Life Journey: జనజీవన కవనకళతో కట్టుకున్నది నా ‘దూదిమేడ’
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:26 AM
మా ఊరిపేరు నాళేశ్వరం. అదే నా ఇంటిపేరు. అది నిజామాబాదు జిల్లాలో మారుమూల గ్రామం. మేము జంగాలం. బిక్షాటన మా కులవృత్తి.
నా మొదటి పుస్తకం
మా ఊరిపేరు నాళేశ్వరం. అదే నా ఇంటిపేరు. అది నిజామాబాదు జిల్లాలో మారుమూల గ్రామం. మేము జంగాలం. బిక్షాటన మా కులవృత్తి. బిక్షాటన లేకపోతే జీవించలేని కుటుంబం మాది. బాల్యం నుంచే బిక్షాటన చేయడం వల్ల మా ఊరి ఇంటింటి దుఃఖం తెలిసి వచ్చింది. పిడికెడు బియ్యం నా జోలెలో వేయడమే కాదు, కుతిక దీరా రాసుకునే కవితా వస్తువును మా ఊరే ఇచ్చింది. దుఃఖ నిలయంగా ఉన్న మా ఊరును వెన్నెల నిలయంగా మలచాలనుకున్నాను గానీ నా పేదరికం ముప్పుతిప్పలు పెట్టింది. నాలోని నిత్యచైతన్యశీలమే నాకో రహస్య రహదారిని నేర్పింది. ఇంటికి దూరమైనా ఎదురీదుతూ డిగ్రీ దాకా వచ్చాను. కె. వివేకానందరెడ్డి, సునీతమ్మగార్లు చేసిన ఆర్థిక సహాయం వల్ల ఎం.ఏ చదవటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చాను. నా జీవితంలోని ఈ మలుపు నాకెంతో శక్తినిచ్చింది. నా కవిత్వానికి జీవం పోసింది. ఉద్యమాల, పోరాటాల, విప్లవాల రాజకీయ కవిత్వంలా కాక అవి జనజీవన తాత్త్విక స్వభావంలోకి సింకయ్యే స్వభావాన్ని అలవర్చుకున్నాను. సరళీకరణ ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ సృజిస్తున్న తుఫాను నాలోకి ప్రవేశించింది. భూస్వామ్య, పెట్టుబడిదారీ, పాలక వర్గాలు మిళితమై జనజీవనాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో చాలా కవితల్లో వ్యక్తపరిచాను. ఎంఏ చదువుతున్న రోజుల్లో ‘భారతి’తో కవిత అచ్చయితేనే కవి అన్న భావన ఉండేది. ఓమారు మా గురువుగారు సి. నారాయణరెడ్డి కవితా, నా కవిత ఒకేచోట అచ్చయినాయి. సినారె తరగతి గదిలోనే నన్ను నిలుచోబెట్టి అభినందించారు. ఎంఏ చదువుకున్న రోజుల్లో నందిని సిధారెడ్డి, గుడిహాళం రఘునాథం సీనియర్లు. నేను, ఎస్వీ సత్యనారాయణ, వసంతరావు దేశపాండె, సుంకిరెడ్డి నారాయణరెడ్డి జూనియర్స్‌ము. రాయాలన్న తపన తప్ప ఇంకేదీ దరి చేరేది కాదు. ఈ కాలంలో రాసిన కవితల్లో నుంచి కొన్ని ఏర్చి కూర్చిన కవితా సంపుటమే నా ‘దూదిమేడ’.
‘దూదిమేడ’ ఆవిష్కరణ ఏప్రిల్ 30, 1997, బుధవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. దేవిప్రియ సభాధ్యక్షులు, కె.శివారెడ్డి ఆవిష్కర్త. జ్వాలాముఖి ‘దూదిమేడ’ లోని లోతుపాతులు ఎత్తిచూపారు. ఆప్తవాక్యం ఎన్. గోపి, బైస దేవదాసు. కందుకూరి శ్రీరాములు వేదిక పైకి ఆహ్వానించారు. వీరందరి ప్రసంగాలతో నాలో నయాగార జలపాతం. ఇంతలో మా అవ్వ సంగవ్వ, సహచరి సుభద్రదేవి, పుస్తకాన్ని అచ్చు వేసిన చిక్కడ్‌పల్లి బాలప్రసాదును తగిన విధంగా గౌరవించి తలా ఓ కాపీ ఇచ్చాను. మా అమ్మ సంబరంతో హాలుహాలంతా మురిసి పోయింది. తెల్లవారి మేడే. ‘దూదిమేడ’ హైదరాబాద్‌లోనే గాక, గుంటూరులోను రెండవరోజు రెండవసారి ఆవిష్కరింపబడింది. గుంటూరులోని పెనుగొండ లక్ష్మీనారాయణ ఆకాంక్ష మేరకు అవగాహన సామాజిక సాంస్కృతిక వేదిక పైన మే డే సభలో ఈ ఆవిష్కరణ జరిగింది. పాపినేని శివశంకర్, కడియాల రామ్మోహనరావుతోపాటు కె.శివా రెడ్డి, దేవిప్రియ, జ్వాలాముఖి రెండవసారి మాట్లాడారు. హైదరాబాద్‌లోను, గుంటూరులోను నేను ఆశ్చర్యపోయేలా అమ్ముడుపోయింది. దేవిప్రియ 200 కాపీలు తీసుకురమ్మంటే 250 కాపీలతో గుంటూరుకు వెళ్లాను. వచ్చేటప్పుడు నా దగ్గర ఒక్క కాపీ మిగలలేదు. ఇక ‘‘కవిని కడతేర్చేది కవిత్వమొక్కటే’’ అన్న నా కవితా పాదాన్ని శీర్షికగా పెట్టి దేవిప్రియ ‘దూదిమేడ’కు ముందుమాట రాశారు. అది ‘దూదిమేడ’కు యోగ్యతాపత్రం లాంటిది.
ఆంధ్రజ్యోతి దినపత్రిక, వారపత్రిక ‘దూదిమేడ’కు గౌరవాన్నిచ్చింది. పొనుగోటి కృష్ణారావు సాహిత్య పేజీలో నా చేత నన్ను గూర్చి రాయించి ప్రచురించారు. వారపత్రిక సంపాదకులు దాట్ల ఏకంగా ‘దూదిమేడ’పై సంపాదకీయం రాశారు. డా. రంగయ్య ‘దూదిమేడ’ను ‘కపాస్‌కి అటారి’ పేరుతో హిందీలోకి అనువదించారు. సోమసుందర్, ఎన్.గోపి, నాగభైరవ కోటేశ్వరరావు, జయధీర్ తిరుమలరావు, పి.వి. రమణ, గుడిపాటి, దర్భశయనం, థింసా, పెన్నా శివరామకృష్ణ, పసునూరి శ్రీధర్‌బాబు, కొండేపూడి నిర్మల... మరికొందరు ‘దూదిమేడ’లోని కవిత్వాన్ని విశ్లేషిస్తూ రాశారు. ‘దూదిమేడ’కు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతోపాటు పలు అవార్డులు వచ్చాయి. ఉత్తమ విమర్శకులు ఉత్తరాలు కూడా రాశారు. కె.కె. రంగనాథాచార్యులు ‘మధ్యవర్తి చేతిలో రైతు, కవి’ కవిత చదివి ఉత్తరం రాశారు. వారి ఉత్తరం వల్లనే ఆ కవిత అచ్చయిన పత్రికను తర్వాత సంపాదించుకున్నాను. శీలా వీర్రాజు గారు అత్యంత ఆత్మీయులు. ప్రతి పది ఇరవై రోజులకు ఒకమారు మా ఇంటికి ప్రొద్దున పూట వచ్చేవారు. ఎన్నో మార్లు పుస్తకం వేయమని అన్నాడు. పుస్తకం వేస్తేనే మీ ఇంటికి వస్తానన్నాడు. నేను పుస్తకం వేయలేదు. ఆయన మా ఇంటికి రావడం మానేశారు. ఓ ఆరు నెలలు అయిందనుకుంట. మా నాన్న చనిపోయాడు. ఆ సందర్భంలో ఆయన మా ఇంటికి వచ్చాడు. చలించిపోయాను. ఆయన వల్లనే నా కవితలను నేనే ఎన్నుకుని ‘దూదిమేడ’గా ప్రచురించి ఆయనకే అంకితమిచ్చాను. నా ‘దూదిమేడ’ వీర్రాజును మళ్ళీ మా యింటికి వచ్చేట్లు చేసిన సంపుటం.
-నాళేశ్వరం శంకరం
- 94404 51960