Constitution Protection Movement: రాజ్యాంగ పరిరక్షణకు సమరశంఖారావం
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:23 AM
నేడు జూలై 4న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేది కేవలం కార్యకర్తల సభ మాత్రమే కాదు.
నేడు (జూలై 4న) హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించబోయేది కేవలం కార్యకర్తల సభ మాత్రమే కాదు. ప్రజాస్వామ్య పునర్జీవనానికి, దేశ ప్రజల్ని సంఘటితం చేయాలన్న సంకల్పానికి వేదిక. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ‘రాజ్యాంగ పరిరక్షణ’కు ‘జై బాపూ.. జై భీమ్.. జై సంవిధాన్’ అంటూ పూరించబోయే శంఖారావం. కాంగ్రెస్ పార్టీ బలం, బలగమైన కార్యకర్తల కష్టాన్ని గుర్తించి, గౌరవించి, వారిని ‘నాయకులు’గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు ఈ సభ. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన మనదేశంలో అధికార బీజేపీ వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే ‘రాజ్యాంగం ఉన్నతమైనదా..? లేక ఢిల్లీ గద్దెనెక్కిన పాలకులు గొప్పవారా..?’ అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యాంగ పీఠికలో మనం రాసుకున్న సార్వభౌమత్వం, సామ్యవాదం, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, గణతంత్రం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి వారి పాలనలో మచ్చుకైనా కనిపించడం లేదు. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను బీజేపీ నేతృత్వంలోని శాసన వ్యవస్థ తన చెప్పుచేతల్లోకి తెచ్చుకునేలా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. ఉన్నతమైన రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోంది. వీరి అరాచకాలను వివరిస్తూ, ఈ సభ ద్వారా దేశ ప్రజలను సంఘటితం చేసే బృహత్తర బాధ్యతను కాంగ్రెస్ భుజానికెత్తుకుంది.
‘జై బాపూ... జై భీమ్... జై సంవిధాన్’ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం మాత్రమే కాదు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తున్న మూడు విశ్వదీప్తి స్తంభాలు. ‘బాపూ’ అనే పదం– గాంధీజీ చూపిన అహింస, సత్యం, నైతిక శక్తికి ప్రతీక. ‘భీమ్’ అంటే– డాక్టర్ అంబేడ్కర్ ఆశించిన న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం అనే మానవీయ హక్కులకు ప్రతీక. ‘సంవిధాన్’ అంటే– ‘భారతీయులంతా సమానమే... అందరికీ సమాన హక్కులు’ అంటూ చాటి చెప్పిన రాజ్యాంగం. వీటన్నింటినీ గౌరవిస్తూ, బీజేపీ నియంతృత్వాన్ని ఎండగడుతూ, ప్రజలను జాగృతం చేసేందుకే పోరాటాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణలో నేటి ఈ సభ. ‘జై బాపూ... జై భీమ్... జై సంవిధాన్’ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ‘ప్రజాస్వామ్యం అంటే అధికారాన్ని అనుభవించడం కాదు. తమకు అధికారమిచ్చిన ప్రజల కష్ట సుఖాల్లో బాధ్యతను పంచుకోవడం’ అంటూ ‘తెలంగాణ పునర్నిర్మాణం’ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి, పకడ్బందీగా అమలు చేస్తోంది. కుల గణన సర్వే, ఎస్టీలకు నాణ్యమైన విద్య, ఉపాధిలో 10 శాతం రిజర్వేషన్లు, ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తోంది. ప్రగతి భవన్‌ను డా. మహాత్మా జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌గా మార్చడం, ఏడాదిన్నరలోనే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడంతో పాటు ఏడాదిలోనే 60వేల ప్రభుత్వోద్యోగాల భర్తీ, ప్రైవేట్ రంగంలో లక్ష మందికి పైగా కొత్తగా ఉపాధి కల్పించడం... ఇలా అభివృద్ధి దిశగా వేసిన అడుగులెన్నో. మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ లాంటి సుమారు 260 సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తోంది.
ఒక జాతీయ పార్టీ అధ్యకుడిని ఓ సాధారణ కార్యకర్త కలవడం అసాధ్యం. ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మార్గనిర్దేశంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నాయకత్వంలో... క్షేత్రస్థాయిలో క్రియాశీలపాత్ర పోషిస్తున్న 15వేల మంది బూత్, గ్రామ, మండల స్థాయి నాయకులను ఈ సభ ద్వారా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా కలవనున్నారు. ‘మీ శ్రమను గుర్తించాం. మీకు అండగా ఉంటాం. మీతోనే మా ప్రయాణం’ అంటూ ఈ సమ్మేళనంలో వారిని భుజం తట్టి ప్రోత్సహించనున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోనున్నారు. క్షేత్రస్థాయిలోని లోటుపాట్లు, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజకీయ పునర్నిర్మాణానికి ఇది సూచిక. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం.
ఈ సభ మౌలికంగా చాటేది ఒక్కటే.. ‘అన్నింటి కంటే ఉన్నతమైనది రాజ్యాంగం, అధికారం కంటే గొప్పది ప్రజల నమ్మకం’ అని. ఈ సభ ఇచ్చే స్ఫూర్తితో– రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కార్యకర్త మరింత పరిశ్రమిస్తాడని బలంగా నమ్ముతున్నా. ‘జై బాపూ... జై భీమ్... జై సంవిధాన్’ నినాదం ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో మార్మోగుతుందని విశ్వసిస్తున్నా.
-దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి