India Foreign Policy: గాజా ఘోరకలిలో భారత్ నైతిక నేరం
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:04 AM
ప్రతి దేశమూ స్వీయ ప్రయోజనాలకు అనుగుణమైన విదేశాంగ విధానాన్నే అనుసరించడం పరిపాటి. దక్షిణాఫ్రికా, ఫలస్తీన్ అంశాలు ప్రపంచ వ్యాప్తంగా...
ప్రతి దేశమూ స్వీయ ప్రయోజనాలకు అనుగుణమైన విదేశాంగ విధానాన్నే అనుసరించడం పరిపాటి. దక్షిణాఫ్రికా, ఫలస్తీన్ అంశాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల వైదేశిక నీతిని ప్రభావితం చేశాయి. అరబ్బు దేశాలతో భారతీయ దౌత్యంలో ముఖ్యభూమిక పోషించిన అంశం ఫలస్తీన్. ప్రస్తుతం గాజాను ఛిద్రం చేస్తున్న మారణకాండపై అంతర్జాతీయంగా నిరసన వెల్లువెత్తుతోంది. తనను తాను విశ్వగురువుగా భావించుకునే భారత్ వైఖరి ఆ గౌరవ ప్రతిపత్తికి అనుగుణంగా లేదు. వలస పాలనలో ఉన్న నాటి నుంచీ అంతర్జాతీయ వేదికలపై ఫలస్తీన్‌కు మద్దతుగా ఎలుగెత్తిన భారత్ ఇప్పుడు తద్విరుద్ధమైన వైఖరిని అనుసరిస్తోంది. ఆక్రమిత గాజాలో సైనిక దాడులు నిలిపివేసి సుస్థిర శాంతి నెలకొల్పాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగుకు భారత్ వ్యూహాత్మకంగా దూరంగా ఉండిపోయింది. భారత్ తీరుపై అంతర్జాతీయ దౌత్యవర్గాలు విస్మయం వ్యక్తం చేయగా దేశీయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫలస్తీన్‌పై మోదీ ప్రభుత్వ వైఖరిని నిలదీసారు. ఓటింగులో పాల్గొనకపోవడంతో ప్రతిష్ఠ దెబ్బతిన్న భారత్, ఇటీవల సౌదీ అరేబియా, ఫ్రాన్స్ ప్రతిపాదించిన రెండు దేశాల తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్ చేసింది. గాజా ప్రాంతంలో ప్రజల ఇళ్ళను ఇజ్రాయెల్ నిరాటంకంగా కూల్చివేస్తోంది. ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలిస్తోంది. బయటి నుంచి ఆహారం, ఔషధాలు మొదలైన అత్యవసర సహాయ సామగ్రిని గాజాలోకి ప్రవేశించనివ్వడం లేదు, చిన్నారులతో సహా సమస్త ప్రజలను ఆకలిమంటల్లో దహించిపోయేలా చేస్తోంది. చివరకు అన్నం పొట్లాలు పంపిణీ చేస్తామంటూ పిలిపించి వచ్చిన అన్నార్తులపై కాల్పులు జరుపుతూ క్రూరంగా వధిస్తున్న ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. మొదటి నుంచీ మానవ హక్కులకు ప్రాధాన్యమిస్తూ నైతిక విలువలను ఔదలదాల్చిన భారత్, ఇప్పుడు ఫలస్తీన్ విషయంలో మౌనం వహిస్తోంది! ఐరోపాలో యూదులకు అన్యాయం జరిగితే ఫలస్తీన్ ప్రజలు అందుకు పరిహారం ఎందుకు చెల్లించాలని గాంధీజీ ప్రశ్నించారు. ఫలస్తీన్ భూభాగంలో ఇజ్రాయెల్ ఏర్పాటును ఆయన వ్యతిరేకించారు. ఫలస్తీన్ విషయంలో పాశ్చాత్య దేశాల వైఖరిని జవహర్ లాల్ నెహ్రూ తీవ్రంగా నిరసించారు. ఫలస్తీన్ ప్రజలకు పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఉండాలని బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి ఎన్నికల ప్రచార సభలలో పదేపదే చెప్పారు.
గల్ఫ్‌తో సహా సమస్త అరబ్బు దేశాలతో భారత మైత్రిలో ఫలస్తీన్ ఒక ప్రభావదాయక అంశం. కశ్మీర్ సమస్యను ఫలస్తీన్‌తో పోల్చుతూ భారత్‌ను అరబ్బు దేశాలలో ఏకాకిగా చేసేందుకు పాకిస్థాన్ చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే అరబ్బు దేశాలతో మైత్రిలో ఎలాంటి లోటు లేకుండా భారత్ విదేశాంగ విధానం వ్యూహాత్మకంగా కొనసాగింది. తత్ఫలితమే పాకిస్థాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లిబియా మొదలు ఖతర్ దాకా భారత్‌కు ఉపాధి వీసాల జారీ పరంపర కొనసాగింది. అరబ్బు దేశాల తరహాలో ఫలస్తీన్‌కు భారత్ సంఘీభావం తెలపడమే కాకుండా సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించింది. పాశ్చాత్య దేశాలన్నీ ఫలస్తీన్ విమోచన సంస్థ (పి.యల్.ఓ)ను ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే దాన్ని అసలయిన ఫలస్తీనా ప్రాతినిధ్య ప్రతినిధిగా 1974లోనే గుర్తించిన ప్రప్రథమ అరబ్బేతర దేశం భారత్. ఓస్లో శాంతి ఒడంబడిక అనంతరం 1995లో ఫలస్తీనా నగరం రమల్లాలో తన దౌత్య కార్యాలయం నెలకొల్పిన అతి కొద్ది ప్రపంచ దేశాలలో భారత్ ఒకటి. దౌత్యరంగంలో రాణించిన తెలుగువారయిన బొడ్డు బాలభాస్కర్, పర్వతనేని హరీష్‌లు భారత ప్రతినిధులుగా ఫలస్తీన్‌లో పని చేసారు. ఫలస్తీన్ విమోచన సంస్థ అధినాయకుడు యాసర్ అరాఫత్ భారత్‌కు ఆప్తుడు. ఇందిరా గాంధీ తన చివరి విదేశీ పర్యటనలో ట్యూనిసియాకు ప్రత్యేకంగా వెళ్లి అరాఫత్‌తో ఉభయ కుశలోపరి జరిపారు. ఉగ్రవాద సంస్థ అని అమెరికా, పాశ్చాత్య దేశాలు నిందిస్తున్నా, ఇందిరా గాంధీ పి.యల్.ఓకు ఆర్థిక అండదండలు సమకూర్చారు. ఇందిరా గాంధీ హత్యానంతరం ఆమె భౌతికకాయాన్ని చూసి కన్నీరు మున్నీరు అయిన ఏకైక విదేశీ నాయకుడు యాసర్ అరాఫత్. కశ్మీర్ వైఖరిపై భారత్‌నే అరాఫత్ సమర్థించే వారు. ఈ కారణాన కశ్మీర్ వేర్పాటువాదులు, పాకిస్థాన్ నాయకులు ఫలస్తీన్ నాయకత్వంపై సదా అసంతృప్తి వ్యక్తం చేస్తుండేవారు. భారత్ నుంచి ఇటువంటి సంఘీభావ నేపథ్యమున్న ఫలస్తీన్ అంశం నరేంద్ర మోదీ సర్కారు హయాంలో క్రమేణా ప్రాధాన్యం కోల్పోయింది. ఇజ్రాయెల్ వైపే మోదీ సర్కార్ మొగ్గుతోంది. గాజాలో మానవతను కాలరాస్తున్న ఇజ్రాయెల్‌కు ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో అమెరికా మినహా మిత్ర దేశాలు దాదాపుగా లేవు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగిస్తుండగా ఎదురయిన సన్నివేశమే ఆ దేశ ప్రతిష్ఠ మసకబారిందనడానికి ఒక తిరుగులేని నిదర్శనం.
-మొహమ్మద్ ఇర్ఫాన్