GDP Growth: ఈ వృద్ధి రేటు గర్వకారణమా?
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:29 AM
భారత్‌ను బహిరంగ ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు, వివేకవంతమైన ఆర్థిక నిర్వహణకు నిర్విరామంగా కృషిచేస్తోన్న ఆర్థిక పాలనాదక్షుడు డాక్టర్ సి.రంగరాజన్....
భారత్‌ను బహిరంగ ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు, వివేకవంతమైన ఆర్థిక నిర్వహణకు నిర్విరామంగా కృషిచేస్తోన్న ఆర్థిక పాలనాదక్షుడు డాక్టర్ సి.రంగరాజన్. ఈ 93 ఏళ్ల తలపండిన ఆర్థికవేత్త చాలా సంవత్సరాల పాటు ఒక సెంట్రల్ బ్యాంకర్‌గా ఉన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)కు 19వ గవర్నర్ (1992–97)గా అనితరసాధ్యమైన సారథ్యం వహించారు. భారతదేశ సంభావ్య వృద్ధిరేటు వ్యవహారాన్ని లోతుగా, విస్తృతంగా తర్కించి అది ఏడాదికి 6.5 శాతంగా ఉన్నదనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై మరో ఆర్థికవేత్త డాక్టర్ కె.శ్రీవాస్తవ సహ రచయితగా ఆయన రాసిన వ్యాసం ఒకటి అక్టోబర్ 14, 2025న ఒక జాతీయ దినపత్రికలో వెలువడింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వాతావరణంలో ఈ వృద్ధిరేటు అధిక స్థాయిలో ఉందని సహేతుకంగా చెప్పవచ్చు’ అని డాక్టర్ రంగరాజన్ ఉదారంగా వ్యాఖ్యానిస్తూ వెన్వెంటనే ఈ క్రింది వ్యాఖ్య జోడించారు: ‘ఉద్యోగ అవకాశాలను మరింత అధిక స్థాయిలో సృష్టించేందుకు సంభావ్య పెరుగుదల సామర్థ్యాన్ని మరింత అధికం చేయవలసిన అవసరమున్నది’.
అనేక సంవత్సరాలుగా మన ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధిరేటు 6.5శాతంగా ఉండడమనేది చాలా నిరాశాజనక విషయమని నేను భావిస్తున్నాను. ఆ వృద్ధిరేటు భారత్‌ను ‘దిగువ మధ్యతరగతి ఆదాయ ఆర్థిక వ్యవస్థ’గా మాత్రమే ఉంచుతోంది. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం స్థూల జాతీయ తలసరి ఆదాయం 1,146 నుంచి 4,515 డాలర్ల మధ్య ఉన్న దేశాలు దిగువ మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థల కిందకు వస్తాయి. 2024లో మన స్థూల జాతీయ తలసరి ఆదాయం 2,650 డాలర్లుగా ఉన్నది. ఈ ప్రకారం ఈజిప్ట్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, నైజీరియా ఆర్థిక వ్యవస్థల శ్రేణిలోనే మన ఆర్థిక వ్యవస్థ ఉన్నది. దిగువ మధ్యతరగతి ఆదాయ ఆర్థిక స్థితి నుంచి బయటపడి పురోగమించాలంటే మన స్థూల తలసరి జాతీయ ఆదాయం రెట్టింపు కావలసిన అవసరమున్నది. భారతదేశ ప్రస్తుత వృద్ధిరేటు నిలకడగా ఉంటే అటువంటి పురోగతి సాధించేందుకు మనకు 9 సంవత్సరాల వ్యవధి పడుతుంది. అయితే అదే సమయంలో నిరుద్యోగిత పరిస్థితి మరింతగా దిగజారుతుంది. ఆర్బీఐ అంచనా ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో మన ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెరుగుతుంది. అయితే నిరుద్యోగిత విషయమై ఆర్బీఐ చెప్పగలిగేది తక్కువే. ‘ఉద్యోగావకాశాల సృష్టికి సంబంధించిన వివిధ సూచికలు ఆగస్టులో ఒక మిశ్రమ దృశ్యాన్ని చూపించాయి. అఖిల భారత స్థాయిలో నిరుద్యోగిత రేటు 5.1 శాతానికి తగ్గింది’ అని సెప్టెంబర్ 2025 ఆర్బీఐ ‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ బులెటిన్ వెల్లడించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ వారి ‘మంత్లీ ఎకనామిక్ రివ్యూ’ ఆగస్టు సంచికలో వృద్ధిరేటు అంచనా 6.3 నుంచి 6.8 శాతం మధ్యలో ఉంటుందని పేర్కొంది. నిజానికి ఇది అంతకు ముందటి అంచనానే. నిరుద్యోగిత పరిస్థితి గురించి ఈ ఎకానమిక్ రివ్యూ’ కూడా ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధిరేటు 6.3 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. భారత్ వృద్ధిరేటుపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) సంస్థ తన అంచనాను 2025లో 6.6 శాతానికి పెంచింది. అయితే ఈ పెరుగుదల 2026లో ౬.2 శాతానికి తగ్గుతుందని స్పష్టం చేసింది. ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ అంచనా ప్రకారం భారత్ వృద్ధిరేటు 2025–26లో 6.7 శాతంగా ఉంటుంది. 2026–27లో అది 6.2 శాతానికి తగ్గుతుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండగలదని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో తగ్గుతుందనే విషయమై ఏకాభిప్రాయం వ్యక్తమయింది. ఈ అంచనాలు డాక్టర్ రంగరాజన్ అంచనాను ధ్రువీకరిస్తున్నాయి. వృద్ధిరేటు స్వల్ప స్థాయిలో ఉండేందుకు కారణాలు ఏమిటో కూడా ఆయన గుర్తించారు: గత కొద్ది సంవత్సరాలుగా స్థూల స్థిర మూలధన నిర్మాణం (జీఎఫ్‌సీఎఫ్) స్థిరంగా ఉంది. ఇది స్థిరంగా ఉండడానికి దారితీసిన కారణాలు కూడా స్థిరంగా ఉన్నాయి. జీఎఫ్‌సీఎఫ్ 2007–08లో జీడీపీలో 35.8 శాతం నుంచి 2024–25లో జీడీపీలో 30.1 శాతానికి తగ్గిపోయింది. ఇది గత పదేళ్లుగా ఇంచుమించు 28 నుంచి 30 శాతం మధ్యనే ఉంటోంది. మొత్తం జీఎఫ్‌సీఎఫ్‌లో భాగమైన ‘ప్రైవేట్ మూలధన నిర్మాణం’ (పీఎఫ్‌సీఎఫ్) 2007– 08లో జీడీపీలో 27.5శాతం నుంచి 2022–23లో జీడీపీలో 23.8శాతానికి తగ్గిపోయింది. జీఎఫ్‌సీఎఫ్/పీఎఫ్‌సీఎఫ్ మెరుగుపడని పక్షంలో భారత్ వృద్ధిరేటు 6.5శాతంగా ఉన్నది. నాణ్యమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం, నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం అనేవి ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రభుత్వ సామర్థ్యానికి తార్కాణాలు. గత దశాబ్దంలో నిర్మించిన మౌలిక సదుపాయాల పరిమాణం చాలా భారీ స్థాయిలో (వాటికి వెచ్చించిన నిధుల పరిమాణం కూడా చాలా అత్యధిక స్థాయిలో ఉన్నదని ప్రత్యేకంగా చెప్పాలా?) ఉన్నది. మరి నాణ్యత సంగతేమిటి? అభివృద్ధి చెందిన దేశాలు త్యజించిన రూపకల్పనల నమూనాలు, కాలం చెల్లిన సాంకేతికతలు, పడిపోతున్న వంతెనలు, కూలిపోతున్న భవనాలు, ఋతుపవనాలు వర్షించిన తొలిజల్లులకే కొట్టుకుపోతున్న హైవేలు.... కొత్త మౌలిక సదుపాయాల నాణ్యత గురించి ఇంకా ఏమి చెప్పాలి? ఉద్యోగాల నాణ్యత గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. విద్యావంతులు అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలే లేవు. ఈ శ్రేణి యువజనులలో నిరుద్యోగిత 29.1 శాతంగా ఉన్నది. యువజనులలో మొత్తంగా నిరుద్యోగిత 45.4 శాతంగా ఉన్నది. పాఠశాల విద్యావంతులు, విద్యాభ్యాసాన్ని పాఠశాల స్థాయిలోనే మానివేసినవారు జీవనోపాధికి ఏవో చిన్నా చితక పనులు చేసుకోవడం లేదా వలసపోవడం జరుగుతోంది. సెప్టెంబర్‌లో అధికారిక నిరుద్యోగిత రేటు 5.2 శాతం కాగా అధికారిక కిరాణా ద్రవ్యోల్బణ రేటు 1.54 శాతం అట! ఎంత హాస్యాస్పదం! ప్రజలను క్రూరంగా పరిహసించడమే ఇది, సందేహం లేదు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండడమనేది పండుగ చేసుకునే సందర్భం కానేకాదు. భారత్ ఒక ‘దిగువ మధ్యతరగతి వ్యవస్థ’గా మాత్రమే ఉండిపోయిందన్నది ఆ వృద్ధిరేటు చెప్పుతున్న సత్యం. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడి పురోగమనపథంలో ముందుకు సాగేందుకు దోహదం చేసే ఆలోచనలు, ప్రణాళికలు ఏవీ ప్రభుత్వానికి లేవు. గడ్డు పరిస్థితులను అధిగమించి ఆర్థిక వ్యవస్థ ప్రగతిబాటలో పరుగులు పెట్టేందుకు డాక్టర్ మన్మోహన్‌సింగ్‌లా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవల్సిన సమయం మళ్లీ ఆసన్నమయిది.
పి. చిదంబరం