Share News

One Farmer Dies Every Hour: గంటకో రైతు ఎందుకు రాలిపోతున్నాడు?

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:59 AM

మన దేశంలో 2023లో 1,71,418 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో వ్యవసాయ రంగానికి చెందిన రైతులు, రైతు కూలీలు కూడా ఉన్నారు. దేశానికి అన్నం...

One Farmer Dies Every Hour: గంటకో రైతు ఎందుకు రాలిపోతున్నాడు?

మన దేశంలో 2023లో 1,71,418 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో వ్యవసాయ రంగానికి చెందిన రైతులు, రైతు కూలీలు కూడా ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే చేతులే ఆకలితో, అప్పుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం మన సమాజానికి ఒక మాయని మచ్చ. దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 66.2శాతం మంది వార్షిక ఆదాయం ఒక లక్ష రూపాయల కంటే తక్కువే. 2023లో దేశవ్యాప్తంగా గంటకు ఒక రైతు తన ప్రాణం తీసుకున్నాడని జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, పంటలు దెబ్బతినడం వంటి కారణాలు మరోసారి ఈ వాస్తవాన్ని మన కళ్లముందు నిలబెట్టాయి. ఆత్మహత్యలకు పాల్పడిన 1,71,418 మందిలో 10,786 మంది వ్యవసాయ రంగానికి చెందినవారు. మొత్తం ఆత్మహత్యల్లో ఇవి 6.3 శాతం. ఈ గణాంకాలను లోతుగా పరిశీలిస్తే ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 43శాతం మంది రైతులు (4,690) కాగా, 56శాతం మంది వ్యవసాయ కూలీలు (6,096) ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల్లో 4,553 మంది పురుషులు కాగా, 137 మంది మహిళలు ఉన్నారు. కూలీలలో మాత్రం 5,485 మంది పురుషులు ఉంటే, 611 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 38.5శాతం మంది ఉండగా, కర్ణాటకలో 22.5శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 8.6శాతం, మధ్యప్రదేశ్‌లో 7.2శాతం, తమిళనాడులో 5.9శాతం ఉన్నారు. ‘‘రైతు ఆత్మహత్యలు దేశమంతా వ్యాపించిన గ్రామీణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతులు, పేదల కంటే ఎక్కువగా పెట్టుబడిదారుల పక్షానే నిలుస్తోంది. ఫలితంగా గ్రామీణ భారతదేశంలో తీవ్రమైన పేదరికం, కష్టాలు పెరిగాయి. గతంలో భారత ప్రభుత్వ విధానాలు– సానుభూతి, వివిధ వర్గాల మధ్య సమతౌల్యం ఆధారంగా ఉండేవి. గత దశాబ్ద కాలంగా కీలకమైన వ్యవసాయాన్ని కాపాడుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ప్రతి రైతు ఆత్మహత్య పాలనాపరమైన వైఫల్యం, విధానాల లోటుకు సాక్ష్యంగా నిలుస్తోంది’’ అంటారు జర్నలిస్టు డా. కోట నీలిమ.


ఈమె గతంలో రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, ‘విడోస్‌ ఆఫ్‌ విదర్భ’ పుస్తకాన్ని రాశారు. ఉత్పత్తి ఖర్చుపై లాభం వచ్చేలా కనీస మద్దతు ధరను అన్ని పంటలకు వర్తింపజేయాలి. మధ్యవర్తుల దోపిడీని తగ్గించేందుకు డైరెక్ట్‌ మార్కెటింగ్‌, ఈ–నామ్‌ వేదికలను బలోపేతం చేయాలి. గిడ్డంగులు ఏర్పాటు చేయడం ద్వారా పంటలు నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి. అనకాపల్లి సమీపంలో ‘వికాసవనం’ మన్యంలో పండిన అరటి, క్యారెట్‌, పనసను సోలార్‌ డ్రయర్ల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు. తద్వారా ఆ ప్రాంతంలో దిగుబడి పెరిగినా పంట వృథా కాకుండా మార్కెట్‌ చేస్తూ రైతులకు భరోసాగా మారారు. వర్షాధార ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యామ్‌లు, రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ కార్యక్రమాలు వేగవంతం చేయాలి. ‘భూసారం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ప్రకృతి వ్యవసాయం మల్టీ–క్రాపింగ్‌ వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. దీనివల్ల రసాయన ఎరువులపై పెట్టుబడులు తగ్గించుకోవచ్చు’ అంటారు పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండబారిడి గ్రామస్థులు. ఈ ఊరిలో ఒక్క కెమికల్‌ ఎరువుల షాపు కూడా కనిపించదు! పూర్తిగా ప్రకృతి సేద్యంతో ఇక్కడ పంటలు పండిస్తారు. చిన్న రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు, పంట ఇన్సూరెన్స్‌లో పారదర్శకత ఉండాలి. ప్రైవేట్‌ మనీ లెండర్లపై ఆధారపడకుండా కోఆపరేటివ్‌ సొసైటీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా రుణాలు ఇవ్వాలి. అలాగే రైతులు పంట నష్టపోతే తక్షణ పరిహారం, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పింఛన్‌, పిల్లల విద్యకు మద్దతు ఇవ్వాలి. గ్రామస్థాయిలో కౌన్సెలింగ్‌ కేంద్రాలు, రైతు భరోసా వేదికలు వంటివి ఏర్పాటు చేయాలి. దేశానికి అన్నం పెడుతున్న రైతు, అదే పొలంలో తన ప్రాణం వదిలిపెట్టడం సమాజాన్ని కలవరపెట్టే విషయం.

-శ్యాంమోహన్‌ రూరల్‌ మీడియా

Updated Date - Oct 11 , 2025 | 01:59 AM