Israels Second Phase in Gaza: మలిదశ విధ్వంసం
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:45 AM
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ దుర్మార్గాలను బాహ్యప్రపంచానికి తెలియచేస్తున్న పాత్రికేయులమీద నెతన్యాహూ కక్ష కట్టారన్న విషయం తెలిసిందే...
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ దుర్మార్గాలను బాహ్యప్రపంచానికి తెలియచేస్తున్న పాత్రికేయులమీద నెతన్యాహూ కక్ష కట్టారన్న విషయం తెలిసిందే. జర్నలిస్టులని తెలియక చంపేశామనో, ఐడీఎఫ్ బలగాలు పొరబడ్డాయనో, వారు జర్నలిస్టు ముసుగులో ఉన్న టెర్రరిస్టులనో వాదిస్తూ ఆయన రెండువందలమంది జర్నలిస్టులను హత్యచేశాడు. ఇప్పుడు గాజానగరాన్ని పూర్తిగా దురాక్రమించి, ఆకలిచావులను కూడా దాటిబతికిన మిగతా పాలస్తీనియన్లను తుడిచిపెట్టేసే సరికొత్త కార్యక్రమానికి ఇజ్రాయెల్ అధినేత సంసిద్ధమవుతున్న తరుణంలో, మొన్న సోమవారం ఐదుగురు జర్నలిస్టుల దారుణ హత్య పాత్రికేయ ప్రపంచానికి మరో బలమైన హెచ్చరిక. అంతర్జాతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ‘డబుల్ టాప్’ విధానంలో ఈ హత్య జరిగింది. గాజాలోని నాసర్ ఆస్పత్రి కేంద్రంగా రాయ్‌టర్స్ సహా వివిధ వార్తాసంస్థలు యుద్ధాన్ని ఎంతోకాలంగా కవర్ చేస్తున్నాయని ఇజ్రాయెల్ బలగాలకు తెలుసు. అది రహస్యప్రదేశమేమీ కాదు. ఈ భవనంలోని పై అంతస్తుల్లో ఉంటున్న పాత్రికేయులను ఇజ్రాయెల్ బలగాలు గతంలో సంప్రదించిన సందర్భాలూ ఉన్నాయి. అవసరమైతే కెమెరాలతోనూ, డ్రోన్లతోనూ వీరంతా ఏం చేస్తున్నారో సులువుగా తెలుసుకోవచ్చు. కానీ, తమ వృత్తిధర్మాన్ని నిర్వహిస్తున్న పాత్రికేయులను ఇజ్రాయెల్ వేటాడింది. ఆస్పత్రి భవనంలో వైద్యుల నివాసాలున్న పై అంతస్తును ఐడిఎఫ్ బలగాలు మొదటగా పేల్చివేశాయి. ఆ దాడిలో గాయపడినవారిని కాపాడేందుకు కొందరు కొద్దిక్షణాల తరువాత పరుగులు తీశారు. వారితో పాటు ఈ ఐదుగురు పాత్రికేయులు కూడా మెట్లమీదనుంచి వెడుతూండగా, సరిగ్గా లెక్కలేసుకొని మరీ ఐడీఎఫ్ బలగాలు రెండో దాడిచేశాయి. ఏడునిముషాల తేడాలో ఉద్దేశపూర్వకంగా ఈ రెండుదాడులూ జరిగినట్టు ఒక అరబ్ చానెల్ ప్రత్యక్షప్రసారంలో స్పష్టంగా తేలిపోయింది. తొలిదాడిలో ముగ్గురు మరణిస్తే, మలిదాడిలో జర్నలిస్టులతో సహా 20మంది కన్నుమూశారు, వందమంది గాయపడ్డారు.
ఐడీఎఫ్ బలగాల కదలికలను పసిగట్టడానికి ఈ భవనంపైన ఒక కెమెరా పెట్టారని, అందుకే ఈ దాడిచేశామని ఇజ్రాయెల్ దబాయిస్తోంది. అది ప్రత్యక్షప్రసారాలు ఇవ్వడానికి ఎప్పటినుంచో ఉన్నది తప్ప, నిఘా కెమెరా కాదని మీడియా సంస్థలు అంటున్నాయి. పొరపాటుకు ఏమాత్రం ఆస్కారంలేని ప్రదేశంలో ఈ దాడి జరిగినందున, ఇజ్రాయెల్ ఎన్ని చెప్పినా, ఐదుగురు పాత్రికేయులను అది ఉద్దేశపూర్వకంగానే అంతం చేసిందని మీడియా నమ్ముతోంది. గాజాదురాక్రమణలో భాగంగా ఇజ్రాయెల్ దళాలు యుద్ధట్యాంకులతో మిగిలిన నిర్మాణాలను కూల్చివేస్తున్నాయని, తీవ్రంగా గాయపడిన పాలస్తీనియన్లను తరుముతున్నాయని వార్తలు వస్తున్నాయి. పాలస్తీనియన్లు కూలిన ఇళ్ళను పట్టుకొని వేలాడుతున్నారు, గాయపడుతున్నారు, చస్తున్నారు తప్ప, స్వస్థలాన్ని వదిలిపోవడం లేదు. వీరందరినీ ఆకలితోనూ, ఆయుధంతోనూ హతమార్చి గాజాను హస్తగతం చేసుకోవాలనుకుంటున్న నెతన్యాహూ ఈ మలివిడత దాడిలో మరింత హింసాకాండకు ఒడిగట్టబోతున్నారన్నది వాస్తవం. గాజా దుర్భిక్షంతో అల్లాడుతున్నదని ఇప్పుడు అధికారికంగా కూడా నిర్థారణ అయింది. ఆకలిచావులవార్తలు ఎంతోకాలంగా ప్రపంచం వింటోంది. ఆహారసరఫరాలు నామమాత్రంగా సాగుతూంటే, ఆ ట్రక్కులవెంట పరుగులు తీస్తున్నవారినీ, అన్నంకోసం గుమిగూడుతున్నవారినీ ఇజ్రాయెల్ దళాలు కాల్చిపారేస్తున్నాయి. గాజా వెలుపల వేలాది ట్రక్కులు అనుమతికోసం నిరీక్షిస్తుంటే, అర్థంలేని ఆంక్షలతో, నిషేధాలతో ఆహారం, ఔషధాలు గాజాలోకి రాకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో, ఇప్పుడు నగరాలకు దిగ్బంధం చేసి, వాటిని యుద్ధక్షేత్రాలుగా ప్రకటించి, ఆ కాస్త ఆహారాన్ని కూడా లోనకుపోనివ్వకుండా తన మలిదశ గాజా విధ్వంసాన్ని ఇజ్రాయెల్ అమలు చేయబోతోంది. పాత్రికేయుల ఊచకోత ఘటన అమెరికా అధ్యక్షుడిని కదిలించిందనీ, ఆయన యుద్ధాన్ని త్వరలోనే ముగించేందుకు కృషిచేస్తున్నారని కొన్ని కథనాలు వెంటనే ప్రచారంలోకి వచ్చాయి. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్ వంటివారిని వెంటేసుకొని ట్రంప్ ఏదో హడావుడి చేస్తున్నారు. కానీ, గాజాను అద్భుతమైన రిసార్టుగా చూడాలన్న కోరిక నెరవేర్చడానికి శ్రమిస్తున్న నెతన్యాహూను ఇప్పట్లో ట్రంప్ వారించే అవకాశాలు లేవు. గాజా తో పోల్చితే విధ్వంసంలోనూ, మానవహననంలోనూ ఆవగింజంతలేని ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆయనకు అతి తీవ్రంగా, దుర్మార్గమైనదిగా కనిపిస్తోంది, దానిని వెంటనే ఆపి, నోబెల్‌శాంతి కొట్టేయాలనీ అనిపిస్తోంది.