Share News

Indias Dominance in the World of Cricket: క్రికెట్‌ జగత్తును శాసిస్తున్న భారత్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:33 AM

నరేంద్ర మోదీ మే 2014లో ప్రధానమంత్రి అయిననాటి నుంచీ మన దేశాన్ని విశ్వ గురుగా చేయాలనే తమ ఆకాంక్షను భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ బిగ్గరగా ప్రకటిస్తున్నాయి. సంవత్సరాలు గడిచిపోయాయి....

Indias Dominance in the World of Cricket: క్రికెట్‌ జగత్తును శాసిస్తున్న భారత్‌

రేంద్ర మోదీ మే 2014లో ప్రధానమంత్రి అయిననాటి నుంచీ మన దేశాన్ని ‘విశ్వ గురు’గా చేయాలనే తమ ఆకాంక్షను భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ బిగ్గరగా ప్రకటిస్తున్నాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆ రెండు సంస్థల ఆకాంక్ష నెరవేరడమనేది ఇంకా చాలా దూరంలోనే ఉన్నది. అంతర్జాతీయ రాజకీయాలలో మన వైఫల్యాలు ఏమైనప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో మన ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అయితే భారత్‌ నిర్ణయాలు, చర్యలు సదా కాకపోయినా తరచుగానైనా క్రికెట్‌కు లబ్ధి కలిగించేవిగా ఉంటున్నాయా అనేది పూర్తిగా మరో విషయం. భారత క్రికెట్‌ నియంత్రణ సంస్థ (బీసీసీఐ) కార్యకలాపాలలో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తీసుకువచ్చే లక్ష్యం (చివరకు ఇది నెరవేరనేలేదు)తో సుప్రీంకోర్టు 2017లో నియమించిన ‘పాలనాధికారుల కమిటీ’లో నేను కొన్ని నెలల పాటు సభ్యుడుగా ఉన్నాను. ఇతర క్రికెటింగ్‌ బోర్డ్‌లు అన్నిటినీ తమ అడుగుజాడల్లోకి తీసుకురావాలనే ఆరాటం బీసీసీఐ అధికారులలో ప్రగాఢంగా ఉన్నట్టు నేను గమనించాను. ఒక చరిత్రకారుడుగా ఇది నన్ను కలవరపరిచింది. ఎందుకంటే గతంలో శ్వేతజాతుల సామ్రాజ్యవాద దురహంకారం క్రికెట్‌ను సమున్నతం చేసేందుకు ఎలా అవరోధమయిందో నాకు బాగా తెలుసు. 2022లో ప్రచురితమైన నా పుస్తకం ‘The Commonwealth of Cricket’లో ఇలా రాశాను: ‘ఇంగ్లీష్‌, ఆస్ట్రేలియన్‌ ఆధిపత్యం తరచు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ విశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిందని బీసీసీఐలోని నా సహచరులకు చెప్పాను. భారత్‌ ప్రస్తుత ప్రాబల్యమూ అదే విధంగా పరిణమిస్తున్నదని కూడా చెప్పాను. అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా వహిస్తున్న పాత్రనే అంతర్జాతీయ క్రికెట్‌లో నిర్వహించేందుకు భారత్‌ ఆరాటపడగూడదని నేను వాదించాను. ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు వర్ధిల్లేందుకు నియమనిబంధనలు నిర్దేశిస్తూ తన ప్రయోజనాలకు దోహదం చేయని అంతర్జాతీయ ఒడంబడికలను పూర్తిగా ఉపేక్షించడమే కదా అమెరికా పోకడ. క్రికెట్‌ జగత్తులో భారత్‌ ఆ తీరున వ్యవహరించకూడదు’.


నా హెచ్చరికలు బధిరుని ముందు శంఖనాదమే అయ్యాయి. Rod Lyall కొత్త పుస్తకం ‘The Club : Empire, Power and the Governance of World Cricket’ చదివినప్పుడు ఆ హెచ్చరికలు నా మనసులోకి మళ్లీ వచ్చాయి. 1909లో స్థాపితమైన Imperial Cricket Conference కథతో లైయల్‌ పుస్తకం ప్రారంభమయింది. బ్రిటిష్‌ సామ్రాజ్య మైనింగ్‌ మ్యాగ్నెట్‌ ఏబ్‌ బెయిలీ మేధో శిశువు అయిన ICC తొలి కాలంలో ఇంగ్లాండ్‌, శ్వేతజాతీయులు అత్యధికంగా ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల ఆధిపత్యంలో ఉండేది. క్రికెట్‌ ఎలా ఆడాలో ఈ దేశాలు, ముఖ్యంగా ఇంగ్లండ్‌ నిర్ణయించేది. కొత్త సభ్య దేశాలుగా ఏ దేశాలను చేర్చుకోవాలో, చేర్చుకోకూడదో; టూర్‌లు, సిరీస్‌ల షెడ్యూళ్లను, నియమాలు, నియంత్రణలనూ ఇంగ్లాండే ప్రధానంగా నిర్ణయించేది. క్రికెటింగ్ దేశాలు అయిన ఇండియా, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ను చులకనగా చూసేవారు, లెక్కలోకి తీసుకునేవారు కాదు. అంతర్జాతీయ క్రికెట్‌ వ్యవహారాలను ఎలా నిర్వహించాలనే విషయమై ఈ దేశాల మాటకు మన్నన ఉండేది కాదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అది పూర్తిగా సామ్రాజ్యవాద, జాత్యహంకార క్రీడా వ్యవస్థ (1946లో సైతం ఐసీసీ సమావేశాలలో బీసీసీఐ ప్రతినిధిగా ఒక ఆంగ్లేయుడే పాల్గొనేవాడు). 1950ల్లోను, ఆ తరువాయి దశాబ్దంలోను బ్రిటిష్‌ వలస రాజ్యాలు స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఐసీసీ తన విధి విధానాలలో మరింత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని ఆ కొత్త స్వతంత్ర దేశాల క్రికెట్‌ బోర్డులు వినయపూర్వకంగా విన్నవించుకునేవి. ఈ విషయంలో భారత్‌, పాకిస్థాన్‌లు తరచు కలిసికట్టుగా వ్యవహరించి, ఇంగ్లాండ్‌ ప్రాధాన్యం తగ్గించేందుకు ప్రయత్నించేవని లైయల్‌ వివరంగా రాశాడు. 1965లో ICCలోని I ‘Imperial’ నుంచి ‘International’గా మారింది. 1989లో ‘Conference’ అనే పదం స్థానంలోకి ‘Council’ వచ్చింది. 2005లో ICC ప్రధాన కార్యాలయం లండన్‌ నుంచి దుబాయికి మారింది. తద్వారా ‘ఉపఖండంలోని తన కొత్త అధికార కేంద్రానికి ఆ సంస్థ చేరువయింది’. ఇటీవలి దశాబ్దాలలో ప్రపంచ క్రికెట్‌ వ్యవహారాల నిర్వహణ (అసమర్థ, అవినీతిదాయక నిర్వహణలో కూడా)లో భారత్‌ ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో లైయల్‌ రాశాడు. ఆయన కథనంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. 1983 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో భారత్‌ విజయం ప్రాధాన్యాన్ని లైయల్‌ గుర్తించినట్టు కనిపించలేదు; సాక్ష్యాధారాలు చూపకుండానే, 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్‌ విజయం ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వల్లే సాధ్యమయిందని రాశాడు.


మొత్తం మీద బీసీసీఐ మొరటు సామ్రాజ్యవాద ఆకాంక్షల గురించి లైయల్‌ రాసిన విషయాలు నిష్పాక్షికంగా ఉన్నాయి. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ అరుదైన వివేకవంతుడని పేర్కొంటూ బీసీసీఐ సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా ఆలోచించిన, వ్యవహరించిన అగ్రశ్రేణి భారతీయ క్రికెట్‌ పాలనాధికారి అని లైయల్‌ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ‘శశాంక్‌ వంటి ప్రాజ్ఞులు ముఖ్యంగా భారత్‌లో అరుదుగా ఉంటారని’ కూడా లైయల్‌ వ్యాఖ్యానించాడు. డిసెంబర్ 2024లో హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా ఐసీసీ చైర్మన్‌ అయ్యాడు. లైయల్‌ ఇలా రాశాడు: ‘ఒకప్పుడు ఎంసీసీ (Marylebone Cricket Club) విదేశీ విభాగం’గా ఉన్న ఐసీసీ ఇప్పుడు జాతీయవాద భారత రాజకీయ పార్టీ, దాని కార్పొరేట్‌ ఆకాంక్షల సాధనకు ఒక ఉపకరణమైపోయింది. ప్రపంచ క్రికెట్‌కు ఎంసీసీ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు బీసీసీఐ అలా పరిణమిస్తోందని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ టోనీ గ్రెగ్‌ సరిగానే భావించాడు. ‘గ్యాంబ్లింగ్‌, అసమర్థ నిర్వహణ, ఐసీసీ సభ్య దేశాల మధ్య అధికారాల అసమ పంపిణీ మొదలైనవి ప్రస్తుతం క్రికెట్‌ను పీడిస్తున్న సమస్యలు’ అని 2012లో ఆయన ఒక ఉపన్యాసంలో వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ స్ఫూర్తికి భారత్‌ నిబద్ధమయి వ్యవహరిస్తే ఈ సమస్యలలో చాలా భాగం పరిష్కారమవుతాయని ఆయన ముక్తాయించాడు. ‘ప్రపంచ క్రికెట్‌ వ్యవహారాలను దాదాపు వంద సంవత్సరాల పాటు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా శాసించాయని... దురదృష్టవశాత్తు చాలా సందర్భాలలో క్రికెట్‌ స్ఫూర్తి కంటే స్వార్థ ప్రయోజనాలకే ఆ రెండు దేశాలు ప్రాధాన్యమిచ్చాయని, భారత్‌, న్యూజిలాండ్‌ల పట్ల వివక్ష చూపడం జరిగిందని’ గ్రెగ్‌ అంగీకరించాడు. ‘ఇప్పుడు ఐసీసీకి సారథ్యం వహిస్తున్న భారత్‌ క్రికెట్‌ స్ఫూర్తితో వ్యవహరించగలదని, వివిధ అంశాలపై ఓటింగ్‌ విషయంలో ఇతర సభ్య దేశాలను ప్రభావితం చేయబోదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్‌ వ్యవహారాలలో సంపూర్ణ ఆధిపత్యం సాధించాలనే బీసీసీఐ ప్రగాఢ ఆరాటానికి, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలోని (స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్న) క్రికెట్‌ అధికారులు తోడ్పడుతున్నారు. ఇదే సమయంలో ఉపఖండంలోని ఇతర దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లోని క్రికెటర్లు, క్రికెట్‌ అభిమానులు, క్రికెట్‌ బోర్డుల అధికారులను బీసీసీఐ దూరం చేసుకున్నది. మూడో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ముగిసిన తరువాత ప్రచారంలోకి వచ్చిన ఒక వీడియో, విజేత దక్షిణాఫ్రికా టీమ్‌ కంటే జై షానే క్రికెట్‌కు చాలా ముఖ్యం అన్నట్లుగా వివరించింది. దీనిపై వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్లు ఆండీ రాబర్ట్స్‌, మైకేల్‌ హోల్డింగ్‌ ప్రతిస్పందిస్తూ ప్రపంచక్రికెట్‌ వ్యవహారాలలో భారత్‌ ప్రదర్శిస్తున్న సామ్రాజ్యవాద ధోరణులపై ధ్వజమెత్తారు.


1909లో ప్రభవించిన నాటి నుంచీ ఐసీసీ కుట్ర, అసమర్థత, అనర్హతలకు నెలవుగానే ఉన్నది. ఇప్పుడు వాటికి అవినీతి, అపకార బుద్ధి తోడయ్యాయి. ఇంగ్లాండ్‌ సారథ్యంలో అది అంతర్జాతీయ క్రికెట్‌కు అందించిన ఆరోగ్యకరమైన సేవలు స్వల్పమే. ఇప్పుడు భారత్‌ నాయకత్వంలోనూ పరిస్థితులు మెరుగ్గా లేవు. అసలు భారతీయ క్రికెట్‌కు అయినా బీసీసీఐ ప్రశస్తంగా సేవలు అందిస్తున్నదా అన్నది స్పష్టంగా చెప్పలేము. టెస్ట్‌ క్రికెట్‌ అత్యున్నతమైన, ప్రతిష్ఠాత్మక ఆట అని, అది క్రికెట్‌కు అత్యంత సంప్రదాయక ఫార్మాట్‌ అని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు అందరూ అంగీకరించారు. అయితే ఇప్పటివరకు మూడుసార్లు జరిగిన ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ ఇండియా ఒక్కసారి కూడా గెలవలేదు. మన క్రికెటర్లు అసంఖ్యాక క్రికెట్‌ అభిమానుల నుంచి అవధులు లేని ఆరాధన, అంతకు మించి ఆర్థిక లబ్ధి పొందుతున్నారు; బీసీసీఐ కోశాగారంలో అపార ధనరాశులు ఉన్నాయి; మన కుబేరులు, రాజకీయవేత్తలు తమ ఆర్థిక వనరులు, పేరు ప్రతిష్ఠలను భారతీయ క్రికెట్‌కు వెచ్చిస్తున్నారు. అయినా తొలి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఇండియా ఓడిపోయింది. (ఆ దేశ జనాభా మన సూరత్‌ నగర జనాభా కంటే తక్కువ. ద్వితీయ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది (ఆ దేశ జనాభా మన ముంబై నగర జనాభా కంటే తక్కువ). ఇక తృతీయ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ఇండియా చేరనేలేదు! అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ రికార్డు సాధారణమైనది. గత వంద సంవత్సరాలుగా ప్రపంచ క్రికెట్‌ వ్యవహారాలలో భారత్‌ పాత్ర భిన్న కాలాలలో విభిన్నంగా ఉన్నది: తొట్ట తొలుత శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని వినయపూర్వకంగా గౌరవించింది. ఆ తరువాత సమాన ప్రతిపత్తిని అభ్యర్థించింది; అనంతరం ఒక ప్రముఖ పాత్రను సముపార్జించుకున్నది. అంతిమంగా ఇప్పుడు అధికార ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడంలో అమెరికా, చైనా, రష్యా కంటే మనం చాలా వెనుక స్థానంలో ఉన్నాం. ఆర్థిక శక్తి విషయంలో (జీడీపీ పరంగా కాకుండా తలసరి ఆదాయం విషయంలో) మనం ప్రస్తుతం ప్రపంచంలో 137వ స్థానంలో ఉన్నాం. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ వ్యవహారాల నిర్వహణ (దుష్ట నిర్వహణలో కూడా) విషయానికి వస్తే భారత్‌ కేవలం విశ్వ గురు మాత్రమే కాదు, విశ్వ బాస్‌, ఇంకా చెప్పాలంటే విశ్వ రౌడీ.

-రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Aug 23 , 2025 | 05:33 AM