Share News

Judicial Review: సుప్రీం హద్దులు విస్తరిస్తున్నాయా

ABN , Publish Date - May 03 , 2025 | 03:16 AM

రాజ్యాంగ పరిరక్షణలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య స్పష్టమైన హద్దులు అవసరం అన్న సందేశాన్ని ఈ వ్యాసం ఇస్తోంది. సుప్రీంకోర్టు రాష్ట్రపతి, గవర్నర్ల నిర్ణయాలకు గడువు విధించడం రాజ్యాంగ పరిధులు దాటి వ్యవస్థల మధ్య సంఘర్షణకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 Judicial Review: సుప్రీం హద్దులు విస్తరిస్తున్నాయా

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అత్యంత ఆమోదయోగ్యమైన, నిలకడైన పరిపాలనా విధానంగా కొనసాగడానికి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వేసిన పునాదే కారణం. అది మరింత బలోపేతం కావాలంటే రాజ్యాంగ మూలస్తంభాలైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు పరస్పర గౌరవంతో, స్పష్టమైన అధికార పరిధుల ఆధారంగా పనిచేయడం తప్పనిసరి. దీనికి విరుద్ధంగా ఇటీవల శాసన (రాష్ట్రపతి) – న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ చోటుచేసుకోవడం ఆందోళనకరం. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య శాశ్వత మనుగడే ప్రశ్నార్థకం కాగలదు. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు నెల రోజుల గడువు, రాష్ట్రపతికి మూడు నెలల గడువును విధిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని రాజ్యంగ, రాజకీయ, న్యాయశాస్త్ర విశ్లేషకులు విమర్శిస్తున్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల మధ్య సుస్పష్టమైన హద్దులు ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థ ఈ విధమైన ఆదేశాలతో తన పరిధిని అధిగమించాలనో, విస్తరించాలనో చూస్తున్నదా అన్న అనుమానం వ్యక్తం అవుతున్నది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ తీవ్రంగా స్పందించారు. న్యాయస్థానాలు ‘సూపర్ పార్లమెంట్’గా వ్యవహరించాలని భారత రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ అనుకోలేదని ఆయన అన్నారు. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయంగా– ‘‘రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఏ అధికార వినియోగమైనా న్యాయసమీక్షకు అతీతం కానే కాదు’’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భాన్ని రాజ్యాంగ పరిరక్షణగా చూడాలా, లేక వ్యవస్థలు తమ పరిమితులు దాటే ప్రయత్నంగా చూడాలా అనే చర్చ అంతటా మొదలైంది.


సుప్రీంకోర్టు ఈ గడువు విధించే విషయంలో గవర్నర్‌ వ్యవస్థను రాష్ట్రపతి స్థాయితో సమానంగా భావించడం తగునా అన్నది ఆలోచించాల్సిన విషయం. రాష్ట్రపతి, గవర్నర్‌ ఈ రెండు రాజ్యంగ వ్యవస్థలను వారి వారి పరిధులలో ‘‘సమాన అధికారాలున్న అసమానులు’’గా చూడాలి. భారత రాజ్యాంగం ప్రకారం సంపూర్ణమైన ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే అత్యున్నత, ఏకైక అధికార పీఠం కేవలం రాష్ట్రపతిది మాత్రమే. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల -కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యుల ఎలెక్టోరల్ కాలేజీ కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మిగతా వారంతా రాష్ట్రపతి విచక్షణాధికారం ద్వారా నియమించబడడమో, లేదా నామినేట్ చేయబడడమో జరుగుతుంది. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు రాష్ట్రపతే అధిపతి. రాష్ట్రపతి చేసే ముఖ్యాతి ముఖ్యమైన నియామకాలలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులు ఉంటారు. గవర్నర్ వ్యవస్థ ఆది నుంచీ తటస్థ వ్యవస్థగా పేరు తెచ్చుకోలేకపోయింది. గవర్నర్ల నియామకం ఎప్పుడూ వివాదాస్పదమే. గవర్నర్ తనకు సంక్రమించిన అధికారాలను, విధులను సహకార సమాఖ్య స్ఫూర్తితో, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఉపయోగిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. దురదృష్టవశాత్తూ దీనికి పూర్తి భిన్నంగా, అందరూ కాకపోయినా మెజారిటీ గవర్నర్లు, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏజంట్లుగా పదవిని దుర్వినియోగం చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్‌లకు గడువు విధించడం సమంజసమే కావచ్చు. కానీ రాష్ట్రపతిని గవర్నర్లతో సమానంగా భావిస్తూ గడువు విధించడం చర్చించాల్సిన అంశం! ఏదైనా మౌలికమైన అంశంలో రాష్ట్రపతి సరైన ఆలోచన కోసం తీసుకునే సమయంతో సహా, అనేక అంశాల్లో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడమన్నది ఆ పదవికి వన్నె తెచ్చే రాజ్యాంగపరమైన అధికారం. అటువంటి విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించడం గౌరవభరిత రాజ్యాంగ కర్తవ్యంలో జోక్యం చేసుకోవడంగానే భావించాలి.


భారత రాజ్యాంగంలో న్యాయసమీక్షకు విశేష ప్రాధాన్యమున్నది. అలాగే రాష్ట్రపతి పదవికి, అధికారాలకు, బాధ్యతలకు కూడా విశేషమైన ప్రాధాన్యం ఉన్నది. న్యాయసమీక్ష అనే సూత్రాన్ని స్వేచ్ఛతో నిర్వర్తిస్తున్న సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతికి ఏ మేరకు పరిమితులు విధించవచ్చూ అన్నది చర్చనీయాంశం. ఒకవేళ రాష్ట్రపతి లేదా గవర్నర్ కార్యచరణలో మలినమైన ఉద్దేశం లేదా రాజ్యాంగ ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తే తప్ప, సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై మార్గనిర్దేశాలు ఇవ్వడం అనేది అతి జోక్యమే అవుతుంది. అసలు రాష్ట్రపతి, గవర్నర్ల ఆలస్యాలపై తీర్పు చెప్పే ముందు న్యాయస్థానాలు స్వయంస్థితిని గుర్తించకపోవడం తగునా? వివిధ స్థాయి న్యాయస్థానాలలో వేలాది కేసులు దశాబ్దాలుగా పెండింగులో కొనసాగుతున్నాయి. అయోధ్య, ఎన్నికల అనర్హత కేసులు, పౌర వివాదాలు వంటి అనేక గుణాత్మక కేసులు సంవత్సరాల తరబడి కోర్టులలో కొట్టుమిట్టాడాయి. ముందు ఈ అంశంపై సమగ్రంగా ఆలోచన చేయకుండా, సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతికి గడువు విధించడంపై రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు చర్చ జరపాలి.


‘ఆలస్యమైన న్యాయం అన్యాయమే’ అనే సూత్రానికి అనుగుణంగా న్యాయస్థానాలు సైతం నిర్ణీత గడువులో కేసుల పరిష్కారం విషయంలో సమయపాలన పాటించేటందుకు తగిన చర్యలు తీసుకోవాలి. బిల్లులపై నిర్ణయాలను గడువుల్లో తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తీర్పు వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే కావచ్చు. అధికార స్వామ్యం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలు ఆలస్యం కావటం లేదా వాటికి రాజకీయ ఆటలు అడ్డం రావటం... ఇంతవరకు మాత్రమే న్యాయశాస్త్రం పట్టించుకోవాల్సిన అంశం. రాజ్యాంగ విలువలను నిలబెట్టే బృహత్తర ప్రయత్నంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి. నిజమైన మార్పు రావాలంటే రాజ్యాంగపరమైన నియామకాల్లో రాజకీయ ముసుగు తొలగాలి. రాష్ట్రపతి, గవర్నర్లు రాజ్యాంగంలోని అక్షరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా గౌరవించాలి. అదే విధంగా, న్యాయవ్యవస్థ కూడా ఇతరులపై ప్రమాణాలు విధించే ముందు తనదైన ఆలస్యాలపై స్వయంగా ఆలోచించాలి. ప్రజాస్వామ్య త్రిమూర్తులు (న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు) పరిమితులకు లోబడి, పోటీ తత్త్వం లేకుండా వ్యవహరించడంలోనే ప్రజాస్వామ్య స్థిరత్వం ఆధారపడి ఉంది.

- వనం జ్వాలానరసింహారావు

Updated Date - May 03 , 2025 | 03:18 AM