Revolutionary Poetry: ఉద్యమంతో కలిసి నడిచే జూలూరు పథం
ABN , Publish Date - May 05 , 2025 | 02:35 AM
జూలూరు పథం అనే దీర్ఘకావ్యం ద్వారా కవి గౌరీశంకర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను, రాజకీయ–సాంస్కృతిక వికాసాన్ని లోతుగా విశ్లేషించారు. ఈ కావ్యం తెలంగాణ ఆత్మకు అక్షరరూపంగా నిలుస్తుంది.
తెలుగు సాహిత్య రంగంలో ముఖ్యంగా తెలంగాణ సాహిత్యరంగంలో వెలుడిన దీర్ఘ కావ్యాల చరిత్ర కూడ సుదీర్ఘమైందే. 1930లలో సురవరం నుంచి మొదలుపెడితే కాళోజీ, సినారె, కవిరాజమూర్తి, చెరబండరాజు, వరవరరావు, ఎన్‌కే, గద్దర్, సిధారెడ్డి వరకు ఈ పరంపర సుదీర్ఘం. 1980లలో మినీకవిత పేరుతో కోస్తా కేంద్రంగా రూపవాదం తెలుగు సాహిత్య రంగాన్ని చుట్టుముట్టినప్పుడు దానిని తిరస్కరిస్తూ తెలంగాణ కేంద్రంగా విప్లవసాహిత్యంలో భాగంగా వరవరరావు ‘సముద్రం’, ఎన్‌కే ‘లాల్ బనో గులామి చోడో’, నందిని సిధారెడ్డి ‘పదఘటన ప్రతిఘటన’ వంటి దీర్ఘ కావ్యాలు రాసి దానిని తిరస్కరించారు. ఈ ప్రతిఘటన క్రమంలో తెలంగాణ నుంచి దీర్ఘకావ్యాలు వెలువడుతూనే వచ్చాయి. ఈ క్రమంలో వెలువడిన దీర్ఘకవిత ‘జూలూరు పథం’. ఈ కవిత నిడివి 230 పేజీలు. దీర్ఘకవిత అని కవి భావిస్తున్నా ఇది కావ్యమే. ఆ లక్షణాలు ఉన్నాయి. ఈ కావ్యరచన చేసిన కవి జూలూరు గౌరీశంకర్. ఈ కావ్యం ఇతివృత్తం మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ఇది జూలూరు పథం మాత్రమే కాదు, వందేళ్ళ తెలంగాణ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రస్థానం కూడా. సారాంశంలో చెప్పాలంటే ఇది తెలంగాణ ఆత్మకు అక్షరరూపం. అక్కడక్కడ ఉద్వేగం, ఆలోచనతోపాటు ఆధిపత్యం, దోపిడీలపై ధిక్కారం సమ్మిళితమై వెలువడిన కావ్యమిది. ఈ తరహా కావ్యాలు రాయడానికి బలమైన సామాజిక, రాజకీయ సందర్భం ఉండాలి. రాయపూనుకున్న కవికి సరైన రాజకీయ దృక్పథం ఉంటే ఆ కావ్యం పాఠకులకు చేరుతుంది. దీనిని కాళోజి కావ్యాలలో చూడవచ్చు. ‘జూలూరు పథం’ కావ్యానికి కూడ ఇది ఉన్నది. తెలంగాణ సాంస్కృతిక రంగ యోధులు– సురవరం, చందాల కేశవదాసు, సుద్దాల హనుమంతు, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి, తెలంగాణ సాయుధ పోరాటంపై చిత్రాలు వేసిన చిత్ర ప్రసాద్‌లు ఈ కావ్యంలో పాఠకులకు తారసపడతారు.
తెలంగాణ సాయుధ పోరాటానికి అండగా నిలిచిన ప్రాంతమిది. 1969 ఉద్యమం కూడ ఇక్కడ పెద్ద ఎత్తున జరిగింది. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతాల ఆధునిక వికాసానికి పూనుకున్న ప్రజాస్వామికవాది, స్వయంగా రచయిత అయిన నాయని వెంకట రంగారావు ఈ సంస్థానాధీశుడే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిని ఊదిన జయశంకర్‌పై ప్రత్యేకమైన అధ్యాయమే ఉన్నది. భిన్న భావ జాలాలకు చెందిన రాజకీయ బృందాలు ఒకే వేదికపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సిద్ధికి ఉద్యమించడాన్ని గుర్తించడం ద్వారా కవి స్థానికంగా ఉన్న ప్రజాస్వామిక విలువలకు పట్టం కట్టాడు. చరిత్ర గతిలో తెలంగాణ పొదివి పట్టుకున్న బహుళ సంస్కృతుల స్వభావాన్ని వివరించాడు. శతాబ్దాలుగా తెలంగాణ పోరాటాల ప్రస్థానాన్ని చెబుతూ పాలస్తీనా, క్యూబాలతో పోల్చి అంతర్జాతీయతను ప్రతిపాదిస్తాడు. హైదరాబాద్ సహ జీవన సంస్కృతిని విపులంగా చర్చించాడు. సమీప కాలానిదే అయినా తెలంగాణ గత చరిత్రను అనుసంధానించడం వల్ల ‘జూలూరు పథం’ దీర్ఘ కావ్యం ఇతిహాస లక్షణాలను సంతరించుకున్నది. ఆంధ్ర మహాసభ, సురవరం ప్రస్తావనలతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం, 1969 తెలంగాణ తిరుగుబాటు, జగిత్యాల జైత్రయాత్రను చాటుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ విస్తృతిని, న్యాయబద్ధతను విశ్లేషించాడు కవి. ఇవి కవికి ఉన్న చారిత్రక దృష్టిని పట్టి చూపుతాయి. అన్యాయంపై తెలంగాణ సమాజానికి ఉన్న తిరుగుబాటును, పోరాట స్వభావాన్ని పట్టుకోవడంలో ఈ కావ్యం సఫలమైంది. ఇంతేగాక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తారసిల్లిన ప్రతిమలుపును వ్యక్తీకరించడం ఈ కావ్యం ప్రత్యేకత. ఈ తరహా వైఖరి కాళోజి కవిత్వంలో కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ కావ్యం ప్రత్యేకత– స్థానికత, జాతీయత, అంతర్జాతీయత వ్యక్తం కావడం. జూలూరు ఈ కావ్యం వెలువరించడానికి నేపథ్యం ఆయన పుట్టి పెరిగిన ఊరు నడిగూడెం. ఇది మునగాల సంస్థానానికి రాజధాని కేంద్రం.
హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణదేవరాయ నిలయం, తెలుగు వారి ఆధునిక వికాసానికి ఎంతగానో కృషి చేసిన విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలుల స్థాపనలో ప్రముఖ పాత్ర ఆయనదే. ఈ నడిగూడెం పక్కన ఉన్న రేపాల గ్రామం తెలంగాణ నాటకరంగానికి చేసిన సేవ ఎంతో ఉన్నతమైంది. ఈ వాతావరణంలో పుట్టిన గౌరీశంకర్ అక్షరాలతో ఆడుకుని దీర్ఘ కవితా పథాన్ని రాజేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. మూడు కవితా ఉద్యమాలలో కీలక పాత్ర వహించిన కవి గౌరీ శంకర్. ఆ మూడు ఉద్యమాలలో ఒకటి దళిత కవితా ఉద్యమం. ఆయన తొలికావ్యం ‘పాదముద్ర’ ఈ ఉద్యమ ఆరంభంలోనే వెలువడింది. రెండవది– బహుజన కవితా ఉద్యమం. ఈ ఉద్యమ ఆరంభంలో వెలువడిన కావ్యం ‘వెనుక బడిన కులాలు, వెంటాడే కలాలు’. మూడవది తెలంగాణ కవితా ఉద్యమం. ఈ ఉద్యమం ఆరంభంలో వెలువరించిన సంకలనం ‘పొక్కిలి’. మొత్తం 15 దీర్ఘ కావ్యాలు, మూడు వచన కవితా సంపుటాలు వెలువరించి ‘పొక్కిలి’ తెలంగాణ ఉద్యమ కవితా సంకలనానికి సంపాదకత్వం వహించాడు. ఇప్పుడు ‘జూలూరి పథం’ ఆయన 16వ దీర్ఘ కావ్యం. కాళోజి వలే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తిరిగిన ప్రతి మలుపును కవిత్వీకరించడం ఈ కావ్యంలో కనిపిస్తుంది. తనను కదిలించిన ఏ దుస్సంఘటనకైనా, అన్యాయానికైనా వెంటనే స్పందించి రాయడం కాళోజీ విధానం; గౌరీ శంకర్ కూడ అంతే. కాళోజీ మొత్తం కవితా రచనను అధ్యయనం చేస్తే తెలంగాణ సామాజిక చరిత్రను నిర్మించవచ్చు. మొత్తంగా చూస్తే గౌరీశంకర్ కూడ అంతే. 1991 నుంచి ప్రతి రాజకీయ, సామాజిక సందర్భంపైనా దీర్ఘకావ్యం వెవలువరించాడు. ఈ నేపథ్యంలో చూస్తే ఈ కవి కాళోజికి అచ్చమైన వారసుడని చెప్పక తప్పదు.
- సామిడి జగన్ రెడ్డి
& 85006 32551