Share News

Strengthening Bilateral Ties: కలిమి బలిమి

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:39 AM

మాల్దీవులతోనూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు ఆరంభమైనాయని అంటున్నారు భారత..

Strengthening Bilateral Ties: కలిమి బలిమి

మాల్దీవులతోనూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు ఆరంభమైనాయని అంటున్నారు భారత ప్రధాని నరేంద్రమోదీ. భారత్‌కు మాల్దీవులు అత్యంత విశ్వసనీయదేశమని, ‘పొరుగుకే తొలిప్రాధాన్యం’ కింద ఆ దేశానికి ప్రముఖస్థానం ఉంటుందని శుక్రవారం బ్రిటన్‌నుంచి మాల్దీవులకు చేరుకున్న ఆయన హామీ ఇచ్చారు. బ్రిటన్‌తో కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం మన పాలకులకు మంచి ఉత్సాహాన్నిచ్చినట్టుంది. ఒకదేశపు ఉత్పత్తులు మరోదేశంలోకి హద్దులు లేకుండా ప్రవేశిస్తూ, నియంత్రణలు లేని వాణిజ్యం సాగుతున్నప్పుడు ఆ విధానంతో ఒకదేశం కాస్తంత నష్టపోక తప్పదన్న వాదనను పాలకులు, స్వేచ్ఛావాణిజ్య ప్రభోదకులు ఏ మాత్రం ఒప్పుకోరు. భారత్‌–బ్రిటన్‌ మధ్యకుదిరిన ఒప్పందంతో రెండు దేశాలకూ ఏకరీతిగా మేలు జరుగుతుందని అనుకున్నపక్షంలో, మళ్ళీ ఎవరికివారు స్వదేశంలో తమకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో అర్థంకాదు.


భారత్‌–బ్రిటన్‌ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)తో భారత్‌కే ఎక్కువ ప్రయోజనమని రిజర్వుబ్యాంకు గవర్నర్‌ కూడా అంటున్నారు. భారత ఆర్థికవ్యవస్థలోని అనేక రంగాల అభివృద్ధికి ఈ ఒప్పందం సహాయపడుతుందనీ, ఇలాగే అనేక దేశాలతో మనం ఒప్పందాలు చేసుకోవాలని ఆయన అంటున్నారు. ప్రపంచవాణిజ్య సంస్థ నియమాలు, నిబంధనలను ట్రంప్‌ వంటివారు ఉల్లంఘిస్తూ, సుంకాల యుద్ధాలు చేస్తున్న తరుణంలో ఇటువంటి ద్వైపాక్షిక స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలతో భద్రత సమకూర్చుకోవాల్సిన అవసరం కాదనలేనిది. అమెరికా సహా చాలాదేశాలతో ఎఫ్‌టీఏలకోసం ఇప్పటికే మనదేశం వాణిజ్యచర్చలు చేస్తున్నది కూడా. భారత్‌– బ్రిటన్‌ ఎఫ్‌టీఏని తక్షణ ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికన అంచనావేయకూడదని, ఇది ఉభయదేశాల ద్వైపాక్షిక బంధాన్నీ, మైత్రినీ, ఇతరత్రా రంగాలకు సైతం విస్తరించగలిగే సహాయసహకారాలనూ ప్రభావితం చేసే అంశమని విశ్లేషకులు సలహా. రెండుదేశాల సంబంధాలను ఇంతవరకూ గతకాలపు వలసపాలన వాసనలు ప్రభావితం చేశాయని, ఇప్పుడు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా నిలబడిన భారతదేశం తనను ఒకప్పుడు ఏలిన దేశంతో సమానస్థాయిలో వాణిజ్యం చేయబోతున్నదని, పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రయోజనాల ప్రాతిపదికన ఇది రూపొందిందని వారంటారు. ఉభయదేశాల భావి తరాలకు ఈ ఒప్పందం పలురకాల ప్రయోజనాలను చేకూరుస్తుందని కూడా వారు హామీ ఇస్తున్నారు.


యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి వైదొలిగిన బ్రిటన్‌కు ఈ ఒప్పందం ఎక్కువ సంతోషం కలిగించినమాట నిజం. ‘బ్రెగ్జిట్‌’ ప్రక్రియ ఆ దేశాన్ని రాజకీయంగానూ, ఆర్థికంగానూ బాగా కుదిపేసింది. వీడిపోవాలని నిర్ణయించుకున్న బ్రిటన్‌తో ఈయూ అగౌరవంగా వ్యవహరించింది. తెగదెంపులను కష్టతరం చేసింది. బ్రిటన్‌ వరుస ప్రధానులను బ్రెగ్జిట్‌ బలితీసుకుంది. ఈయూనుంచి బయటకు వచ్చిన బ్రిటన్‌కు భారత్‌ సహకారం అవసరమని బోరిస్‌ జాన్సన్‌ అప్పట్లోనే గ్రహించి ఈ ఎఫ్‌టీఏ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అనంతరం లిజ్‌ట్రస్‌, రిషీసునాక్‌ కూడా నిష్క్రమించి, ఎన్నికల్లో లేబర్‌పార్టీ నెగ్గి, స్టార్మర్‌ వచ్చిన తరువాతగానీ ఇది వాస్తవరూపం దాల్చలేదు. బ్రిటన్‌ పార్లమెంట్‌ ధ్రువీకరణ ఏడాదిలోగా పూర్తయి ఆచరణలోకి రావడమే కాక, మరో నాలుగేళ్ళలోనే ఉభయదేశాల వాణిజ్య పరిమాణం 12వేల కోట్ల డాలర్లకు చేరాలన్నది లక్ష్యం. ఈ ఒప్పందంతో తగ్గబోతున్న సుంకాలు, పెరగబోతున్న ఎగుమతులు, బాగుపడే రంగాలమీద లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఖరీదైన వివిధ బ్రాండ్ల బ్రిటిష్‌ మద్యం మనదేశంలో ప్రవహిస్తుంది, జాగ్వార్లు, ల్యాండ్‌రోవర్లు మనరోడ్లమీద షికార్లు చేస్తాయి. అక్కడా ఇక్కడా కూడా కార్లతయారీలో ఉన్న టాటాలకు ఈ ఒప్పందం లబ్ధిచేకూరుస్తుంది. ఈ ఒప్పందంమీద రెండుదేశాల్లోనూ సముచితమైన భయాలు, అనుమానాలు లేకపోలేదు. వలసవిధానం మారదు, భారతదేశంనుంచి వచ్చే కార్మికుల సంఖ్య పెరగదని అక్కడి పాలకులు తమవారికి నచ్చచెప్పుకుంటున్నారు. ఇక్కడి చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఏ నష్టమూ వాటిల్లదని మనవారు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఓ యాభైవేల కోట్ల రూపాయల వాణిజ్య వ్యవహారంగా ఉపరితలంలో కనిపిస్తున్నా, దీనిపునాదిగా అన్నిరంగాల్లోకీ విస్తరించబోయే దౌత్యబంధంతో భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేకూరుతుందన్న హామీలను ఇప్పటికైతే విశ్వసిద్దాం.

Updated Date - Jul 26 , 2025 | 12:39 AM