Andhra Pradesh Politics: పాపం, జగన్ ఇంకా నమ్మలేకపోతున్నారు
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:28 AM
జూన్ 4న తెలుగు ప్రజలు జగన్ పై నిరాశ వ్యక్తం చేసి వెన్నుపోటు పొడిచారు. రాజకీయ కుట్రల నేపథ్యంలో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు, కానీ ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
జూన్ 4– ఏడాది క్రితం ఇదే రోజున తెలుగు ప్రజలు జగన్‌కు వెన్నుపోటు పొడిచిన సంగతి బైటపడింది. మూడు లక్షల కోట్లు గుమ్మరించినా ఇదే రోజున, ‘‘నువ్వెవరో మాకు తెలియదు ఫో!’’ అంటూ ప్రజలు జగన్‌ను అధికారం లోంచి గెంటేశారు. అందుకే ఈ రోజును ఆయన ‘వెన్నుపోటు దినం’గా పాటిస్తున్నారు. అలా పాటించాలని రాష్ట్రంలోని అన్ని వయసుల వారికి పిలుపు ఇస్తున్నారు. సంవత్సరమైనా తెలుగువారు చేసిన ద్రోహం తాలూకు మనోవేదన జగన్‌ను వదలడం లేదు. తిన్న ఇంటి వాసాలను లెక్కపెట్టినట్టుగా తాను విదిల్చిన డబ్బుతో తిని, తాగిన జనం తనకు వెన్నుపోటు పొడవడం ఏమిటో జగన్‌కు అర్థం కావడం లేదు. ఓటర్లు తన సొమ్ము తిని తనకే వెన్నుపోటు పొడవడం వెనక చంద్రబాబు, లోకేశ్‌ల కుట్ర ఉందనీ, లేకపోతే 175కి 175 సీట్లూ వచ్చి ఉండేవని జగన్ నమ్ముతున్నారు. అందుకే ఈ కుట్రల్ని తిప్పికొట్టడానికి ఆయన పూనుకున్నారు. ‘‘హు! ఇంత విశ్వాసఘాతం ఎక్కడైనా ఉంటుందా?’’ అంటూ ఆయన తీవ్ర ఆవేదనకు లోనైన సందర్భాలు అనేకం మీడియాలో కూడా వచ్చాయి. జనం డబ్బు వారి మొహాన్నే ఎంత ధారపోశారో..! ఇంతగా తినిపించి, పేకాటలు ఆడించి, పీపాలు తాగించి బదులుగా తనకు ఒక్క ఓటు ముక్క వేస్తారనుకుంటే... చివరకు ఏం చేశారు!? చప్పుడు రాకుండా వెన్నుపోటు పొడిచారు. అంతకుముందు 151 సీట్లు ఇచ్చిన జనమే, 11 సీట్లు విదిల్చారు. అవసరమైనప్పుడు వదిలేసి, ప్రతిపక్షం చంకనెక్కడాన్ని మించిన ‘వెన్నుపోటు’ మరొకటి ఉంటుందా? ‘‘హే.... ప్రభూ! ఏమిటీ దారుణం!’’ కలికాలం ముగింపునకు వచ్చిందా అన్నట్టు జగన్ ఎంత ఆవేదనకు లోనయ్యారో సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, వాళ్ళబ్బాయి చిరంజీవి సజ్జల భార్గవరెడ్డికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు మీద, లోకేశ్ మీద, పవన్ కళ్యాణ్ మీద అంత దుర్మార్గమైన వ్యాఖ్యానాలను భార్గవరెడ్డి సోషల్ మీడియాలో పెట్టించింది. పాపం భార్గవరెడ్డి ఆవేదనను అర్థం చేసుకోలేని సుప్రీంకోర్టు ‘‘బెయిల్ లేదు.... గియిల్ లేదు’’ అని కసిరి పారేసింది.
ఇక జగన్ అయితే– రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని బాగా ఫీలయ్యారు. ఇంకా చాలా చాలా అన్నారు. తాను అబద్ధాలు చెప్పలేకపోవటం, అవినీతికి పాల్పడకపోవడం, ప్రజాస్వామిక పద్ధతుల్ని నమ్ముకోవడం వల్ల కూడా ప్రజలు దొంగహామీల వలలో పడి ఇటువంటి తీర్పు ఇచ్చి ఉంటారని సమాధానపడ్డారు. అమ్మలకు, అయ్యలకు, తాతలకు, అవ్వలకు, అక్క చెల్లెమ్మలకు, మావయ్యా అని నోరారా పిలిచే మేనల్లుళ్ళకు, మేనకోడళ్లకు, ప్లీడర్లకు, ఆటోవాలాలకు, ఓటున్న ప్రతి ఒక్కరికీ ఆరారగా, వరి నారుమడి మీద నీరు చల్లినట్టు, డబ్బు పంచుతూన్నందున, తాను 30 ఏళ్ళపాటు అధికారంలో ఉంటానని జగనన్న భావించారు. ఆయన మనోగతం ఎరిగిన తెలుగు జ్యోతిష్యులు కూడా ఉగాదినాడు– జగన్ ఏకంగా 12 సంవత్సరాల 8 నెలల 15 రోజుల 11 గంటల 37 నిముషాలు ఈ రాష్ట్రాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి నిస్వార్థ సలహాలతో ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తారని పంచాంగాల సాక్షిగా వేదాశీర్వాదాలు పలికి, భారీ దక్షిణలు తీసుకొని వెళ్లిపోయారు. ఈ భవిష్యద్దర్శనాల్ని జగనన్న ఒక్కరే కాదు, గుంటూరులో బోరుగడ్డ అనిల్ నమ్మాడు. అమరావతి ప్రాంతంలో నందిగం సురేష్ నమ్మాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి, ఆళ్ల నాని, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి, రజని... ఇంకా చాలామంది నమ్మారు. మాచర్లకు ప్రభువుల లాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ నమ్మారు. కాకినాడలో అనంతబాబూ నమ్మాడు. ఆయన గాడ్ ఫాదరూ నమ్మారు. అలా ముప్ఫయ్ ఏళ్ళ పాటు మన ‘‘ప్రజాసేవకు’’ ఎదురేలేదని మనసా వాచా కర్మణాః నమ్మిన రౌడీలు, కబ్జా కోరులు, రేషన్ బియ్యం దొంగలు, హంతకులు, మోసగాళ్లు, థర్డ్ రేట్ కాంట్రాక్టర్లు, పొలిటికల్ బ్రోకర్ల దురాగతాలను చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఊరూరా తిరిగి టముకు వేశారు. జగన్ పట్టించుకోలేదు. కానీ, జనం పట్టించుకున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంలో విశేషానుభవం గడించిన సజ్జల రామకృష్ణారెడ్డి జనం ఇవన్నీ పట్టించుకుంటారా అంటూ ‘‘అంతరంగిక’’ సలహా ఏమైనా ఇచ్చారేమో తెలియదు గానీ, జగన్ మాత్రం ‘‘థర్టీ ఇయర్స్’’ థియరీకే ఫిక్స్ అయిపోయారు.
వీళ్ళను చూసి ఆఫీసర్లూ తయారైపోయారు. ‘‘జరుగు... జరుగు...’’ అంటూ ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళతో పాటు జైళ్ళ బాట పడుతున్నారు. పాపం జనం వెన్నుపోటు వల్లే కదా ఇంతమందికి ఇన్ని కష్టాలు? ఐదేళ్ళ పాటు జగన్ పంచిన ప్రలోభాలకు లొంగి జనం విశ్వాసం చూపించి ఉంటే– చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు ఎక్కడ ఉండేవారు? రఘురామకృష్ణంరాజు పరిస్థితి ఏమిటి? కొడాలి నానికి గుండెపోటు వచ్చేదా? వల్లభనేని వంశీ వెలిసిపోయిన జుట్టుతో ఖళ్ ఖళ్ మని దగ్గుతూ బెజవాడ జైలులో ఉండేవాడా? పుంగనూరు ప్రభువులవారు గానీ, ప్రభుత్వ ప్రధాన ‘సలహాదారు’లు గానీ కబ్జా చేసిన భూముల్లోకి కలెక్టర్ అయినా కన్నెత్తి చూసేవారా? ఇప్పుడు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ సైతం వెళ్ళి, ‘‘ఇది ప్రభుత్వ భూమి. బీ కేర్‌ఫుల్’’ అంటూ బోర్డులు పాతి పెడుతున్నారు. ఫస్ట్ టర్మ్‌లో పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆయన సర్వీస్‌లో చివరి ఐదేళ్ళూ అసలు ఉద్యోగంలో లేకుండా చేశారు గానీ, అరెస్ట్ చేసి జైల్లో మాత్రం పెట్టలేకపోయారు. జగన్‌కు అది తీరని కోరికగానే మిగిలిపోయింది. జనం వెన్నుపోటు పొడవకుండా ఉన్నట్టయితే, ఈ టర్మ్‌లో జగన్ కోరిక తీరేది. పిఎస్ఆర్ ఆంజనేయులుకు వెలిసిపోయిన జుట్టుతో కళావిహీనంగా బెజవాడ జైలులో ఉండ వలసిన పరిస్థితి వచ్చేది కాదు. మద్యం మహా కుంభకోణం వైపు వేలెత్తి చూపించడానికి ఎవడికైనా ఎన్ని గుండెలు కావాలి!? ఇంకా ఎన్ని వేలకోట్లు పోగడిపోయేవి!? అందుకే, తనకు జనం వెన్నుపోటు పొడిచే విధంగా వెనుక నుంచి కుట్ర పన్నిన నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ నడుపుతున్న ‘‘అప్రజాస్వామిక’’ రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసి, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని జగన్ ‘‘పిలుపు’’ ఇచ్చారు. ఇక, ఆ తరువాత జనం దయ, జగన్ ప్రాప్తం!
- భోగాది వేంకటరాయుడు
సీనియర్ జర్నలిస్ట్