Share News

Social justice: గమ్యం చేరని స్వప్నాల గమనం

ABN , Publish Date - Dec 02 , 2025 | 03:54 AM

గత 25 సంవత్సరాల కాలక్రమంలో ఈ దేశంలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను పరిశీలిస్తే, వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని నిరాకరించలేం. అయితే ఈ అభివృద్ధి....

Social justice: గమ్యం చేరని స్వప్నాల గమనం

‘‘జీవితాన్ని సమర్థించే కలలు కనకుండా మానవజాతి జీవించజాలదు’’.

– జోసెఫ్‌ కాంబెల్ల్‌ , "Mythes to live by" గ్రంథ రచయిత

గత 25 సంవత్సరాల కాలక్రమంలో ఈ దేశంలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను పరిశీలిస్తే, వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని నిరాకరించలేం. అయితే ఈ అభివృద్ధి, దేశంలోని పేదరికాన్ని నిర్మూలించి, శ్రమదోపిడీని అరికట్టి, కనీసం ఒక సంక్షేమ రాజ్యాన్ని కూడా స్థాపించలేదు. మరోవైపు పోరాడుతున్న సామాజిక పురోగామి శక్తులను అణచివేస్తున్న మతతత్వ ఫాసిస్టు పాలకుల మూలంగా, తిరిగి అవే ప్రశ్నలు మన ఎదుట నిలుస్తున్నాయి. ఈ దేశం ఎక్కడికెడుతున్నది? భారతీయులు కలలుగన్న సమసమాజ స్వేచ్ఛాయుత వ్యవస్థ ఏర్పడిందా? సామాజిక భద్రత, విద్య– వైద్యం అందరికీ అందుబాటులోకి వచ్చే ప్రజాతంత్ర వ్యవస్థ ఇంకా ఎంత దూరంలో ఉన్నది?

ప్రస్తుతం ఈ దేశంలో కొనసాగుతున్న Despotic rule ఏకపక్ష నియంతృత్వ పాలనకు ప్రజలు కూడా కారణం! కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం వల్ల ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుతున్నారు. దేశంలోని మెజారిటీ హిందువులు ఐక్యత పేరిట ‘హిందుత్వ’ను ఆమోదిస్తున్నారు. సమాంతరంగా కార్పొరేట్‌ ధనిక వర్గాలకు అనుకూలంగా ఉన్న చట్టాల మూలంగా, పేదరికం– నిరుద్యోగం విస్తరిస్తున్నాయి. 2014 తర్వాత క్రమంగా మూఢనమ్మకాల మతవాద దృక్పథం వ్యాపించి, ఒక కొత్త విశృంఖల మూక, పాలక వర్గానికి వత్తాసుగా ఉంది.

ఈ దేశ సామాజిక వ్యవస్థలో అస్తిత్వ ఉద్యమాల తీరుతెన్నులు పరిశీలిస్తే, కులరహిత ఆదర్శ సమాజానికి చాలా దూరంలో ఉన్నాం. ఏ కులానికి ఆ కులం ఒక అభద్రతా భావంతో తమ ప్రత్యేక ఉనికిని చాటుకుంటూ రాజ్యాధికారంలో తమ భాగాన్ని కోరుకుంటున్నది. ఆధునికంగా సాంకేతిక పారిశ్రామిక అభివృద్ధి ఫలితంగా కులవృత్తులు చెల్లాచెదురైపోయాయి. విద్యావకాశాలు చేజిక్కించుకున్న కులాల్లోని విద్యావంతులు (రిజర్వేషన్ల మూలాన కొందరు) ఆయా కులాల ముద్రలతో మేధావుల, ప్రొఫెసర్ల, ఉపాధ్యాయ, విద్యార్థి తదితర సంఘాలతో సంఘటితమవుతున్నారు. ఈ పరిణామంతో ఆరెస్సెస్‌ ఆశిస్తున్న ‘హిందుత్వ సంఘటిత శక్తి’కి దగ్గరవుతున్నారు.


బీసీలు, దళిత, షెడ్యూల్‌ తదితర కులాల సంఘాలన్నీ జనాభా దామాషా ప్రకారం ఉద్యోగాలలో, మంత్రివర్గంలో రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాయి. దేశంలోని పెట్టుబడిదారీ దళారీ ఆర్థిక వ్యవస్థకు లోబడి ఈ సంఘాలన్నీ తమ ఉద్యమాలను నిర్వహిస్తున్నాయి. ఆర్థికంగా సామాజికంగా తమ కులానికి లేదా మతస్థులకు మేలు జరిగితే చాలుననే మనస్తత్వం (మరోవైపు తరతరాలుగా అగ్రకులాల ఆధిపత్య చరిత్ర ఉండనే ఉంది)– మౌలికంగా ఈ దేశంలోని రైతాంగాన్ని, శ్రామికులను, చేతివృత్తికారులను, కార్పొరేట్‌ పెట్టుబడి దళారీ విధానం ఎంతో సజావుగా దోచుకుంటూ సంపన్నులను పెంచి పోషిస్తున్న యదార్థాన్ని విస్మరిస్తున్నారు. తమ మతం–కులం–శాఖ చెక్కుచెదరకుండా ఇలానే నిచ్చెనమెట్ల సామాజిక వ్యవస్థగానే కొనసాగాలనే తిరోగమన సంస్కరణ వాదంతో తృప్తిపడుతున్నారు. సకలజన ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు.

రాజకీయంగా ఇప్పుడు రావలసిన ప్రత్యామ్నాయ ప్రజాశక్తిగా కమ్యూనిస్టు పార్టీలు ఎర్రజెండా– నీలిజెండా మైత్రి కోసం ప్రయత్నిస్తున్నాయి. భవిష్యత్తులో ఐక్య సంఘటనగా ఇదొక ప్రయోగం. అయితే అంబేడ్కర్‌, ఫూలే అనుయాయులు మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథానికి, సిద్ధాంతాలకు అనుకూలంగా సమన్వయించుకోగలిగితేనే లాల్‌–నీల్‌ మైత్రి సుస్థిరం అయ్యే అవకాశాలున్నాయి.

1947లో దేశ విభజన జరిగి, స్వాతంత్ర్యం పొందిన తర్వాత కొన్ని తరాలు వెనక్కి పోగా, చైనాను మించిపోయిన జనాభాతో ఈ దేశం తను కలలు కంటున్న సమసమాజ, స్వేచ్ఛాయుత గమ్యం వైపు చూస్తున్నది. ఒక తత్వవేత్త చెప్పిన నిజం– ‘‘గుడ్డును వెలుపలి నుంచి పగులగొడితే జీవితం అంతం, కానీ లోపలి నుంచి పగిలితే జీవితం ప్రారంభం.’’


వేల సంవత్సరాల పురాతన సంస్కృతి–చరిత్ర ఉన్న భారత్‌లో వివిధ భాషలు, కులాలు, మతాలు అనేక సమస్యల మధ్య సహజీవనం సాగిస్తున్నాయి. మధ్య యుగాల నాటి అంధ విశ్వాసాలు, రాచరికాలను ప్రశ్నిస్తూ ఆయా దశల్లో మేల్కొన్న వారు– ‘ఎక్కడికీ గమనం?’ అని ప్రశ్నించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ విస్తరించిన దశలో ఆయా దేశ కాల పరిస్థితుల్లో ప్రజా విప్లవాలు వచ్చాయి. ఉదాహరణకు– ఫ్రెంచి, రష్యన్‌, బోల్షివిక్‌, జనచైనా విప్లవాలు– ఇప్పుడు సాంకేతికంగా డిజిటల్‌ యుగంతో పాటు కృత్రిమ మేధ (ఏఐ) కార్యకలాపాల తీరుతెన్నులను మార్చేస్తున్నాయి. అయితే ఆయా ఆలోచనలు– పాత సంస్కారాల ఒత్తిడిలో ఉన్న మనుషుల స్వార్థచింతన, అక్రమార్జన హింసా ప్రవృత్తి మారగలదా? ఇది నిరంతరంగా ఎదురుతిరిగే ప్రశ్న!

చారిత్రకంగా– రాజకీయంగా ఈ దేశంలో వచ్చిన పరిణామాలను పరిశీలిస్తే ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ దేశ ప్రజలు చేరవలసిన గమ్యం వైపు దిశానిర్దేశం చేసింది. తర్వాత నక్సల్బరీ–శ్రీకాకుళ పోరాటాలు గత 55 సంవత్సరాల కాలంలో రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రారంభమై, క్రమంగా అడవులకే పరిమితమై, కేవలం తుపాకీని మాత్రమే నమ్ముకుని దిశను కోల్పోయింది. ఈ చారిత్రక గుణపాఠాలు ఈ దేశంలో ఏనాటికైనా రానున్న ప్రజావిప్లవానికి సంకేతాలు. ఇక్కడి ప్రజలు, మారుతున్న తమ దేశకాల పరిస్థితుల కనుగుణంగా ప్రజా పోరాటాలతో మమేకమైన విప్లవ శక్తులతో, తమదైన రీతిలో ప్రజా విప్లవాన్ని సాధించగలరనేది ఒక చారిత్రక ఆశావాదం. చివరిగా జార్జి లూకాచే (హంగేరియన్‌ మార్క్సిస్టు తత్వవేత్త, విమర్శకుడు) ఈ ప్రపంచంలోని మనిషి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసిన వ్యాఖ్యలతో ముగిస్తున్నాను.

‘‘మనిషి తన ప్రపంచాన్ని గుర్తించక తప్పదు. ఈ మానవాళిలో ఒకడిగా పాక్షికంగా తాను కూడా ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. అందులో భాగంగానే తనదిగా దానిని అనుభవిస్తాడు. ఈ ప్రపంచమనే క్రమాన్ని కొనసాగించడానికి మనిషి తనవంతు ప్రత్యేకతను సంతరింపజేస్తాడు. నష్టం కానటువంటి సృజనాత్మక కళను శాశ్వతం చేస్తాడు. దాని అమేయమైన ప్రాభవం ఒక కళాఖండంగా (గొప్ప రచనగా) పరిఢవిల్లుతూ, మనిషి ప్రపంచ స్వరూపాన్ని తీర్చిదిద్దుతూ ఉంటుంది.’’

-నిఖిలేశ్వర్‌

Updated Date - Dec 02 , 2025 | 03:54 AM