Inspiration: ఈ పుస్తకంతో నా ఐఏఎస్ హోదా వెనక్కు వెళ్ళిపోయింది
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:43 AM
తొలి పుస్తకం ప్రచురణ కోసం చాలా మంది సహ కవులు, రచయితలు పడే తప్పనిసరి కష్టాలు నేను పడలేదు.
తొలి పుస్తకం ప్రచురణ కోసం చాలా మంది సహ కవులు, రచయితలు పడే తప్పనిసరి కష్టాలు నేను పడలేదు. ఐనా నా మొదటి పుస్తకం ‘భద్రాచలం మన్నెం కతలు’ అన్ని దశల్లోనూ ప్రత్యేక అనుభవాన్ని మిగిల్చింది. పాలనా వ్యవస్థలో అంతర్భాగంగా ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న నేను– వ్యవస్థ వల్ల ఆదివాసీ గిరిజనులు పడుతున్న కష్టనష్టాలను రాసి పుస్తకంగా తీసుకురావడం అందరిలోనూ ఆశ్చర్యాన్నీ ఆసక్తినీ కలిగించింది.
ఈ పుస్తకం రాయడానికి అత్యంత పరోక్షంగా కారణభూతుడైనవాడు మీడియాలో ఉన్న నా మిత్రుడు. ఆయన తన ఉద్యోగ నిర్వహణలో భాగంగా మీడియా టూర్‌కు నేను పని చేస్తున్న సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ, పాల్వంచకు వచ్చారు. అక్కడ చూసిన దాన్ని తన పత్రికలో ప్రచురించారు. అందులో తనకు నాపైన ఉన్న అభిమానాన్ని వ్యక్తీకరించిన తీరు నా ఉద్యోగంలో నాకు కొన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. నేను అర్ధాంతరంగా బదిలీ అయ్యాను. బదిలీ బాధాకరం కాదు, అయిన విధానం చాలా బాధాకరం. అది ఓ సింహావలోకనానికి దారి తీసింది. ఒక ఐఏఎస్ అధికారికి పాలనా వ్యవస్థలో పరిమితుల కారణంగా ఎదురయ్యే సమస్యలేమిటి, ఆ సమస్యల పరిష్కారానికి ఆదివాసీ గిరిజనులే సూచించిన మార్గాలేమిటి, వాళ్ళ నుంచి తాను నేర్చుకున్నదేమిటో కృతజ్ఞతాపూర్వకంగా వారి సహజ వివేకం పట్ల ఆశ్చర్యంతో కూడిన అభిమానాన్ని నెమరు వేసుకునేలా చేసింది. అప్పటి ‘ఆంధ్రప్రభ’ సంపాదకులు కీశే పొత్తూరి వెంకటేశ్వరరావు గారితో నాకు వ్యక్తిగత పరిచయం ఉండేది. నా బదిలీ ఆయనకు బాధ కలిగించింది. ‘‘మీ అనుభవాలను మీరెందుకు రాయకూడదూ’’ అని నన్నడిగారు. సరే అన్నాను. రాసిన దాన్ని వారు ఆంధ్రప్రభలో ధారా వాహికంగా ప్రచురించారు.
ఈ ధారావాహికను అప్పటి ‘ఆంధ్ర ప్రదేశ్’ పత్రిక సంపాదకులు కీశే పీవీ రావుగారు శ్రద్ధతో చదివినట్టున్నారు. ‘‘సమస్యలు మోసుకొచ్చే సన్న జీవుల పట్ల మీరు ఇంత శ్రద్ధ పెట్టడం నను కదిలించింది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రచనను నేను ప్రచురిస్తాను’’ అని దాని కోసం ‘గౌతమీ ప్రచురణలు’ స్థాపించారు. పుస్తక ప్రచురణ అంతా ఆయనే చూసుకున్నారు. నేను చేసిందల్లా ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో తీసిన ఫోటోలను ఆయనకు అందించడమే! అటువంటి ఫోటోల్లో ఒకటి కోయ తెగకు చెందిన సున్నం సిరిమప్పది. ఆయన నాకు మన పరిపాలన వల్ల సాధారణ ప్రజలకు కలిగే కష్ట నష్టాల అనుభవాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఒక్క చిత్రం వెయ్యి మాటలకు సమానం అంటారే, అలా నా పుస్తక సారమంతా ఆ ఒక్క చిత్రంలో ఉందనిపించి దాన్నే ముఖచిత్రంగా వేద్దామని పీవీ రావు గారన్నారు. నేను సరే అన్నాను. పుస్తకానికి ముందుమాటను పొత్తూరి వారు ఆదివాసీ గిరిజనుల పట్ల తనకున్న సహానుభూతికి సాక్ష్యంగా మలిచారు. నా చిరకాల మిత్రుడు, ఉద్యోగం లోనూ నా సహచరుడిగా ఉండి, గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారితో సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఐఏఎస్ అధికారి కీశే పి. సుబ్రమణ్యం ‘నామాట’ పేరున పుస్తకంలో విషయాన్ని పరిచయం చేశారు.
తొలి ప్రతి చూడగానే నాకు ఆనందం కంటే ఎక్కువగా ఏడుపు వచ్చింది. నా తొలి ఉద్యోగ అనుభవాలు మిగిల్చిన నిరాశను, ఆవేదనను ఒక్క క్షణం గుర్తు చేసిన ఆ ఏడుపుతో మనసంతా తేలికై పోయింది. ప్రచురణ కర్త పీవీ రావు ఈ పుస్తకం కాబోయే ఐఏఎస్ అధికారులకూ, మారుమూల ప్రాంతాల్లో పనిచేయవలసిన వారికీ దిక్సూచిగా ఉంటుందని, కాబట్టి ఇది గిరిజన సంక్షేమ మంత్రి చేతుల మీదుగానే విడుదల కావాలని పట్టుబట్టి అప్పటి మంత్రి భీమారావు గారిని కలిసి ఒప్పించారు. పుస్తకం విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది.
‘భద్రాచలం మన్నెం కతలు’ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. పుస్తకం మీద తెలుగు, ఆంగ్ల దిన వార, మాస పత్రికల్లో మంచి విశ్లేషణాత్మకమైన రివ్యూలు వచ్చాయి. అప్పటి కవులూ, రచయితలు ఆ పుస్తకం మీద తమ అభిప్రాయాలను చాలా ఆసక్తితో పంచుకున్నారు. తరవాతి రోజుల్లో ఈ పుస్తకం అనేక భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పటికీ ఎందరో కవులూ రచయితలూ నన్ను సాహిత్య కార్యక్రమాలకు ఆహ్వానించడానికి కారణం వారు ఈ పుస్తకాన్ని చదివి ఉండటమే! సాహితీ లోకం నన్ను మన్నెం కతల విద్యాసాగరుగా గుర్తిస్తున్నది. నా ఐఏఎస్ హోదా వెనక్కి వెళ్ళిపోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది!