Philosophical Poem: కల
ABN , Publish Date - Jun 16 , 2025 | 02:39 AM
ఆదిమానవులు చేసిన ప్రయాణంలోని అసలైన సౌందర్యాన్ని పట్టుకోడానికి అతడు సుదీర్ఘ యాత్ర చేస్తున్నట్లు నిద్రలో కలగన్నాడు....
ఆదిమానవులు చేసిన ప్రయాణంలోని
అసలైన సౌందర్యాన్ని పట్టుకోడానికి
అతడు సుదీర్ఘ యాత్ర చేస్తున్నట్లు
నిద్రలో కలగన్నాడు
సూర్యుని కింది మనుష్యుల సుఖదుఃఖాలను దాటాడు
జంతువుల అమాయకత్వాన్ని చేత్తో తాకాడు
నదులు దాహంతో తాగిన సూర్యోదయాల్ని
సముద్రాలు వెన్నెలను చూసి పడిన మోహాల్ని చూసాడు
అడవుల్లో చెట్ల కొమ్మలకు
వేలాడే భయాల్ని
అడవే నాకు కాపలా ఉండగా
అడవి నన్నేం చేస్తుంది అనుకునే
లేత ప్రాణుల ధైర్యాన్ని విన్నాడు
గుహల్లో నిద్రపోతున్న శతాబ్దాల
పక్క నుండి నడిచాడు
జలపాతాల తాడు పట్టుకొని ఊగి
ఇసుక తుఫాను ఆగిపోయాక మెల్లిగా కళ్లు తెరిచిన
ఎడారుల్లోంచి నడుచుకుంటూ అగ్నిపర్వతం అంచును చేరి
అగ్నిపుష్పాన్ని తెంపుకొని జేబులో పెట్టుకొని
ఆ అంచు నుండి ఎగిరి మంచుపర్వతాల మీద పడి
జారిపోయి ఒక లోయలో పడ్డాడు.
పడడం పడడం
అప్పటికే ఆ లోయలోకి జారిపడ్డ మనుష్యుల మధ్య
పడ్డాడు ఆ తర్వాత ఆ మనుష్యులు చెప్పిన చంద్రుని కింది
మనుష్యుల సుఖదుఃఖాల కథల నుండి కదిలి తిరిగి తన ప్రయాణాన్ని
కొనసాగించాడు.
- భగవంతం