Road Safety: రహదారి భద్రత.. చేరుకోలేనంత దూరమా?
ABN , Publish Date - Dec 03 , 2025 | 02:41 AM
రహదారులపై మృత్యు విలయం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కర్నూలు దుర్ఘటన మరువకముందే....
రహదారులపై మృత్యు విలయం కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కర్నూలు దుర్ఘటన మరువకముందే చేవెళ్ల వద్ద జరిగిన మరో ప్రమాదం, ఆ తర్వాత పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అయిదు బస్సు ప్రమాదాలు– ఇది కేవలం దురదృష్టకర ఘటనల పరంపర కాదు; ఇది వ్యవస్థాపరమైన లోపాలకు, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్న విషాదం.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిలో 1.72 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. గత అయిదేళ్లలో ప్రమాదాల సంఖ్య 10శాతం పెరగడం చూస్తే రహదారి భద్రత గాల్లో దీపమైందని స్పష్టంగా తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర హైవేలపైనే దాదాపు 60 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై మృత్యుఘోష పరంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా 8, 9 స్థానాల్లో ఉన్నాయి. బాధితుల్లో ఎక్కువమంది మధ్యతరగతి, పేద ప్రజలే. సంపాదించే వయసులోని వ్యక్తులను బలి తీసుకుంటున్న ప్రమాదాలు– అనేక కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా ఛిద్రం చేస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని శివగంగ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం పదిమందిని బలితీసుకోవడంతోపాటు ఎంతోమందిని క్షతగాత్రులుగా మార్చింది.
మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాలు కేవలం యాదృచ్ఛిక ఘటనలు కాదు. రహదారి మౌలిక వసతుల లోపాలు, అతివేగం, ఓవర్‌లోడింగ్, డ్రైవర్లకు శిక్షణ లోపం, పథకాల ప్రభావం... ఇవన్నీ కలిసి భద్రతను తుంచేస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమే. అంతేకాదు, రహదారి రూపకల్పనలో లోపాలు, తప్పుడు ప్రాజెక్టు నివేదికలు, ఇంజనీరింగ్ వైఫల్యాలు, నిర్లక్ష్య పర్యవేక్షణ.. ఇవే నిజమైన హంతకులు. హైవేల బ్లాక్‌స్పాట్లను సరిదిద్దడంలో యంత్రాంగం విఫలమైందని ఇటీవలే పార్లమెంటరీ కమిటీ తేల్చింది.
ఏఐ, సెన్సార్లు, బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ కెమెరాలు, డివైడర్లు, ఫ్లై ఓవర్లు... అన్నీ మనకు ఉన్నాయి. కానీ మన నగరాలు ఇంకా ప్రమాదాల గుట్టలే! టోక్యో, షాంఘై వంటి అధిక జనసాంద్రత నగరాలు భద్రతతో ఉన్నాయంటే... అది మౌలిక వసతులు, చట్టపరమైన క్రమశిక్షణ ఫలితం. మన దగ్గర మాత్రం లైసెన్సుల జారీ అవకతవకలు, మద్యం దుకాణాలు హైవే పక్కనే, అశిక్షిత డ్రైవర్లు, ఇరుకు రోడ్లు.. ఇవన్నీ రోడ్డు ప్రమాదానికి కారణాలే.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,000కు పైగా మరణాలు నమోదయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో అతివేగం 373 ప్రాణాలను బలితీసుకుంది. తెలంగాణలోనూ అదే పరిస్థితి! ఎన్‌హెచ్–65, ఎన్‌హెచ్–44, ఎన్‌హెచ్–163 వంటి జాతీయ రహదారులపై అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మహిళల ఉచిత ప్రయాణ పథకాలు ‘మహాలక్ష్మి’, ‘స్త్రీ శక్తి’ సమాజానికి ఆశీర్వాదమే. కానీ బస్సుల సంఖ్య పెంచకుండా రద్దీ పెరగడం డ్రైవర్లపై ఒత్తిడిని పెంచుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. డ్రైవర్లకు శిక్షణనివ్వాలి. నియమిత శిక్షణా కార్యక్రమాలు, లైసెన్స్ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చూసుకోవాలి. అతివేగ నియంత్రణకు స్పీడ్ కెమెరాలు, భారీ జరిమానాలు, ట్రాఫిక్ మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదకర రోడ్ల విస్తరణ, సైనేజ్, లైటింగ్, బారియర్లు ఏర్పాటు చేయాలి. మహాలక్ష్మి, స్త్రీ శక్తి వంటి పథకాల కోసం కొత్త బస్సులు సమకూర్చాలి. మీడియా, విద్యాసంస్థల ద్వారా ప్రజల్లో భద్రతా చైతన్యం పెంచాలి.
-ముద్దం నరసింహస్వామి