Indian Army: సైన్యంపై చులకన మాటలొద్దు
ABN , Publish Date - May 22 , 2025 | 06:08 AM
భారతదేశం యొక్క విస్తారమైన సరిహద్దు భద్రతను నిర్వహించేందుకు సైనికులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరిస్తూ, వారి సేవలను అవమానించే మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణకు విధేయత కలిగి ఉన్న సైన్యంపై అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు నిందిస్తున్నారు.
భారతదేశ సరిహద్దు సుమారు 15,200 కిలోమీటర్లు. ఇది పశ్చిమంలో గుజరాత్ నుంచి తూర్పున మిజోరాం వరకు ఉంది. ఈ సరిహద్దు అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల సరిహద్దులతో కూడి ఉంటుంది. ఇంత సుదీర్ఘ సరిహద్దుని వివిధ వాతావరణ పరిస్థితుల్లో కాపాడడం అంటే మాటలు కాదు. సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, పంజాబ్‌లలో పగటిపూట ఉష్ణోగ్రత 55/60 డిగ్రీల సెల్సియస్ ఉంటే, రాత్రిపూట మైనస్ 20కి తగ్గిపోతుంది. అదీగాక ఈ ప్రాంతాల్లో ఎడారి విషపురుగులు, పాములు ఎక్కువ. ఇక్కడి వేడికి శరీరం బొబ్బలెక్కుతుంది. అటువంటప్పుడు బరువైన బూట్లలో ఉండే సైనికుల కాళ్ళు పుండ్లు పడిపోతాయి. అలాగే ఉత్తరాన హిమాలయాల్లో పగటి ఉష్ణోగ్రతలే మైనస్ 40/50 డిగ్రీలు ఉంటుంది. పైగా దుర్గమ పర్వత ప్రాంతం. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోయలోకి జారడం ఖాయం. ఎత్తైన హిమాలయాల్లో సైనికుల్ని మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ ఉంచరు. అక్కడ ఉన్నన్ని రోజులు సైనికులకు స్నానం, దుస్తులు మార్చుకోవడం ఉండదు. మూడు నెలల తరువాత వారు సురక్షిత ప్రాంతాలకు వచ్చినప్పుడు చేసే మొదటి పని ఆ దుస్తులు విప్పి కాల్చేయడం! అక్కడి చలికి వేళ్ళు కొంకర్లు తిరుగుతాయి. ఫ్రాస్ట్ బైట్‌కు గురవుతారు. ఆ ఎత్తయిన ప్రాతంలో ఒకవేళ ఎవరైనా జబ్బుపడ్డా, గాయాల పాలైనా, మరణించినా, వాళ్ళను తరలించడానికి హెలికాఫ్టర్ ఒక్కటే మార్గం. ఆ వాతావరణంలో హెలికాఫ్టర్ వస్తుందో రాదో కూడా చెప్పలేం! ఇక ఈశాన్య ప్రాంతాల సరిహద్దు విషయానికి వస్తే ఆ ప్రాంతం పర్వత ప్రాంతం, పైగా దట్టమైన అడవులు. ఏ చెట్టు చాటు నుంచి ఎవరు చొరబడుతున్నారో, ఏ పొదల చాటు నుంచి ఎవరు కాల్పులు జరుపుతారో నిత్యం గమనిస్తూ కాపలా కాయాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైనికులు దేశం లోపల ఉన్న మనల్ని శత్రువుల నుంచి, ఉగ్రవాదుల నుంచి భయం లేకుండా కాపాడుతుంటారు. అది నిరంతర ప్రక్రియ. ఏ మాత్రం అప్రమత్తత వీడకూడదు. అప్పుడే దేశం లోపల మనమంతా నిశ్చింతగా, సక్రమంగా మన పనులు చేసుకోగలుగుతాం, చేసుకుంటున్నాం. దేశం ఇప్పటికి ఐదు యుద్దాలు చేసింది 1947–48, 1965–66, 1971, 1999 సంవత్సరాల్లో నాలుగు సార్లు పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఓడించింది. 1963లో చైనాతో యుద్ధం చేసి వారిని చొరబడకుండా నిలువరించింది. ఈ ఐదు యుద్ధాల్లో మన జవాన్లు, అధికారులు ఎందరో హతమయ్యారు, మరెందరో క్షతగాత్రులయ్యారు. అయినా కొన్ని కుటుంబాలు, కొన్ని ఊళ్లకు ఊళ్లే తమ కుటుంబ సభ్యులను సైన్యంలోకి పంపడానికి ఉత్సాహం చూపుతాయి. బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ఊళ్లలో సైనికుడు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.
దేశ సేవకి తమ వంతు పాత్ర పోషిస్తున్నామనే సంతోషం వారిది. సైన్యంలో లేనివాళ్లు సహజంగా అనుకుంటుంటారు– ‘వారికేం, ప్రభుత్వం వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తోంది కదా’ అని. కాని అది వారికీ, వాళ్ళు చేసిన చేసిన సేవకి ప్రభుత్వం, ప్రజలు తీర్చుకుంటున్న ఋణం మాత్రమే! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దేశం లోపల ఉన్న మనలో కొందరు సైన్యాన్ని గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు, అందునా రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నవారు. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి విజయ్ షా ‘‘వాళ్ళు పహాల్గమ్ టెర్రరిస్టులు మతం అడిగి హిందువులను చంపారు కాబట్టి మోదీ వాళ్ళ సోదరినే వాళ్ళ పీచమణచడానికి పంపారు’’ అని వ్యాఖ్యానించాడు. కల్నల్ సోఫియా ఖురేషి ఒక ముస్లిం వనిత కాబట్టి అలా అన్నాడు. సైన్యం గురించి అతిగొప్పగా చెప్పే మోదీ గాని, బీజేపీ కానీ ఆయన మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు. కారణం, మధ్యప్రదేశ్ మొత్తం జనాభాలో 23 శాతం ఆదివాసీలున్నారు. ఈ 23 శాతంలో 35 శాతం గోండులు. ఈ విజయ్ షా గోండు సముదాయానికి చెందినవాడు. అతని మీద చర్య తీసుకుంటే గోండుల ఓట్లుతో పాటు, ఆదివాసీల ఓట్లు పడవేమో అన్న భయం. విజయ్ షా వ్యాఖ్యానించిన రెండవ రోజు అదే మధ్యప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ‘‘దేశ సైన్యంతో పాటు దేశ జనాభా మొత్తం మోదీ ముందు మోకరిల్లుతుంది’’ అని వాఖ్యానించారు. ఏ దేశ సైన్యం పేరు చెప్పుకుని వీళ్ళు ఓట్లు తెచ్చుకుంటారో ఆ సైన్యాన్ని ఈ విధంగా అవమానించడం సహించరాని విషయం. దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా బీజేపీ ఆ ఇద్దరు మంత్రులఫై చర్య తీసుకోవాలని, సైనికుల మనోబలాన్ని దిగజార్చే వాఖ్యలు, చర్యలు ఇకముందు ఉండకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పి. జయప్రకాష్