Share News

Diplomacy Analysis: ఇందిర, మోదీ... ఇద్దరూ ఇద్దరే

ABN , Publish Date - May 22 , 2025 | 06:22 AM

1971లో ఇందిరాగాంధీ, 2025లో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్–అమెరికా సంబంధాలు, పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్తతలపై వివిధ దౌత్య వ్యూహాలను విజయవంతంగా ఎదుర్కొన్నాయి. నిక్సన్, ట్రంప్ నాయకత్వానికి వచ్చిన ప్రతిస్పందనలు, వారి వ్యూహాత్మక వైఖరులు మధ్య తేడాలు విశ్లేషించబడినాయి.

Diplomacy Analysis: ఇందిర, మోదీ... ఇద్దరూ ఇద్దరే

భారతదేశం – పాకిస్థాన్‌ మధ్య 1971 యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావం; 2025లో ఆపరేషన్ సిందూర్; ఈ రెండు సందర్భాల్లోనూ భారత్–అమెరికా మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలు ప్రపంచ రాజకీయాల మీద ప్రభావం చూపాయి. భారత ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ నుంచి నరేంద్ర మోదీ దాకా, అమెరికా అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ దాకా ఈ రెండు సందర్భాల్లోనూ నేతృత్వ శైలుల మధ్య తేడాలు, దౌత్య నైపుణ్యాలు, రాజకీయ వ్యూహాలు, పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను అరికట్టే దిశగా భారతదేశం ఎదుర్కొన్న సవాళ్ళను విశ్లేషించడం ఒక సవాలే. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అనుసరించిన పాకిస్థాన్‌ పక్షపాత దౌత్యతంత్రం; 2025లో ట్రంప్ అహంభావ, అనిర్ణయాత్మక రాజకీయ వైరుధ్యం... ఇవి రాజకీయ దౌత్య అధ్యయనాల్లో చర్చకు రావాల్సిన అంశాలు. నిక్సన్‌కు యాహ్యాఖాన్‌ మీద ప్రేమ లేకపోయినా, అమెరికా ప్రయోజనాల కోణంలో పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చి సహాయం అందించాడు. ట్రంప్ ప్రతిస్పందన వ్యక్తిగత ఆడంబరం. భారతదేశం–పాకిస్థాన్‌ ఉద్రిక్తతల మధ్య కాల్పుల విరమణకు తానే కారకుడన్నట్లు, అదేపనిగా ఆర్భాటంగా చెప్పుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్‌ బాధ్యతలేని నేత. అణ్వాయుధ ఉద్వేగాలకు ఆస్కారమున్న భారత ఉపఖండం విషయంలో, అగ్రరాజ్యాధినేతగా ప్రదర్శించాల్సిన గంభీరత, వ్యూహాత్మకత చతురత ట్రంప్ మాటలోను, నడతలోను ఇసుమంతైనా లేదు. ఇది దౌత్యనీతికి విరుద్ధం. ఇందిరా గాంధీ నేతృత్వంలోని వ్యూహాత్మక, యుద్ధ–దౌత్యనీతి నిర్ణయాలు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలిపాయి. నరేంద్రమోదీ నేతృత్వంలో జాగరూకతతో, ఒక్కొక్క అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది. అమెరికా విదేశీ విధానంలో సంభవించిన మార్పులు, అంతర్జాతీయ స్థితిగతులే దీనికి కారణం. నిక్సన్‌ను ధీరోదాత్తంగా ఎదుర్కొన్న ఇందిరా గాంధీ భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అలవోకగా సమకూర్చారు. వర్తమాన వాతావరణానికి అనుగుణంగా, ట్రంప్ అనిశ్చితి నేపథ్యంలో, నరేంద్ర మోదీ అత్యంత జాగ్రత్తగా, స్వల్ప స్పందనతో సమయానుకూలంగా వ్యవహరించాల్సి వచ్చింది. అంతిమంగా, ఇందిర, మోదీలు ఇరువురూ, వారివారి పరిస్థితులకు అనుగుణంగా విజయాన్నే సాధించారు. నిక్సన్ వ్యూహాత్మక అమెరికాకు ప్రతినిధి.


ట్రంప్ చరిత్రతో సంబంధం లేకుండా, ప్రాదేశిక సమస్యల సంక్లిష్టతను పట్టించుకోకుండా, అవగాహనా రాహిత్యంతో వ్యవహరించారు. నిక్సన్ వైఖరి చర్చనీయాంశమే అయినప్పటికీ, అది సంస్థాగత పాలనాచట్రానికి అనుగుణంగా ఉన్నది. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా స్థాయికి ఏమాత్రం తగనివి. అవి విదేశాంగ విధానాన్ని వ్యక్తిగత ఆకాంక్షలుగా మలిచే ఆందోళనకర దృక్పథాన్ని ప్రతిబింబించాయి. భారత్‌, అమెరికాలు కాలక్రమంలో పరిస్థితులకు అనుగుణంగా మార్పునకు గురయ్యాయి. భారత్ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోతుంటే, అమెరికా దౌత్యం గణాంకాల చట్రంలో ఇరుక్కుపోయింది. లాభనష్టాలు బేరీజు వేసుకుంటూ, అసందర్భ ప్రదర్శనల దిశగా జారిపోయింది. 1971 యుద్ధం ద్వారా ఉపఖండంలో తన ప్రాదేశిక ఆధిపత్యాన్ని దృఢపరచుకున్నది భారత్‌. 2025 పాక్–భారత్ సంఘర్షణ ‘ప్రదర్శనాత్మక దౌత్యానికి’ ఉన్న పరిమితులను బహిర్గతం చేసింది. నిక్సన్–ట్రంప్, ఇందిర–మోదీల మధ్య తారతమ్యాన్ని, 1971–2025 మధ్యన చోటుచేసుకున్న విభిన్న భౌగోళిక–రాజకీయ ఘట్టాలను విశ్లేషణ చేయడం అవసరం. నిక్సన్, ట్రంప్‌లు భారత్–పాకిస్థాన్‌ సంక్షోభాలకు ఎలా స్పందించారు? ఇందిర, మోదీల ప్రతిస్పందనలు ఎలా భిన్నంగా అభివ్యక్తమయ్యాయి? అనేవి పరిశోధనకు అనువైన అంశాలు. వ్యూహాత్మక దౌత్యం, ప్రదర్శనాత్మక దౌత్యం మధ్య తేడాను విశ్లేషించడం, దేశవాళీ స్థాయిలో ఇందిర, మోదీల నాయకత్వ బలాన్ని, అంతర్జాతీయ వ్యవహారాలకు ఎలా అన్వయించారో గమనించడం, భారత వ్యూహాత్మక ప్రయోజనాల కోణంలో అమెరికా నాయకత్వాన్ని విశ్లేషణతో చూపడం లాంటి అంశాలన్నీ పరిశోధనకు తగినవే. బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని మిగతా ప్రపంచం ఆశ్చర్యంతో వీక్షిస్తుండగా, ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌కు ఆవేదనతో, ఆవేశంతో రాసిన ఉత్తరాన్ని 1971 డిసెంబర్ 17న న్యూయార్క్ టైమ్స్ ‘మిసెస్ గాంధీ రైట్స్ టు ప్రెసిడెంట్: యూఎస్ కుడ్ హావ్ అవర్టెడ్ వార్’ శీర్షికతో ప్రచురించింది. దశాబ్దాలపాటు గుర్తుంచుకునే అపూర్వమైన ‘దౌత్యపూరిత సంభాషణగా’ భావించాల్సిన ఆ ఉత్తరంలో ఇందిరాగాంధీ– ‘‘మేము తప్పెక్కడ చేశామో మీరు చెప్పగలరా నిక్సన్?’’ అని అమెరికాను ధీటుగా, సూటిగా ప్రశ్నించారు.


పక్షపాతంపై వ్యంగ్య స్పందనగా కాకుండా, సహేతుకమైన విమర్శగా నిలిచిందది. ఇందిరా గాంధీ ఆవేశానికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించడం, తూర్పు పాకిస్థాన్‌లో రాజకీయ పరిష్కారాన్ని సాధించడానికి ఇందిరాగాంధీ హెన్రీ కిసింజర్‌కు ఇచ్చిన సూచనలు విఫలం కావడం, అమెరికా అణ్వస్త్ర నౌక బంగాళాఖాతంలోకి ప్రవేశించడం, అమెరికా నుంచి వెలువడిన వ్యాఖ్యలన్నీ భారతదేశంపై అది కక్షపూరితంగా ఉన్నదన్న భావనను కలిగించడం... ఇవన్నీ కలిసి ఇందిరాగాంధీ నిక్సన్‌కు ఉత్తరం రాయడానికి దారితీశాయి. ఈ లేఖను ఆమె నేరుగా నిక్సన్‌కు పంపారు. అంతర్జాతీయంగా ఒంటరిదైనా, ఇందిరాగాంధీ నాయకత్వంలో భారతదేశం 1971 యుద్ధంలో గెలిచింది. సోవియెట్ యూనియన్‌తో స్నేహ ఒప్పందం, స్వదేశీ ఆయుధ బలం ఆధారంగా బంగ్లాదేశ్‌ను స్థాపించగలిగింది. గెలుపు తరువాత కూడా ఇందిరాగాంధీ ఓర్పుతో, సంయమనంతో, రాజనీతిజ్ఞతతో వ్యవహరించారు. ‘‘మాకు ఎటువంటి పాకిస్థాన్ భూభాగం అవసరం లేదు.తూర్పు పాకిస్థాన్‌గా ఉండి, ఇప్పుడు బంగ్లాదేశ్‌గా మారిన భూభాగం పట్లా, పశ్చిమ పాకిస్థాన్‌ భూభాగం పట్లా మాకు ఎలాంటి ఆకాంక్షా లేదు’’ అని ఆమె స్పష్టం చేశారు. ‘‘మాకు శాశ్వత శాంతి కావాలి, కానీ పాకిస్థాన్ దీనికి సిద్ధంగా ఉందా?’’ అనే ప్రశ్న సంధించారు. రాజకీయ పరిష్కారాన్ని సాధించేందుకు అమెరికా తన శక్తి, ప్రభావం, అధికారాలను వినియోగించి ఉండినట్లయితే, భారత్, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం తప్పించగలిగేది అని ఇందిరా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. అర్ధ శతాబ్దం తర్వాత, 2025లో చరిత్ర మరోలా పునరావృతమైంది. ఒకవైపు, నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత్, ప్రపంచీకరణ రాజకీయాలపై ఆధారపడినదిగా మారింది. మరోవైపు, పాకిస్థాన్‌ను ప్రపంచ వేదికలపై ఒంటరిపరిచే పనిలో బిజీగా ఉంది. అప్పటి భారత్ ‘‘ఒంటరిగా నిలబడి గెలిచిన దేశం’’ కాగా ఇప్పటి భారత్ ‘‘సహచరులతో కలిసి గెలవాలనుకునే దేశం’’. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో విజయవంతమైన ఆపరేషన్ సిందూర్ భారతదేశ సామర్థ్యాన్ని, ప్రపంచానికి చాటిచెప్పింది.


తాను కోరుకున్న లక్ష్యాలను సాధించిన తరువాత పాకిస్థాన్‌ అభ్యర్థన మేరకు భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించింది. పిలవని పేరంటంలాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా అసందర్భ ప్రకటనలు చేశారు. తానే మాట్లాడి ఇరుదేశాల మీద ఒత్తిడి పెంచి కాల్పుల విరమణ కోసం ఒప్పించానని ప్రకటించారు. అమెరికా అంతర్గత రాజకీయాల్లో తనకు మెప్పు లభించేలా ట్రంప్‌ వ్యవహార శైలి నడిచింది. ఓర్పు, నేర్పు, చిత్తశుద్ధి, రాజకీయ పరిపక్వతతో ఇందిరాగాంధీ నిక్సన్‌కు ధీటుగా సమాధానం చెప్పి, దేశాన్ని గౌరవంతో ముందుకు నడిపించారు. ఇప్పుడు భారత్ ఒక గ్లోబల్ శక్తిగా ఎదిగిపోయింది. అమెరికాతో వ్యవహరించాల్సిన అవసరం వచ్చినప్పుడు ట్రంప్ నమ్మదగిన వ్యక్తి కాదని మోదీ గుర్తించి ఉంటారు. అందుకే ట్రంప్‌ మాటలను పట్టించుకోకుండా వ్యవహరించారు. 1971లో ప్రపంచంలో తన స్థానం కోసం పోరాడిన భారతదేశం, 2025లో ప్రపంచంలో తన గౌరవాన్ని నిలబెట్టుకునే స్థాయికి వచ్చింది. రెండు సందర్భాలూ భారతదేశానికి ఒకే పాఠాన్ని నేర్పాయి– అంతర్జాతీయ వ్యవహారాల్లో శాశ్వత మిత్రులూ, శాశ్వత శత్రువులూ ఉండరని. శక్తి సామర్థ్యాలను, మైత్రిని, విశ్వసనీయతను సమపాళ్లలో నైపుణ్యంగా వినియోగించగల నాయకత్వమే నిర్ణయాత్మకమవుతుంది. ఇందిరాగాంధీ భారత్‌ను పునర్నిర్వచించారు. అంతర్జాతీయ సంబంధాలను మోదీ నూతన దిశగా తీసుకెళ్లారు. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టినవారే.

-వనం జ్వాలానరసింహారావు

Updated Date - May 22 , 2025 | 08:58 PM