Indian Revolutionaries: మదనపల్లిలో ఇస్కఫ్ సభలు
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:59 AM
ఇస్కఫ్, సోవియట్ యూనియన్‌తో భారతదేశం స్నేహ సంబంధాలు కలిపిన అద్భుతమైన చరిత్రతో 1941లో ప్రారంభమైంది. ఈ సంస్థ జాతీయ నేతలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంస్కృతీ సంబంధాల అభివృద్ధి కోసం 84 సంవత్సరాలుగా కృషి చేస్తోంది
ఇస్కఫ్– ఓ అద్భుతమైన చరిత్ర. వలస పాలన విముక్తి ఉద్యమాలకు స్ఫూర్తిగా భాసిల్లిన సోవియట్ యూనియన్ పైన హిట్లర్ దాడి మన జాతీయ నాయకులను, కమ్యూనిస్టు నేతలను కలవరపరిచింది. సోవియట్ ప్రజలకు సంఘీభావంగా 1941, జూన్ 22న కలకత్తా కేంద్రంగా ఏర్పడిన ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇస్కస్, ఆ తర్వాత ఇస్కఫ్‌గా రూపాంతరం చెందింది. ఇస్కఫ్ ఉజ్వల చరిత్ర తడిమి చూస్తే నీటి గలగలల సంగీతమేదో వినిపిస్తోంది. కరిగిపోయిన 84 సంవత్సరాల శాంతి, స్నేహ, సంస్కృతీ సంబంధాల పయనం గుర్తుకు వస్తుంది. ‘ఫ్రెండ్స్ అఫ్ సోవియట్ యూనియన్’కు విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ప్యాట్రన్‌గా ఉన్నారు. స్వామి వివేకానందా సోదరుడు భూపేంద్రనాథ్ దత్త అధ్యక్షుడు. ఈయన మామూలు మనిషి కాదు. 1921లోనే కొమింటర్న్‌లో చేరేందుకు మాస్కో వెళ్లి భారతదేశ పరిస్థితులపై ఒక పరిశోధన పత్రాన్ని లెనిన్‌కు సమర్పించిన విప్లవకారుడు. ప్రముఖ కమ్యూనిస్టు ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, ఎస్.కె. ఆచార్య కార్యదర్శులుగా ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఆరంభమైంది. పండిట్ జవహర్‌లాల్ నెహ్రు, మహాత్మాగాంధీ లాంటి పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు పంపి సంస్థ పురోగతిని ఆకాంక్షించారు. స్థాపన జరిగిన నెల తర్వాత కలకత్తా టౌన్ హాలులో ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే (శాస్త్రవేత్త) అధ్యక్షతన తొలిసభ పెద్ద ఎత్తున జరిగింది. ఉత్తరాలు, ఫోటో ప్రదర్శనలు, సినిమాల ద్వారా సోవియట్ సంస్కృతిని భారత ప్రజలకు తెలియజేసే ప్రయత్నాలు విస్తృతంగా జరిగాయి.
1944లో జరిగిన ఒక సమావేశంలో విజయలక్ష్మి పండిట్ అధ్యక్షోపన్యాసం ఇవ్వగా, కవికోకిల సరోజినీ నాయుడు, భారత అణు కార్యకలాపాల పితామహుడు హోమీ జహంగీర్ భాభా, గణితం, గణాంకాలు, భాషా శాస్త్రం, చరిత్ర, జన్యు శాస్త్రాల్లో నిష్ణాతుడు అయిన శాస్త్రవేత్త దామోదర్ ధర్మానంద కోశాంబి (డి.డి. కోశాంబి) లాంటి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. 1947 ఏప్రిల్ 2న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ విజయవంతమయ్యేందుకు ఫ్రెండ్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ ఎంతో కృషి చేసింది. ముంబైకి చెందిన ప్రముఖ సర్జన్ డాక్టర్ ఏ.వి. బాలిగా 1952 మార్చి 14న ఇస్కస్ అంటే ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ స్థాపించారు. ముంబైలోని సుందర్‌భాయ్ హాలులో మొదటి నేషనల్ కౌన్సిల్, సమావేశం, భారత– సోవియట్ సంయుక్త సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. డాక్టర్ ఏ.వి. బాలిగా సంస్థాపక అధ్యక్షులుగా ఎన్నిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇస్కస్ సభ విజయవాడలో 1954, జూన్ 11న జరిగింది. మద్రాస్ అసెంబ్లీలో నెల్లూరు ఎమ్యెల్యే ఖండవల్లి కృష్ణారావు ఈ సభకు అధ్యక్షత వహించారు. ఇస్కస్ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ ఏ.వి. బాలిగా సభను ప్రారంభించారు. సోవియట్ సంస్కృతీ మండలి ప్రతినిధి స్తెపాన్ శుమ్డుకో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘అతడు–ఆమె’ నవల రచయిత ఉప్పల లక్ష్మణరావు ఇస్కస్ తొలి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
తర్వాత మన రాష్ట్రంలో పద్మావతి శాస్త్రి, గూడవల్లి నాగేశ్వరరావు, వేములపల్లి శ్రీకృష్ణ, కె. సుబ్బరాజు తదితరులు సంస్థ అభివృద్ధి కోసం కృషి చేశారు. సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇస్కస్, 1993లో భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్)గా మార్పు చేసుకుని అన్ని దేశాలతో స్నేహ, సాంస్కృతిక సంబంధాలకు, ప్రపంచ శాంతికి, క్షీణ సంస్కృతికి వ్యతిరేకంగా విస్తృత కృషి చేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇస్కఫ్ అధ్యక్షునిగా టి.ఎస్. సుకుమారన్, ప్రధాన కార్యదర్శిగా కాగితాల రాజశేఖర్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఎస్. నరసింహులు వ్యవహరిస్తున్నారు. అఖిల భారత స్థాయిలో ఒడిశాకు చెందిన బిజయ్‌కుమార్ పదిహారి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, భానుదేవ్ దత్త ఉన్నారు.
కె. రాజశేఖర్
ప్రధాన కార్యదర్శి, ఇస్కఫ్, ఆంధ్రప్రదేశ్
(ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఇస్కఫ్ 20వ రాష్ట్ర మహాసభలు)