Andhra Pradesh politics: ప్రజల కంటే ప్రతిపక్ష హోదా ముఖ్యమా
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:23 AM
పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత దేవుని పేరు మీద ప్రమాణం చేశారు. శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై...
పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత దేవుని పేరు మీద ప్రమాణం చేశారు. శాసనం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం చూపుతాననీ, భారత సార్వభౌమత్వాన్నీ సమగ్రతనూ కాపాడతాననీ, తాను చేపట్టబోయే విధిని నమ్మకంగా నిర్వర్తిస్తాననీ గంభీరంగా ప్రమాణం చేశారు. ఆ పిమ్మట అసెంబ్లీకి హాజరు కాకుండా ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించారు. కాబట్టి ఆయన శాసనసభ్యులుగా కొనసాగడానికి అర్హులు కాదు. వారిపై అనర్హత వేటు వెయ్యవచ్చు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి తాను గవర్నర్ ప్రసంగానికి హాజరు అయ్యానంటారు జగన్. కానీ గవర్నర్ ప్రసంగం సెషన్ కాదు. గవర్నర్ ప్రసంగానికి హాజరైనంత మాత్రాన ఆ నాయకుడిని సభకు హాజరైనట్టుగా లెక్కించలేం. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రాజ్యాంగంలోని 101క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు ఏ కారణం లేకుండా సభకు రాకపోతే సభ్యుల సభ్యత్వం రద్దు అవుతుంది. అట్లాగే, పిల్లలు ‘బిస్కెట్ ఇస్తేనే స్కూలుకి వెళ్తాను’ అన్నట్లు, జగన్ తాను మాట్లాడినంతసేపు మైక్ ఇస్తే అసెంబ్లీకి వస్తానని అంటున్నారు. ఆ అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉన్నది. ప్రజలకు నవ్వు తెప్పించే ఇలాంటి ప్రకటనలు జగన్ మానుకోవాలి. గత ఐదేళ్లు గట్టిగా మైక్ అడిగినందుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎన్నిసార్లు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారో ఒకసారి ఆయన గుర్తు తెచ్చుకోవాలి. ఐదేళ్ల పాటు సభను ఎంత అప్రజాస్వామికంగా నిర్వహించారో దేశమంతా చూసింది. ప్రజాస్వామ్యంలో చట్టసభలు ప్రజావాణిని వినిపించాలని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ హితవచనం. చట్టసభల సభ్యులు శాసన నిర్మాతలు. జనజీవితాలను ప్రభావితం చేసే చట్టాలను రూపొందిస్తారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు కలిసికట్టుగా ప్రజా ప్రయోజనాలను నెరవేర్చాల్సింది పోయి, తాము అసలు అసెంబ్లీకి వెళ్లేది లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్‌రెడ్డి తెగేసి చెప్పి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. చట్టసభ మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతం సీట్లు కలిగిన విపక్ష పార్టీకే ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వాలన్న నిబంధన ఉన్నది.
లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి. మవులాంకర్ విధించిన ఆ నిబంధన ఏడున్నర దశాబ్దాలుగా యావద్దేశమూ అమలు చేస్తున్నది. అందుకే 1969 వరకు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటూ ఎవరూ లేరు. తర్వాత కూడా 5వ, 7వ, 8వ లోక్‌సభలలోనూ ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ తర్వాత 2014–2024 మధ్యలోనూ అదే పరిస్థితి. లోక్‌సభలో పదిశాతం సీట్లు లేకపోయినా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ వినతిని 2014లో నాటి స్పీకర్ తిరస్కరించారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఎందుకు ఇవ్వకూడదో చెబుతూ అప్పటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముకుల్ రోహత్గీ లోక్‌సభకు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రతిపక్షహోదా ఇవ్వాల్సింది ప్రజలు. వాళ్లు ఇవ్వని దాని కోసం జగన్ మూర్ఖంగా మంకుపట్టుపట్టడం అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనం. ‘ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు ఉన్న 23 మంది సభ్యుల్లో ‘‘అయిదుగురిని లాగేస్తే 18 మంది అవుతారు, అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఊడుతుంది,’’ అంటూ 2019 జూన్ 13న ముఖ్యమంత్రిగా మీరు మూర్తీభవించిన అహంకారంతో నిండు శాసనసభలో వీరంగం వేసింది గుర్తు లేదా జగన్‌రెడ్డీ? ప్రజలు మీపై తిరగబడి, సంఖ్యాబలం అంతా ఊడ్చి పారేసి, 11 నెంబరు మిగిల్చాక, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్‌కు లేఖ రాయడానికీ, దాని కోసమే హైకోర్టు దాకా వెళ్లడానికీ సిగ్గుగా అనిపించలేదా? పోనీ కనీసం ఆ కేసు పరిష్కారమయ్యే దాకా అయినా అసెంబ్లీకి వచ్చే ఓపిక లేదా? చివరికి తా చెడ్డ కోతి వనమెల్లా చెరచిందన్నట్టు మీ ఎమ్మెల్యేలను కూడా సభకు రాకుండా అడ్డుపడుతున్నారే! ఇది అప్రజాస్వామిక, నిరంకుశ పెత్తందారీ పోకడలకు పరాకాష్ఠ కాదా?’
2019 ఎన్నికల్లో ప్రజలు తనకు 23 సీట్లు మాత్రమే ఇచ్చినా చంద్రబాబు కుంగిపోకుండా, చిన్నతనంగా భావించకుండా బాధ్యతగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అడుగడుగునా అవమానించినా భరించారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయివుండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడానికి నామోషీ పడలేదు. అది ప్రజలు తన మీద ఉంచిన బాధ్యతగా గుర్తించి వ్యవహరించారు. ఐదేళ్లపాటు నిరంకుశ చక్రవర్తిలా వ్యవహరించిన జగన్‌రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోవడం నామోషీగా ఉన్నట్టుంది. ఇలాంటి వ్యక్తులకు ప్రజాస్వామ్య రాజకీయాల్లో పాల్గొనే అర్హత ఉన్నదా? నిజంగా ప్రజా సమస్యల పట్ల బాధ్యత ఉంటే ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండానే సమావేశాలకు హాజరై ప్రజల పక్షాన నిలబడి పోరాడేవారు. శాసనసభ్యుడిగా తమ బాధ్యతలు నిర్వర్తించకుండా ‘అసలైన జనోద్ధారకుడిని నేనే’ అంటే నమ్మడానికి ప్రజలు ఇప్పుడు సిద్ధంగా లేరు. నలభై శాతం ఓట్లు తమకు వచ్చాయని చెప్పుకొనే జగన్‌రెడ్డి ఆ ఓట్లు వేసిన తమ తరఫున ఎందుకు మాట్లాడరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కోసం చేసే రాద్ధాంతం అంతా జగన్ హోదా కోసమే తప్ప ప్రజల కోసం కాదనీ, నిజంగా ప్రజాపక్షం అయితే వారి తరఫున ప్రశ్నించే అవకాశమున్నా అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకు ఉంటారనీ ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేలుగా జీతం ఇతర అలెవెన్సులు ఎలా పొందుతారని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులకు ప్రజల పట్ల బాధ్యత ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.
-యనమల రామకృష్ణుడు,
మాజీ స్పీకర్