Share News

Piyush Goyal Statement: ఆవిష్కరణల్లో వెనకబడితే భవిష్యత్తులో చోటుండదు

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:32 AM

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ స్టార్టప్‌లు మరియు ఆవిష్కరణల కొరత గురించి చేసిన వ్యాఖ్యలు చర్చలకు దారితీస్తున్నాయి. మన దేశంలో ఉన్న పెద్ద లోపం సాంకేతిక ఆవిష్కరణల కొరత, దీంతో గోల్‌ చెప్పారు

Piyush Goyal Statement: ఆవిష్కరణల్లో వెనకబడితే భవిష్యత్తులో చోటుండదు

కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవల అన్న ఒక మాట పలు విమర్శలకు దారితీయటమే గాక, చర్చలకూ తావిచ్చింది. ‘‘ఇవాళ భారతదేశంలో గొప్ప స్టార్టప్‌లు ఏమున్నాయి? మన శ్రద్ధ అంతా ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కే పరిమితం! నిరుద్యోగులను చవకగా దొరికే కూలీల్లా తయారు చేసి, వాళ్ళచేత ధనవంతులకు ఇంటిపట్టునే భోజనం అందేలా చేస్తున్నామంతే!’’ కేంద్రమంత్రి మాటలు వినటానికి కటువుగా ఉండొచ్చు. కానీ అవి మన దేశ స్టార్టప్‌ వ్యవస్థలో ఉన్న అతి పెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. అది– భవిష్యత్తుకు అవసరమైన సాంకేతిక ఆవిష్కరణల కొరత. దేశంలో ఒకపక్క సౌకర్యాల్ని పెంచే స్టార్టప్‌లు పెరుగుతుంటే, మరోపక్క నూతన ఆవిష్కరణల దిశగా ప్రయత్నాలు తగ్గుతున్నాయి. స్టార్టప్‌ కంపెనీల విషయంలో మన దేశం అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. కానీ, ఈ స్టార్టప్‌ కంపెనీలు చాలావరకు వినియోగదారుడికి సౌకర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయే తప్ప, గొప్ప మార్పు తేగల సాంకేతిక ఆవిష్కరణల దిశగా దృష్టి పెట్టడం లేదు. దీనికి ముఖ్య కారణం భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వినియోగం మీద ఆధారపడి నడవటమే. దీనివల్ల పారిశ్రామికవేత్తలందరూ ఎక్కువ స్థాయిలో వినిమయం జరిగే రంగాల వైపే ఆసక్తి చూపుతున్నారు. ఈ–కామర్స్‌, ఆహారమూ కిరాణా వస్తువుల డెలివరీ, చిరుతిళ్ళ ఉత్పత్తి... తదితర రంగాలన్నీ ఇందులో భాగమే. ఈ రంగాల్లో పెట్టిన పెట్టుబడికి వెంటనే లాభాలు వస్తాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు.


కానీ డీప్‌టెక్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బయోటెక్నాలజీ, స్పేస్‌ టెక్నాలజీ... మొదలైన ఆవిష్కరణలు అవసరమైన రంగాల్లో పెట్టే ప్రయత్నం సాకారం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పారిశ్రామికవేత్తలు అంతగా అటువైపు వెళ్ళటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం అనేక విధానాలను ప్రకటిస్తున్నది. కానీ అసలైన సవాలు విధానాల రూపకల్పన కాదు, వాటి అమలు. ఆవిష్కరణల కేంద్రంగా కొనసాగే ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నది. వీటిలో కొన్ని– నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌) స్థాపన, నేషనల్‌ ఏఐ మిషన్‌ ప్రారంభం, డీప్‌టెక్‌ స్టార్టప్‌లను (లోతైన సాంకేతిక ఆవిష్కరణలు అవసరమైన స్టార్టప్‌లను) ప్రోత్సహించేందుకు రూ.10వేల కోట్లతో ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ ఏర్పాటు... మొదలైనవి. అయితే విధాన ప్రకటనలకూ, వాటి అమలుకూ మధ్య పొంతన లేకపోవడమే అసలు సమస్య. ఉదాహరణకు 2016లో భారత చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో మొదలైన ‘ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌’ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) విషయమే తీసుకుందాం. రూ.9,121కోట్లు ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఫండ్స్‌కు ఇస్తామని చెప్పి, ఏప్రిల్‌ 2023 నాటికి అందులో కేవలం రూ.3,931కోట్లు (43శాతం) మాత్రమే చెల్లించారు. 2018లో యుటిలైజేషన్‌ రేట్లు మరింతగా తగ్గటంతో ఇస్తామన్న రూ.920కోట్లలో కేవలం రూ.168 కోట్లు (18శాతం) మాత్రమే చెల్లించారు. ఇదేవిధంగా సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మద్దతుగా 2020లో రూ.50వేల కోట్ల ‘సెల్ఫ్‌ రిలయంట్‌ ఇండియా’ (ఎస్‌ఆర్‌ఐ) ఫండ్‌ను ప్రకటించారు.


కానీ దేశంలో నమోదైన దాదాపు 5.93 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కేవలం 577 పరిశ్రమలు మాత్రమే దీని ద్వారా లబ్ధి పొందాయి. దీన్ని బట్టి లోపం ఎక్కడ ఉన్నదో స్పష్టంగానే తెలుస్తున్నది. సదుద్దేశ్యాలతో నిధుల కేటాయింపు జరుగుతున్నది. కానీ అమలులో వైఫల్యం వల్ల క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం అంతంతమాత్రం. ఇలాంటి సవాళ్ళే మన దేశంలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ రంగాన్నీ వెంటాడుతున్నాయి. 2021–22 కేంద్ర బడ్జెట్‌లో నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌కు ఐదేళ్ళ కాలానికి రూ.50వేల కోట్లు కేటాయించారు. కానీ 2024–25 నాటికి ఈ కేటాయింపును కేవలం రూ.200కోట్లకు కుదించారు. మరోపక్క రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రంగంపై 2009–10 సంవత్సరంలో చేసిన మొత్తం వ్యయం జీడీపీలో 0.82శాతం కాగా అది 2020–21 నాటికి 0.64శాతానికి క్షీణించింది. దీనికి భిన్నంగా, చైనా తన జీడీపీలో 2.24శాతాన్ని రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు కేటాయిస్తుండగా, జర్మనీ, అమెరికా దేశాలు తమ జీడీపీలో 3శాతానికి పైగా ఇందుకు కేటాయిస్తున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రస్తావించిన సాంకేతిక రంగంలోని ఆవిష్కరణల కొరతను తీర్చాలంటే ప్రభుత్వం చేస్తున్న విధాన ప్రకటనలు అర్థవంతంగా అమలయ్యేట్లు చూడాలి. అప్పుడే మన దేశం పెట్టుబడి ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థ నుంచి ఆవిష్కరణల ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థగా మారగలదు. మొదటగా– మన దేశం దీర్ఘకాలిక దృష్టిగల పెట్టుబడులను పెంచుకోవాలి. త్వరిత లాభాలను ఆశించని, ప్రయోగాలను తట్టుకునే ఇలాంటి పెట్టుబడి డీప్‌టెక్‌ స్టార్టప్‌లకు ఎంతో అవసరం. మన దేశపు అంతర్గత ఆస్తులు మొత్తం 11.1 ట్రిలియన్‌ డాలర్లని అంచనా.ఇందులో 65శాతం భౌతిక ఆస్తులుగా ఉన్నాయి. అంటే మన దగ్గర భారీ పెట్టుబడులు ఉన్నాయి గానీ వాటిని కొత్త సాంకేతికతల ఆవిష్కరణకు వినియోగించే ప్రయత్నాలు గానీ, ఆ దిశగా రిస్క్‌ చేసే తత్త్వం గానీ ఇక్కడ చాలా తక్కువ. అందుకే, స్థానికంగా పనిచేసే స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ల స్థాపన, దీర్ఘకాలిక ఆర్థిక సాధనాలను అమల్లోకి తేవడం, ఏర్పాటు దశలోనే ఎక్కువ కాలం తీసుకునే రంగాలకు పెట్టుబడుల మరలింపును ప్రోత్సహించడం... ఇలాంటి చర్యలు మన దేశంలో ఆవిష్కరణల కొరతను తీర్చగలవు.


రెండోది– డీప్‌టెక్‌ స్టార్టప్‌ల కోసం కేటాయించిన రూ.10వేల కోట్ల నిధి విషయంలో దరఖాస్తు పద్ధతిని సరళీకరించడం, నిధుల కేటాయింపులో పారదర్శకత, ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌కూ స్టార్టప్‌లకూ మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. మూడోది– డీప్‌టెక్‌ ఆవిష్కరణలలో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు పన్ను తగ్గింపు కీలకం. 2024లో చైనా ప్రభుత్వం అక్కడి సాంకేతిక సంస్థలపై 361 బిలియన్‌ డాలర్ల మేరకు పన్నుల, ఫీజుల తగ్గింపును ప్రకటించింది. ఇందులో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు 80.7 బిలియన్‌ డాలర్ల కేటాయింపు కూడా ఉంది. మరోపక్క, మన దేశం 2025–26 బడ్జెట్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ప్రైవేటు పెట్టుబడుల ప్రోత్సాహం కోసం కేవలం రూ.20వేల కోట్లను కేటాయించింది. చైనా కేటాయింపుల్లో ఇది ఐదు శాతం కూడా కాదు. మన దేశ స్టార్టప్‌ రంగంలో వినియోగదారుల సౌకర్యాన్ని పెంచే ప్రయత్నాలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటి ప్రాముఖ్యాన్ని కాదనలేం. కానీ సాంకేతిక రంగంలో ఇవి మాత్రమే మనల్ని అగ్రస్థానంలో నిలబెట్టలేవు. పైన ప్రస్తావించిన కొన్ని పరిష్కార మార్గాలను అనుసరిస్తే మన స్టార్టప్‌ వాతావరణం మారుతుంది. ఆవిష్కరణల కొరత తీరుతుంది. కాబట్టి కేంద్రమంత్రి వ్యాఖ్యలు కాస్త కటువుగానే ధ్వనించినా, అవి మరీ అంత సత్యదూరం కావని మనం గుర్తించాలి. మారుతున్న ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిణామాలు కొత్త ద్వారాలను తెరుస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఆవిష్కరణలకు కొత్త కేంద్రాల కోసం వెతుకుతున్నది. మన దగ్గర ప్రతిభ ఉంది, మార్కెట్‌ ఉంది, పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా ప్రకటనలను అమలు చేయగల చిత్తశుద్ధి. నేషనల్‌ డీప్‌టెక్‌ స్టార్టప్‌ పాలసీ ముసాయిదాను ఆమోదించి అమలు చేయటం ఈ దిశగా వేయాల్సిన మొదటి అడుగు. ఈ పాలసీకి సమర్థవంతమైన అమలు ప్రక్రియను కూడా జోడిస్తే మన దేశం నిరుద్యోగులను చవకగా దొరికే కూలీల్లా వాడుకునే దేశంగా మిగిలిపోదు. భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతలను సరఫరా చేసే యువత గల దేశంగా తయారవుతుంది

లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు

Updated Date - Apr 24 , 2025 | 12:32 AM