Share News

Jagan Reddy Politics: వెన్నుపోట్ల పితామహుడు జగన్‌రెడ్డే

ABN , Publish Date - Jun 04 , 2025 | 06:25 AM

జగన్ రెడ్డి వెన్నుపోటు రాజకీయాలను విన్యాసాలుగా మలచి, నిజంగా ప్రజలకై పనిచేయకపోవడం రాష్ట్ర అభివృద్ధికి ఆపదగా మారింది. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అధిక అభివృద్ధి సాధించగా, జగన్ పాలన రాజకీయ విచ్చలవిడిత్వంతో దెబ్బతిన్నది.

Jagan Reddy Politics: వెన్నుపోట్ల పితామహుడు జగన్‌రెడ్డే

నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు రాజకీయాలు చెయ్యడం జగన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబుది వెన్నుపోటు అంటూ వెకిలి విమర్శలు చెయ్యడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. చంద్రబాబుది వెన్నుపోటు కాదు, దుష్ట శక్తి నుంచి పార్టీని రక్షించుకోవడం. కుటుంబ సభ్యులు, మెజారిటీ శాసనసభ్యులు కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఆనాడు ఎన్నుకున్నారు. పార్టీ యంత్రాంగం–ప్రజలు ఆ నిర్ణయాన్ని అంగీకరించి, 1999 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయినా దానిని వెన్నుపోటుగా చిత్రించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు జగన్‌రెడ్డి. మహాభారతంలో పౌండ్రక వాసుదేవుడు అనే ఒక క్యారెక్టర్ ఉంది. అందులో తానే అసలైన శ్రీకృష్ణుడిని అని భావిస్తూ అవే వేష భాషలతో ప్రజలను నమ్మించడానికి ఆయన ప్రయత్నించేవారు. నేడు ఆధునిక భారతంలో కూడా జగన్ వంటి వాళ్లను పౌండ్రక వాసుదేవుడుగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఎవరు అసలైన శ్రీకృష్ణుడో, ఎవరు నకిలీనో ప్రజలు తెలుసుకోవాలి. విషాదం ఏమిటంటే గంజాయి మొక్కలను చూసి తులసి మొక్కలు తలదించుకోవాల్సి దుస్థితి జగన్ పాలనలో నెలకొన్నది. జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా ప్రకటించిన జగన్ రెడ్డి, ప్రజల తరపున అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా? తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో దారుణంగా దుర్మరణం చెందితే, కనీసం ప్రమాదస్థలికి వెళ్ళి భౌతికకాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నించకుండా తాను ముఖ్యమంత్రి కావడానికి ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణకి శ్రీకారం చుట్టిన జగన్, తాను ఏదో పులు కడిగిన ముత్యంలా ఇతరులను వెన్నుపోటుదారులుగా చిత్రించడానికి సిగ్గు అనిపించడం లేదా? రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్‌ను వెంటనే సీఎం చేయడానికి ఒప్పుకోకుండా రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని రోశయ్యకి సహకరించకుండా నానా ఇబ్బందులు పెట్టారు. శాంతిభద్రతలు అస్థిరం చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ధర్నాలు, ర్యాలీలు చేశారు. జగన్‌ మీడియా సాక్షి టీవీ, పత్రిక ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ తప్పుడు కథనాలు రాసి ప్రభుత్వాన్ని బదనాం చేసి, రోశయ్యకు వెన్నుపోటు పొడవలేదా? తర్వాత కాంగ్రెస్ పార్టీ కిరణ్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. దీంతో ఆయన ప్రభుత్వంపై ఘర్షణాత్మక వైఖరి తీసుకుని, ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించారు. ఆ సమయంలో జగన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని బహిరంగంగా ఎదిరించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలలో తనకు న్యాయం జరగలేదని భావించి, తనకి సోనియాగాంధీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కోపంతో 2011 మార్చి 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవటం కాదా? ఏ సిద్ధాంతంపై విభేదించి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టారు? తండ్రి ముఖ్యమంత్రిగా ఉండబట్టే కదా, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోపిడీ చేసి, ఆ సొమ్ముతోనే కాదా రాజకీయ పార్టీని స్థాపించింది? జగన్ అధికారం కోసం ఆడే జగన్నాటకాలు అన్నీ దోచుకొన్న డబ్బును కాపాడుకోవడానికి, అక్రమాలు అన్నీ సక్రమం చేసుకోవడానికి తప్ప, ప్రజల కోసం మాత్రం కాదు.


రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. అయితే జగన్‌రెడ్డి– తెలంగాణ అంశంలో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మేము మా వైఖరిని తెలియజేస్తున్నాము. 2011, జూలై 8–9 తేదీలలో జరిగిన మా పార్టీ మొదటి ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం... తెలంగాణ ప్రజల మనోభావాలను పార్టీ గౌరవిస్తుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని ఉపయోగించి రాష్ట్రాన్ని విభజించమని ఎం.వి. మైసురారెడ్డి, కె.కె. మహేందర్‌రెడ్డి ద్వారా కేంద్రానికి లేఖ పంపి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు జగన్‌రెడ్డి. అది తెలుసుకొన్న ప్రజలు జగన్‌రెడ్డిని 2014 ఎన్నికల్లో ఓడించారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన అత్యంత కీలక తరుణంలో ప్రజలు తమను ఒడ్డుకు చేర్చే బాధ్యతను సమర్ధ నాయకుడు చంద్రబాబుకే అప్పగించారు. బాబు ఐదేళ్ల పాలనలో నవ్యాంధ్ర అద్భుత ప్రగతి సాధించింది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను దేశం ముందు నిలిపారు చంద్రబాబు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ని ఆదర్శంగా నిలిపారు. ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయాలు చేయాల్సిన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి, తన బాధ్యతను విస్మరించి అసెంబ్లీకి వెన్నుపోటు పొడిచారు జగన్‌రెడ్డి. సొంత బాబాయి వివేకానందరెడ్డి గొడ్డలి పోటు హత్య వెనుక జగన్ ఉన్నాడని జనం అనుకొంటున్నారు. బాబాయి మరణం గుండెపోటు వల్ల అని వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆస్తులు పంపకం విషయంలో సొంత చెల్లిని, తల్లిని కూడా బయటకు గెంటి, వారికి వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికల్లో తల్లిని, చెల్లిని ఉపయోగించుకొని తర్వాత బయటికి గెంటి వెయ్యడం వెన్నుపోటు కాదా? సొంత చెల్లి షర్మిల పైకి తన ఉన్మాద మూకను ఉసిగొల్పి, నీచ రాజకీయాలు చేయలేదా? సెప్టెంబర్‌ 4, 2014న అసెంబ్లీ ఏకగ్రీవంగా అమరావతిని రాజధానిగా అంగీకరిస్తూ అన్నీ రాజకీయపక్షాల మద్దతుతో అసెంబ్లీలో తీర్మానం చేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. ‘రాజధాని రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలి, కనీసం 30వేల ఎకరాలు కావాలి, 13 జిల్లాల చిన్న రాష్ట్రం కాబట్టి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం ఇష్టంలేక అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా... అంటూ రాష్ట్రానికి మధ్యలో ఉండేలా చూడండని, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాన్ని తానెప్పుడూ వ్యతిరేకించలేద’ని అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్‌ చెప్పలేదా? 2019లో అబద్ధాలను పదేపదే వల్లెవేసి అవే నిజాలుగా జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చి, రాజధానిపై తాను చెప్పిన దానికి విరుద్ధంగా, మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవిని అందుకున్నాడు.


విద్వేష రాజకీయాలతో ప్రాంతాల మధ్య వైషమ్యాలను ఎగదోశాడు. అమరావతి ముంపు ప్రాంతమని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా అవినీతి జరిగిందని, అమరావతి శ్మశానం, ఎడారి అని అబద్ధాలు, అర్ధసత్యాలు, అభాండాలతో, రాజకీయ నాటకాలు ప్రదర్శించి, అమరావతికి రెక్కలు విరిచాడు. అభివృద్ధిని అడ్డుకొని, విధ్వంసం చేసి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఏమీ ఎరగనట్టు జనం ముందుకొచ్చి శ్రీరంగనీతులు చెబుతున్నాడు. తన పాతకాలూ, ఘాతుకాల పట్ల పశ్చాత్తాప పడకుండా ఏదో జరిగిపోతున్నట్లు కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నాడు. ఐదేళ్ల జగన్ పాలనను ఒక పీడకలగా ప్రజలు గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. తన ఉనికి కాపాడుకోవడానికి జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినం అంటూ విన్యాసాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ అనేక ఆచరణ ఎరుగని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి అన్ని పథకాలకు కోతలు పెట్టి, అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు జగన్. ముందు ఆయన పొడిచిన వెన్నుపోట్లకు సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వైసీపీకి 11 సీట్లిచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా, జగన్‌ పద్ధతుల్లో వీసమెత్తు మార్పు రాలేదు.

-యనమల రామకృష్ణుడు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

Updated Date - Jun 04 , 2025 | 06:27 AM