Economic Growth India: తిరోగమనంలో పురోగామి భారత్
ABN , Publish Date - May 17 , 2025 | 04:01 AM
భారత్ మరియు పాకిస్థాన్ తమ స్వతంత్రతను సాధించినప్పటికీ, ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్గాల్లో అవి పూర్తిగా వేరుగా అభివృద్ధి చెందాయి. భారతదేశం తన ప్రజాస్వామిక, లౌకిక విలువలను కాపాడుకుంటూ, ప్రపంచ స్థాయిలో అభివృద్ధిని సాధించడమే కాక, పాకిస్థాన్‌తో పోల్చినప్పుడు అధిక స్థాయిలో ఉన్నది.
భారత్, పాకిస్థాన్‌లు ఏకోదరులు. బ్రిటిష్ వలస పాలన నుంచి ఏకకాలంలో విముక్తమై స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. ఉమ్మడి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వారసత్వమున్నప్పటికీ ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర అస్తిత్వంలో అవి భిన్న బాటలలో నడిచాయి. భారత ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన అభివృద్ధి చెందింది. భారత్ తలసరి ఆదాయం పాకిస్థాన్ తలసరి ఆదాయం కంటే రెండు రెట్లు ఎక్కువ. ఇండియా సమైక్యంగా ఉన్నది. పాకిస్థాన్ 1971లో, అత్యధిక జనాభా ఉన్న తన తూర్పు విభాగాన్ని కోల్పోయింది. తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌గా ప్రభవించింది. ఇండియా విధిగా ప్రతి ఐదేళ్ల కొకసారి ఎన్నికలు నిర్వహిస్తోంది. అధికారానికి వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా పోటీడుతున్నాయి. పాకిస్థాన్‌లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఫలితాలు ఎలా ఉండాలన్న విషయాన్ని సైనికాధికారులు నిర్ణయిస్తారు! పాకిస్థాన్ కంటే ఇండియా ఎందుకు మెరుగ్గా, సమున్నతంగా ఉన్నది? తమ మత ఔన్నత్యం ఉత్కృష్టమైనది కనుక ఇస్లాంపై స్వతస్సిద్ధ, ఆధిక్యత కలిగి ఉన్నదని, ఇదే భారత్ సమున్నతికి కారణమని హిందూ మత దురభిమానులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సత్యమేమిటి? అది భిన్నంగా ఉన్నది.భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య (భారత రిపబ్లిక్) పితామహులు, మాతృమూర్తులు మత దురభిమానాన్ని తోసిపుచ్చారు. మత ప్రాతిపదిక ఆధిక్యతావాదాలను తిరస్కరించారు. ఇదే మనలను పాకిస్థాన్‌కు భిన్నంగా ప్రగతిశీల బాటలో నిలిపింది. భారత రాజ్యాంగం పురాతన హిందూ రాజరిక పాలనా నమూనాలను తిరస్కరించింది. ఒక వ్యక్తి, ఒక ఓటు ఆధారంగా ఉండే రాజకీయ వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. కుల అసమానతలు, జెండర్ వివక్షలతో ఘనీభవించిన సంప్రదాయ సామాజిక నిచ్చెన మెట్ల వ్యవస్థను గర్హించింది.
మతాన్ని రాజ్యవ్యవస్థతో మిళితం చేసేందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించింది. పాకిస్థాన్ అలా చేసినప్పటికీ భారత్ తన లౌకిక, ప్రజాస్వామిక విశ్వాసాలకు పూర్తిగా కట్టుబడిపోయింది. స్వతంత్ర భారతదేశ నాయకులు ఆధునిక విజ్ఞానశాస్త్రానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. సహేతుక ఆలోచనా ధోరణులను పెంపొందించారు. ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించారు. భారత రిపబ్లిక్ సంస్థాపక విలువలు అయిన ప్రజాస్వామ్యం, బహుళత్వ వాదంను ఇండియా సదా గౌరవించలేదు, అనుసరించ లేదు. 1975–77 అత్యవసర పరిస్థితి కాలంలో దేశ ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు, పౌర స్వేచ్ఛలు లభించలేదు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు రాజ్యవ్యవస్థ హింసాకాండను చవి చూశాయి. మైనారిటీలపై మళ్లీ మళ్లీ దాడులు జరుగుతూనే ఉన్నాయి; విదేశీయులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ సంస్థాపక విలువలు సుస్థిరంగా ఉన్నాయి. 1991లో లైసెన్స్–పర్మిట్–కోటా రాజ్ రద్దయిన దరిమిలా రెండున్నర దశాబ్దాలలో దేశంలో అద్వితీయమైన అభివృద్ధి జరిగింది. ఇండియా కనుక సంకుచిత ప్రాతిపదికలపై ప్రాంతాల వారిగా చీలిపోయినా, నిరంకుశ పాలనలో ఉండిపోయినా, లేక మత రాజ్యంగా పరిణమించినా ఆ అద్భుత ఆర్థిక ప్రగతి సాధ్యమయ్యేది కాదు. ప్రచ్ఛన్నయుద్ధానంతర పరిస్థితులు ఆర్థిక పురోగతికి కల్పించిన అవకాశాలను పాకిస్థాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఎందుకని? దేశ రాజకీయాలలో సైన్యం జోక్యం పెరిగిపోవడం, పాకిస్థానీయుల దైనందిన జీవితాలలో ఛాందసవాద ఇస్లాం ప్రభావం పెరిగి పోవడమే అందుకు కారణాలు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడం, ఒసామా బిన్‌లాదెన్‌కు ఆశ్రయమివ్వడం, అణ్వస్త్రాల వ్యాప్తికి కీలకంగా తోడ్పడడం మొదలైనవి అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. భారత్, పాకిస్థాన్‌లు పూర్తిగా భిన్న బాటల్లో నడిచినప్పటికీ ప్రపంచ దేశాలు ఇప్పటికీ కొన్నిసార్లు రెండిటినీ ఒకే గాటన నిలబెడుతున్నాయి.
ప్రతి విషయంలోను ఉభయ దేశాలను కలిపి ప్రస్తావిస్తున్నాయి! కశ్మీర్‌పై మూడు యుద్ధాలు జరగడమే అందుకొక ప్రధాన కారణం. అయితే ఈ శతాబ్ది తొలినాళ్ల నాటికి భారత్ అన్ని విధాల అసాధారణ పురోగతి సాధించడంతో ‘ఇండో–పాక్’ ప్రశ్నపై తర్జనభర్జనలు ఆగిపోయాయి. ఇండియా తన అద్భుత పురోగతితో ఫలప్రదంగా పాకిస్థాన్‌తో తనను కలిపి చూసే ధోరణుల నుంచి బయటపడింది. అదే సమయంలో ఇండియాను చైనాతో కలిపి ప్రస్తావించడం ప్రారంభమయింది. ‘చిండియా’ అనే భావన బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇండియా ప్రజాస్వామిక సంప్రదాయాలు, బహుళత్వవాద విలువల కారణంగా జపాన్, ఉత్తర అమెరికా, యూరోపియన్ దేశాల ప్రభుత్వాల, ప్రజల, మదుపుదారుల మద్దతును విశేషంగా పొందింది. అయితే ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి, దానికి మన ప్రభుత్వ ప్రతిస్పందన ఫలితంగా భారత్, పాకిస్థాన్‌ల గురించి కలిపికట్టుగా మాట్లాడడం మళ్లీ ప్రారంభమయింది. భారత్ సమున్నతిని తక్కువ చేసే విధంగా హైఫనేషన్‌ను మళ్లీ ఉపయోగిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ అని విడివిడిగా కాకుండా భారత్–పాకిస్థాన్ అని ప్రస్తావిస్తున్నారు! భారత్, పాకిస్థాన్‌లు సమ స్థాయి దేశాలు అన్నట్టుగా డోనాల్డ్ ట్రంప్ స్పష్టాతి స్పష్టంగా మాట్లాడటం ప్రారంభించారు ఆ రెండూ ‘గొప్ప’ దేశాలనీ, రెండిటితోను తనకు మంచి సంబంధాలు ఉన్నాయనీ, కాల్పుల విరమణకు ఇరు దేశాల నాయకులను ఒప్పించానని, సరైన తీరులో ఉంటే వాణిజ్యం కొనసాగిస్తానని చెప్పానని ట్రంప్ వెల్లడించారు. పుండు మీద కారం చల్లినట్లగా కశ్మీర్‌పై ‘వెయ్యి’ సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధం విషయమై రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం నెరపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు. ట్రంప్ వాచాలుడు, అహంకారి, చంచల స్వభావి. అయితే ప్రపంచ అతి సంపన్న, మహాశక్తిమంతమైన దేశానికి అధ్యక్షుడు. ఆ దేశంతో మనకు కీలకమైన ఆర్థిక, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. కనుక ఆయన మాటలు ఎంత ఆషామాషీగా ఉన్నప్పటికీ మనం గంభీరంగా వినాలి. వాటిపై ఆలోచించాలి. అయితే అంతర్జాతీయ మీడియా జగత్తులో భారత్, పాకిస్థాన్‌లను హైఫన్ (భారత్–పాకిస్థాన్)తో ప్రస్తావించడాన్ని ఉపేక్షించకూడదు. ఈ నెల 10వ తేదీన భారత్, పాకిస్థాన్‌ల మధ్య చెలరేగుతున్న ఘర్షణల నేపథ్యంపై ‘ఫైనాన్సియల్ టైమ్స్’ ఒక విపుల కథనాన్ని ప్రచురించింది. దాని శీర్షిక : ‘Two religious strongmen clash’ ప్రస్తావిత ఇద్దరు వ్యక్తులు అసీమ్ మునీర్, నరేంద్ర మోదీ! తమ పౌరులకు మెరుగైన జీవన స్థితిగతులను సమకూర్చడంలో పాకిస్థాన్ కంటే ఇండియా అన్ని విధాల ఉన్నతస్థాయిలో ఉందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ మనకు మనం ఒక ప్రశ్న వేసుకునితీరాలి: ఇటీవలి సంవత్సరాలలో మనం తిరోగమించలేదూ? అమెరికా పూర్వ అధ్యక్షులు జార్జి బుష్, బరాక్ ఒబామా, జో బైడెన్ ఎప్పుడైనా భారత్, పాకిస్థాన్‌లను జోడించి ప్రస్తావించారా? కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం నెరపుతామని ప్రతిపాదించారా? మన్మోహన్‌సింగ్, నరసింహారావు, రాజీవ్‌గాంధీ, దేవెగౌడ లేదా అటల్ బిహారి వాజపేయిలలో ఎవరినైనా Religious strongman’ అని ఫైనాన్సియల్ టైమ్స్ ఎప్పుడైనా ప్రస్తావించిందా? నిజానికి ఇండియా గత దశాబ్దంలో తిరోగమించిందని ఒక చరిత్రకారుడుగా, ఒక పౌరుడుగా నేను సునిశ్చితంగా వాదిస్తాను. ఇప్పటికీ మనం జాతీయ స్థాయిలోను, రాష్ట్రాల స్థాయిలోను ఎన్నికలను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నాము.
అయితే ఆ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, సక్రమంగా జరుగుతున్నాయా అనే విషయమై న్యాయసమ్మతమైన సంశయాలు ఉన్నాయి. మీడియా చాలవరకు ప్రభుత్వ ప్రచారానికి ఒక ప్రధాన ఆలంబనగా ఉయోగపడుతోంది. రెగ్యులేటరీ, దర్యాప్తు సంస్థలు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లు జాతీయ పాలక పక్షానికి అనుకూలంగా ఉంటూ సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తున్నారు. ప్రధానమంత్రి వ్యక్తిపూజ బ్రహ్మాండంగా వర్ధిల్లుతోంది– ప్రజల సొమ్ముతో సుమా! ఈ ఆరాధనా భావం మన ప్రజాస్వామ్య ప్రమాణాలను మరింతగా భ్రష్టుపరిచింది. మన ప్రజాస్వామ్యం అంతకంతకూ మరింత లోపభూయిష్టమవుతోంది. మన లౌకికవాద, బహుళత్వవాద విలువలపై దాడులు తీవ్రమవుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌తో సంఘర్షణ సమయంలో అధికారప్రతినిధిగా ఒక ముస్లిం మహిళా సైనికాధికారిని నియమించడంలో ఉన్న ప్రతీకాత్మక విలువ, ఒక సీనియర్ బీజేపీ నాయకుడు ఆమెను అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలతో, వ్యర్థమైపోయింది. ఇటీవలి సంవత్సరాలలో నోయిడా మీడియా, హిందూత్వవాదులు ఉధృతం చేసిన ముస్లిం వ్యతిరేక విష ప్రచారం రాబోయే నెలల్లో తగ్గిపోతుందో లేదో వేచి చూడవలసి ఉంది. పహల్గాం ఉగ్రవాద దాడి దరిమిలా కశ్మీర్ లోయలో అనేక మందిని అకారణంగా అరెస్ట్ చేశారు. పలువురి గృహాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. కశ్మీరీలకు సంతోషప్రదమైన భవిష్యత్తును, అవి సూచిస్తున్నాయా? పహల్గాం ఘటన, దాని పర్యవసానాల పట్ల అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలు మనకు నేర్పుతున్నదేమిటి? భారత్‌ను పాకిస్థాన్‌తో జోడించి మాట్లాడేందుకు మళ్లీ జరుగుతున్న ప్రయత్నాలకు మనమెలా ప్రతిస్పందించాలి? నిరాలోచనపరుడు అయిన యుద్ధోన్మాది ‘అర్బన్ నక్సల్స్’ను నిందిస్తాడు. బాధితుడి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తాడు. ఆ తరువాత ఇండియా ఇప్పుడూ ఎప్పుడూ విశ్వగురుగా ఉండిపోతుందని ప్రకటిస్తాడు. ఆలోచనాశీలి అయిన దేశభక్తుడు ఆత్మపరిశీలన చేసుకోవడం ప్రారంభిస్తాడు. నిరంకుశ పాలనా ధోరణులు, మెజారిటేరియనిజం పెచ్చరిల్లిపోవడాన్ని గత దశాబ్దం చూసింది: ఇదే ఇండియాను పొరుగుదేశంతో పోల్చేందుకు పురిగొల్పుతోంది. కనుక మనం జాగ్రత్తగా ఆత్మపరీక్ష చేసుకోవాలి. మన రిపబ్లిక్ సంస్థాపక విలువలు అయిన ప్రజాస్వామ్యం, బహుళత్వవాదంకు పునరంకితమయ్యేందుకు కాలం మించి పోయిందా అనే ప్రశ్న వేసుకోవాలి.
(వ్యాసకర్త చరిత్రకారుడు)