‘మంచు కింద ఉక్కపోత’) ఎంపిక అయ్యారు. పురస్కార ప్రదానం మే 10 ఉ.10గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది.

-కాంచనపల్లి గోవర్ధన్ రాజు


‘కవితాదర్పణం’, ‘సీతాశతకం’ ఆవిష్కరణ

దర్పణం సాహిత్య వేదిక నిర్వహణలో చీదెళ్ళ సీతాలక్ష్మి రచించిన ‘కవితాదర్పణం’, శంకర నారాయణ రచించిన ‘సీతాశతకం’ గ్రంథాల ఆవిష్కరణ సభ మే 5 సా.5.30 ని.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత రాయారావు సూర్యప్రకాశ్ రావు, ముఖ్య అతిథి ఏనుగు నరసింహారెడ్డి. దాస్యం సేనాధిపతి, మామిడి హరికృష్ణ, నామోజు బాలాచారి, రామకృష్ణ చంద్రమౌళి తదితరులు పాల్గొంటారు.

-రాయారావు సూర్యప్రకాశ్ రావు

Updated Date - May 05 , 2025 | 03:14 AM