Share News

Seshendra Sharma: రక్షణతంత్రంలా కవిత్వాన్ని ఆశ్రయిస్తాను

ABN , Publish Date - Jun 16 , 2025 | 02:24 AM

బాల్యంలో మాక్సింగ్ గోర్కీ ‘అమ్మ’. అప్పుడంతగా కొరుకుడుపడలేదు కానీ ఆ పుస్తకంతో నాదొక ఎమోషనల్ జర్నీ. యవ్వనంలో బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ఇష్టంగా చదువుకున్నాను.

 Seshendra Sharma: రక్షణతంత్రంలా కవిత్వాన్ని ఆశ్రయిస్తాను

మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?

బాల్యంలో మాక్సింగ్ గోర్కీ ‘అమ్మ’. అప్పుడంతగా కొరుకుడుపడలేదు కానీ ఆ పుస్తకంతో నాదొక ఎమోషనల్ జర్నీ. యవ్వనంలో బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ ఇష్టంగా చదువుకున్నాను. ఇంటర్ డిగ్రీ చదివే రోజుల్లో ఆ పుస్తకం లోని కొన్ని వాక్యాలు చదువుకుని నిద్రపోవడం, మళ్ళీ పొద్దున్నే తలగడ కింద నుంచి పుస్తకాన్ని తీసి ఒకట్రెండు వాక్యాలు చదివి గానీ లేవకపోవడం. మతగ్రంథం లెక్కన్నమాట.


మీ పఠనాభిరుచి కాలంతోపాటు ఎలా మారింది?

చిన్నప్పుడు లాంతరు వెలుగులో నాన్న చదివి వినిపించిన పురాణాలు, నవలలు, కథలు, పద్యాలు నన్ను పుస్తక ప్రేమికుడిని చేశాయి. సహజత్వం మీద ఇష్టంతో జానపద కథల వెంట పడ్డాను. స్నేహితుల ప్రభావం ఊహల్లోంచి నేల మీదకొచ్చి పడేలా చేసింది. ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి సైన్స్ అనే మూడో చూపు అవసరాన్ని గుర్తించాను. మహీధర నళినీ మోహన్ నా అభిమాన కలం. యండమూరి – యద్దనపూడి అనే భిన్న ధ్రువాలతో యవ్వనం గడిచిపోయింది. ఆఖర్లో బుచ్చిబాబును చదవడం పెద్ద కుదుపు. వర్తమానంలో అమ్మలేని వెలితిని కవిత్వంతో పూడ్చుకున్నాను. నా దృష్టిలో కవిత్వం సంపూర్ణ ప్రక్రియ. అలా కాల్పనిక రచనలతో మొదలై సైన్స్‌ మీదుగా కవిత్వం గూటికి చేరుకున్నాను. కవిత్వం పట్ల మీ దృక్పథాన్ని మలిచిన పుస్తకాలేవి? నగ్నముని ‘కొయ్యగుర్రం’తో నాకు కవిత్వం అంతిమ లక్ష్యం తెలిసొచ్చింది. ‘I met my future’ అనిపించింది. వ్యవస్థ వాస్తవిక పార్శ్వాలన్నింటినీ కవిత్వం అనే సిల్వర్ స్క్రీన్‌ మీద చూపెట్టిన పుస్తకమది.


మీరు ఎక్కువసార్లు చదువుకున్న కవిత్వ సంపుటి ఏది?

శేషేంద్ర ‘ఆధునిక మహాభారతం’. రోజుకొక్క సారైనా గాయపడకుండా గడవని కాలంలో ఇది నా డగౌట్. కొన్నిసార్లు మనం అనుకున్న వాళ్ళే మన నుండి దూరంగా జరిగిపోతారు. మాటలతో ప్రవర్తనతో గాయపరుస్తారు. ఆ నిర్ఘాంతత కొన్నాళ్ళు కొనసాగుతుంది. ఇలాంటి సమయాల్లో ఒక రక్షణతంత్రంలా కవిత్వాన్ని ఆశ్రయిస్తాను. ఇంకొన్నిసార్లు ఎదురైన అనుభవాలు, కలిసిన వ్యక్తులు, చూసిన విన్న చదివిన సంఘటనలు భయపెడతాయి, బాధపెడతాయి. నిస్సహాయత చుట్టేస్తుంది. అలాంటప్పుడు శేషేంద్ర వాక్యాలు చదువుకుని మామూలు మనిషి అవుతాను. అవి కేవలం రసాత్మక వాక్యాలేనా? ఈ పట్టాల మీదే ప్రపంచం అనే రైలుబండిని అందుకున్నాను.


మీరు తరచూ మననం చేసుకునే కవిత్వ పంక్తులు?

శ్రీశ్రీ రాసిన ‘ఆః!’ కవిత:

‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు...

నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే..’’

అలాగే నా ఒక వాక్యాన్ని కూడా నేను తరచూ మననం చేసుకుంటుంటాను:

‘‘నేను చెట్టుని ప్రతి తుఫాను తర్వాతా నా మరణం వాయిదా పడుతుంటుంది’’

ఈ రెంటిలో– ఒకటి డాలు. మరొకటి కత్తిని కాపాడుకునే ఒర.


(సాంబమూర్తి లండ కవి. ఇప్పటిదాకా మూడు కవిత్వ సంపుటాలను వెలువరించారు. అవి: 2020లో ‘గాజు రెక్కల తూనీగ’, 2022లో ‘నాలుగు రెక్కల పిట్ట’, 2024లో ‘ఆమెకు మిగలని ఆమె’.) 96427 32008

Updated Date - Jun 16 , 2025 | 02:29 AM