Share News

కడలి నుంచి కొండ దాకా

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:02 AM

జీవితం సౌందర్యమయం కాగల సదుపాయాలను సామాన్యులు కోరుతారు. సమాజ సమష్టి సంపద సమృద్ధికి పాలకులు కృషి చేస్తారు. సమగ్ర రవాణా వసతులు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు మొదలైనవి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు అత్యవసరమైనవి...

కడలి నుంచి కొండ దాకా

జీవితం సౌందర్యమయం కాగల సదుపాయాలను సామాన్యులు కోరుతారు. సమాజ సమష్టి సంపద సమృద్ధికి పాలకులు కృషి చేస్తారు. సమగ్ర రవాణా వసతులు, కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు మొదలైనవి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు అత్యవసరమైనవి. అందుకే వాటి అభివృద్ధికి ప్రభుత్వాలు అగ్రప్రాధాన్యమిస్తున్నాయి. దేశ మౌలిక సదుపాయాలను ప్రపంచ ప్రమాణాలతో నిర్వహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలినుంచీ విశేష శ్రద్ధ చూపుతూ వస్తోంది. ప్రపంచ అతి పొడవైన హైవే సొరంగ మార్గం అటల్ టన్నెల్‌, ముంబైలో అటల్‌ సేతు, బ్రహ్మపుత్రా నదిపై బొగిబీల్‌ వంతెన అందుకు ఉదాహరణలు. ఈ కోవలోనివే కాక వాటికంటే మరింత ప్రశస్తమైన నిర్మాణ ప్రజ్ఞా పాటవాలతో రూపుదిద్దుకున్న కట్టడాలు కొత్త పాంబన్‌ వారధి, కశ్మీర్‌ లోయను విశాల భారతదేశంతో అనుసంధానం చేసే రైలు మార్గంలో భాగమైన (ప్రపంచపు అతి ఎత్తైన) చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జి. ఇంజనీరింగ్‌ అద్భుతాలుగా అందరూ అబ్బురపడుతున్న వీటిలో మొదటిదాన్ని ప్రధాని మోదీ శ్రీరామ నవమి రోజున ప్రారంభించారు. రెండోదాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు.


దక్షిణ తమిళనాడు ప్రాంతంలోని పుణ్యక్షేత్రమైన రామేశ్వరం దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానం చేసే కొత్త పాంబన్‌ వంతెన మన దేశంలో మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ సీ బ్రిడ్జి. 72.5 మీటర్ల వర్టికల్‌ లిఫ్ట్‌తో 2.08 కి.మీ. పొడవున ఉండే ఈ వంతెన భారతీయ ఇంజనీరింగ్‌ సామర్థ్యానికి ప్రతీక. నౌకాయానానికి వీలుగా 110 సంవత్సరాల క్రితం బ్రిటిష్‌ పాలకుల హయాంలో నిర్మించిన పాత పాంబన్‌ వంతెన స్థానంలో ఈ కొత్త వంతెనను నిర్మించారు. దీని నిర్మాణంతో భౌగోళిక, పర్యావరణ సవాళ్లను అధిగమించి మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడంలో తన అద్వితీయతను భారత్‌ నిరూపించుకున్నది. అమెరికాలోని గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి, లండన్‌లోని టవర్ బ్రిడ్జి, డెన్మార్క్‌లోని అరెసండ్‌ వంతెనలు మాత్రమే దీనికి సమమైనవి. రామాయణ గాథతో సంబంధమున్న ప్రాంతంలోని ఈ సముద్ర వంతెన ఆధునిక చరిత్రా విశిష్టమైనది. ముఖ్యంగా రామేశ్వరం బిడ్డ అయిన మాజీ రాష్ట్రపతి ఎపిజె అబుల్‌ కలామ్‌ బాల్యం పాత పాంబన్‌ వంతెనతో ముడివడి ఉన్నది. జీవనోపాధికి వార్తా పత్రికలు పంపిణీ చేసిన కలాం ఆ వంతెనపై నడిచే రైళ్లలోనే ప్రధాన భూభాగానికి వెళ్లి వార్తా పత్రికలను తీసుకువచ్చి రామేశ్వరంలో చందాదారులకు సరఫరా చేస్తుండేవారు. ఆ రైలు మార్గం ద్వారానే ఆయన దేశంలోని వివిధ ఉన్నత విద్యా సంస్థలకు వెళ్లి ‘మిసైల్‌ మ్యాన్‌’గా ప్రసిద్ధి పొంది, అంతిమంగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. మరో ప్రముఖుడు, మెట్రో మ్యాన్‌గా ప్రసిద్ధి పొందిన ఇంజనీర్‌ ఇ. శ్రీధరన్‌ 1964లో పెనుతుపాన్‌లో కొట్టుకుపోయిన పాత పాంబన్‌ వంతెన పునర్నిర్మాణాన్ని కేవలం 46 రోజులలోనే పూర్తి చేసి తన ఇంజనీరింగ్‌ ప్రతిభాపాటవాలు, నిర్మాణ దక్షతను తొలిసారి నిరూపించుకున్నారు. ప్రపంచ అగ్రగామిగా ప్రభవిస్తున్న భారత్‌ ఇంజనీరింగ్‌ సామర్థ్యాలకు ఈ కొత్త పాంబన్‌ వంతెన ఒక తిరుగులేని నిదర్శనమని దాన్ని నిర్మించిన రైల్వేవికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ప్రదీప్‌ గౌర్‌ అన్న మాట ఎంత మాత్రం సత్యదూరమైనది కాదు.


సరిగ్గా పది రోజులకు (ఏప్రిల్‌ 19), చీనాబ్‌ రైల్‌ బ్రిడ్జి భాగంగా ఉన్న ఉదాంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైలు మార్గంలో కాట్రా–శ్రీనగర్‌ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. చీనాబ్‌ నదిపై ప్రపంచపు అతి ఎత్తైన రైలు వంతెన ఉన్న 272 కిలోమీటర్ల ఈ మార్గంలో 38 సొరంగాలు, 927 వంతెనలు ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు అనేక వ్యయ ప్రయాసలతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రైలు మార్గం కశ్మీర్‌ లోయలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధిపరుస్తుందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. స్థానిక వ్యాపారాలకు, హస్తకళలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. కశ్మీరీలు, ఇతర భారతీయులకు మధ్య ఉన్న భౌగోళిక, భావోద్వేగ దూరాలు తగ్గి పోయేందుకు ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దోహదం చేయగలదు.


దక్షిణాగ్రాన సముద్రంలో నిర్మించిన కొత్త పాంబన్‌ వంతెన, ఉత్తర కొసన హిమాలయ పర్వత ప్రాంతాలలో నిర్మించిన కొత్త రైలు మార్గం రెండూ ఈ దేశ సమైక్యత, సమగ్రతను పరిపుష్టం చేసేవే. అద్భుతాలు అయిన ఈ మౌలిక వసతులు దేశ ఐశ్వర్యాభివృద్ధికి విశేషంగా దోహదం చేస్తాయి. మరి ఈ సమష్టి సమృద్ధిలో సామాన్యుడికీ సముచిత వాటా లభిస్తుందా? అనేదే అసలు ప్రశ్న. అతడికి అన్యాయం జరగకుండా చూడడమనేది సదరు ఇంజనీరింగ్‌ అద్భుతాలను మించిన మహాద్భుతం అవుతుంది. ఈ మహాద్భుతమే సామాన్యుని కామన అని పాలకులు విస్మరించకూడదు.

Updated Date - Apr 09 , 2025 | 05:02 AM