Share News

New Era of Space Exploration: అంతరిక్షపరిశోధనలో నవ శకం

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:15 AM

భారతదేశం నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వేషణకు సిద్ధమవుతున్నది. 2023, ఆగస్టు...

New Era of Space Exploration: అంతరిక్షపరిశోధనలో నవ శకం

భారతదేశం నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వేషణకు సిద్ధమవుతున్నది. 2023, ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ అనే ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఈ మిషన్ విజయం అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. భారతదేశం చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టిన నాల్గవ దేశంగా, దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించింది. ఈ దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాముఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానున్నది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో వృత్తిని కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనున్నది. ఈ ఏడాది ‘ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ వరకు: ప్రాచీన జ్ఞానం నుంచి అనంతమైన అవకాశాలు’ అనే ఇతివృత్తంతో అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.


2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడి పైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించుకున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించడానికి గగన్‌యాన్ మిషన్ కీలకం కానున్నది. భూమికి దగ్గరగా 400 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం. ఇందులో భాగంగా మొదట 2026 నాటికి వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ చేపట్టనున్నారు. మరోవైపు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం మానవ సహిత చంద్రుడి యాత్రకు సిద్ధం కానుంది. చంద్రయాన్–4లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం ప్రధాన లక్ష్యం. ఎల్వీఎం అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ సాంకేతికత భవిష్యత్తులో మావన సహిత యాత్రలకు, అంతరిక్ష కేంద్రాల నిర్మాణానికి చాలా అవసరం. ఇటీవల భారత వాయుసేన పైలట్‌, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా యాక్సియం–4 మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించి తిరిగి వచ్చారు. చంద్రయాన్–3 విజయవంతమైన తర్వాత, జపాన్‌ స్వయంగా భారత్‌ సహకారం కోరింది. దీంతో ఇస్రో, జపాన్‌ అంతరిక్ష సంస్థ JAXA కలిసి చంద్రయాన్‌–5/LUPEX మిషన్ కోసం పనిచేయాలని నిర్ణయించారు.


ఇస్రో అత్యంత ఖచ్చితత్వంతో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నది. మరోవైపు వాణిజ్య ఉపగ్రహాలతో విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాలతో వాతావరణ సూచన, సమాచార మార్పిడి (టీవీ, ఇంటర్నెట్), నావిగేషన్ (జీపీఎస్‌), భూమి పరిశీలన (పర్యావరణ మార్పులు, విపత్తులు), శాస్త్రీయ పరిశోధన, రక్షణ వంటి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. మరోవైపు ఇస్రో పునర్వినియోగ రాకెట్ల(పుష్పక్) తయారీ, చిన్న రాకెట్ల ప్రయోగ వేదికను సిద్ధం చేస్తున్నది. వీటితో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాల ప్రయోగం, చిన్న ఉపగ్రహాల సత్వర ప్రయోగానికి బీజం పడనున్నది. భారత ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధానాన్ని ప్రకటించింది. అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తి పెంచాలి. ఉన్నత విద్య, పరిశోధనలో యువ భాగస్వామ్యాన్ని పెంచాలి. శాస్త్ర పరిశోధనలకు మన దేశ జీడీపీలో ఒక శాతం లోపే ఖర్చు చేస్తున్నారు. మరింత బడ్జెట్ కేటాయించి, నూతన ఆవిష్కరణలతో ముందుకెళ్లాలి. ఉద్యోగాల సృష్టి జరగాలి. అప్పుడే వికసిత్ భారత్ 2047 కల సాకారం అవుతుంది.

-సంపతి రమేష్ మహారాజ్

Updated Date - Aug 23 , 2025 | 05:20 AM