Share News

Jayant Vishnu Narlikar: విశ్వ వైజ్ఞానికుడు

ABN , Publish Date - May 22 , 2025 | 05:59 AM

ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్‌ విష్ణు నార్లికర్‌ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో కల్గించేందుకు జీవితాంతం కృషి చేశారు. స్టెడీ స్టేట్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ఆయన అభివృద్ధి చేసిన సిద్ధాంతం ఖగోళ శాస్త్రంలో గొప్ప దోహదం చేసింది.

Jayant Vishnu Narlikar: విశ్వ వైజ్ఞానికుడు

విశ్వం పుట్టుక, పరిణామం గురించి వైజ్ఞానిక ప్రపంచం ఆమోదం పొందనప్పటికీ ప్రభావదాయకమైన సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్‌ విష్ణు నార్లికర్‌. భారతీయ జిజ్ఞాస, పాశ్చాత్య శాస్త్ర ప్రతిభ మేళవింపే ఆయన మేధోమూర్తిమత్వం. నార్లికర్‌ను ఆధునిక ఆర్యభట్టుగా భావించడం సముచితంగా ఉంటుంది. విశ్వసాగర తీరాన అందమైన నత్తగుల్లలు, నునుపైన గులకరాళ్లను వెతుక్కుంటూ ఆవలి ఒడ్డుకు మంగళవారం ప్రాతఃకాలంలో వెళ్లిపోయిన చిరస్మరణీయ వైజ్ఞానికుడు. మన దేశంలో ఆధునిక విశ్వశాస్త్ర అధ్యయనాలకు ఆద్యులలో ఒకరైన నార్లికర్‌ సామాన్య ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి జీవితాంతం పలు విధాల కృషి చేసిన వైజ్ఞానికుడు. సివి రామన్‌, హోమీ భాభా, మేఘనాథ్‌ సాహా వలే విజ్ఞానశాస్త్ర విషయాలను ప్రజలకు సరళంగా, సుబోధకంగా వివరించగల ప్రతిభావంతుడు, ప్రశస్త విద్యా బోధకుడు. అన్నీ వేదాలలోనే ఉన్నాయట అనే ఆలోచనా ధోరణులను ఆయన గట్టిగా వ్యతిరేకించేవారు. పురాతన భారతదేశంలో విమానాలు ఉండేవని, ప్లాస్టిక్‌ సర్జరీ ఉండేవన్న వాదనలను ఆయన కొట్టివేసేవారు. అవి ఎంత అహేతుకమో, అసత్యాలో తన శ్రోతలు, పాఠకులు విశ్వసించేలా తేటతెల్లంగా చెప్పేవారు, రాసేవారు. శుద్ధ వైజ్ఞానిక విషయాలు ఎప్పుడూ గట్టి ప్రమాణాల ప్రాతిపదికనే ఉంటాయి సంప్రదాయ ఆలోచనా రీతులపై వైజ్ఞానిక దృక్పథం ఆధిక్యం వహించినప్పుడు మాత్రమే సమాజంలో పురోగతి సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు. ‘ఆధు నిక విజ్ఞానశాస్త్రాలు, సాంకేతికతలు విమర్శనాత్మక దృక్పథాన్ని పెంపొందించాయి. వాస్తవాలను అంగీకరించి గౌరవించే వైఖరులను ప్రోత్సహిస్తున్నాయి. సంప్రదాయం కేవలం ఆచారం కనుక గౌరవించడాన్ని త్యజించేలా చేశాయి.


అయితే ఇప్పుడు సంప్రదాయాలే మనలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. వాస్తవికంగా ఆలోచించేందుకు అవరోధమవుతున్నాయని’ నెహ్రూ స్వాతంత్ర్యానికి పూర్వం అన్న మాటలను 2003లో తన ‘ది సైంటిఫిక్‌ ఎడ్జ్‌’ అన్న పుస్తకంలో ఉటంకించి, మన శ్రేయస్సుకు ఎంతో ఆవశ్యకమైన వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించుకునేందుకు ఇంకా చాలా దూరం పయనించవలసి ఉన్నదని నార్లికర్‌ స్పష్టంగా చెప్పారు. వాస్తవ సమస్యలను వైజ్ఞానిక దృక్పథంతో పరిష్కరించుకోవడమే వర్తమాన భారతదేశం ముందున్న ప్రధాన సవాల్‌ అని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. సైన్స్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లినందునే నార్లికర్‌ను మరాఠీ సాహిత్య ప్రపంచం 2021లో ప్రతిష్ఠాత్మక ‘అఖిల్‌ భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌’కు అధ్యక్షుడుగా ఎన్నుకుని తనను తాను గౌరవించుకున్నది. నార్లికర్‌ ఆత్మకథ ‘ఏ టేల్‌ ఆఫ్‌ ఫోర్‌ సిటీస్‌’ మరాఠీ మాతృకకు జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రస్తుతం ముప్పిరిగొంటున్న మతపరమైన భావోద్వే గాలను నివారించేలా ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని వికసింప చేయడమే నార్లికర్‌కు సరైన నివాళి. విద్యాధికులు అయిన తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో మేధో శిక్షణ పొందిన నార్లికర్‌ ఉన్నత విద్యాభ్యాసానికి బెనారస్‌ నుంచి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లారు. గణితశాస్త్రంలో ప్రశస్త ప్రతిభాపాటవాలు, ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్‌ హోయిల్‌ శిష్యరికం ఖగోళ భౌతికశాస్త్రంలో పథ నిర్దేశకుడుగా ఎదిగేందుకు నార్లికర్‌కు తోడ్పడ్డాయి. నార్లికర్‌ తన పరిశోధనా కృషిని ప్రారంభించే నాటికే ఫ్రెడ్‌ హోయిల్‌ మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వం పుట్టుక, పరిణామంపై స్థిరస్థితి (స్టెడీ స్టేట్‌) సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విశ్వానికి ఆద్యంతాలు ఉండవని, అది ఎప్పుడూ అస్తిత్వంలో స్థిరస్థితిలో ఉంటుందని ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది. ‘అందరూ భావిస్తున్నట్టు ఈ సిద్ధాంత ప్రతిపాదకుల్లో తాను లేనప్పటికీ, తరువాయి దశల్లో ఆ సిద్ధాంతాన్ని మౌలికంగా గణితాత్మకంగా చేసి క్వేజై– స్టెడీ స్టేట్‌ కాస్మాలజీ థియరీగా అభివృద్ధి పరచడంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నానని నార్లికర్‌ చెప్పారు.


విశ్వావిర్భావానికి సంబంధించి ఇప్పటికీ ప్రబలంగా ఉన్న, విశ్వశోధనలో మౌలిక పురోగతికి విశేషంగా దోహదం చేసిన బిగ్‌ బ్యాంగ్‌ (మహా విస్ఫోటం) సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిందే స్టెడీస్టేట్ థియరీ. బిగ్‌ బ్యాంగ్‌ సిద్ధాంతాన్ని సవాల్‌ చేసినప్పటికీ అది ప్రతిపాదించినట్టు విశ్వం నిరంతరం విస్తరిస్తుందనే విషయాన్ని అంగీకరించి హోయిల్‌, నార్లికర్‌లు తమ సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ వైజ్ఞానిక జగత్తు బిగ్‌ బ్యాంగ్ థియరీనే ఆమోదిస్తూ వస్తోంది. ‘విశ్వం మన పూర్వభావనలు లేదా పాక్షికాభిప్రాయాలకు అనుగుణంగా ఉండదు, ఆ బ్రహ్మాండాన్ని నిజాయితీగా అర్థం చేసుకునేందుకు మనం నిబద్ధమై ఉండాలని’ నార్లికర్‌ తరచు అంటుండేవారు.. 1988లో యూజీసీ ఆహ్వానంపై ఫూణేలో ఇంటర్‌ యూనివర్శిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ను వ్యవస్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఖగోళ, ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనల్లో భారతీయ ప్రతిభాపాటవాలు సమున్నతంగా వెలుగొందేలా చేశారు. భారతీయ వైజ్ఞానిక పరిశోధనల వికాసానికి ఆయన అందించిన మహోన్నతసేవ ఈ సంస్థేనని ఆయన సహచరులు, విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతారు.

Updated Date - May 22 , 2025 | 06:00 AM