India Pakistan Ceasefire: ట్రంప్ దౌత్య రాజకీయం
ABN , Publish Date - May 17 , 2025 | 03:55 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డోనాల్డ్ ట్రంప్ నుండి భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలలో దూరంగా ఉండాలని కోరినప్పటికీ, ట్రంప్ వాటిలో అసలు ప్రమేయం పెట్టకుండా ఉండరు. మే 10న ట్రంప్ మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రకటించారు, కానీ ఈ ప్రకటనకు సంబంధించిన అనేక ప్రశ్నలు ఇంకా ఉంచబడ్డాయి.
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత వ్యవహారాలలో ప్రమేయం పెట్టుకోకుండా దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. అయితే ట్రంప్ మహాశయుడు మోదీ అభీష్టాన్ని నెరవేరుస్తారా? నెరవేర్చరు, సందేహం లేదు. ఏప్రిల్ 22, 2025న పహల్గాంలో ఉగ్రవాద దాడితో ప్రారంభమైన ఇండియా–పాకిస్థాన్ సంఘర్షణలో అమెరికా ప్రమేయం పెట్టుకుని తీరాలని డోనాల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఈ ఘర్షణపై తాను మాట్లాడిన ప్రతిసారీ, ట్వీట్ చేసిన ప్రతిసారీ తానూ భాగస్తుడినని మరీ మరీ స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ అత్యుత్సాహానికి మౌనమే ఇంతవరకూ మోదీ ప్రతిస్పందన. సెప్టెంబర్ 2019లో హ్యూస్టన్‌లో ‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అని పిలుపు ఇచ్చినందుకు మోదీ ఇప్పుడు కలవరపడుతూ ఉండవచ్చని నేను అనుమానిస్తున్నాను. ఏప్రిల్ 22న, ఇతర ప్రపంచ నాయకుల వలే ట్రంప్ కూడా పహల్గాం ఘాతుకంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. మే 7న పాకిస్థాన్‌లో ఎంపిక చేసిన లక్ష్యాలపై భారత్ మిస్సైళ్ల, డ్రోన్‌ల దాడి ప్రారంభించింది. పూర్తి స్థాయి యుద్ధానికి దిగే ఉద్దేశం తమకు లేదని ఇండియా స్పష్టం చేసింది. భారత్ పాకిస్థాన్‌ల మధ్య సాయుధ ఘర్షణ శీఘ్రగతిన ముగుస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ మరుసటి రోజు ‘తాను ఏమైనా సహాయం చేయగలుగుతానని భావిస్తే అక్కడ ఉంటాను’ అని ఆయన అన్నారు. మే 8/9 రాత్రి ఆయన వైఖరిలో ఏదో మార్పు చోటుచేసుకున్నది. చైనా ఉత్పత్తి చేసిన యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, టర్కీలో తయారైన డ్రోన్స్‌ను పాకిస్థాన్ ఉపయోగిస్తున్న విషయం తెలియడం వల్లే ఆ మార్పు సంభవించి ఉంటుందని నేను భావిస్తున్నాను.
పాకిస్థాన్ ప్రయోగించిన మిస్పైళ్లు, డ్రోన్‌లు అన్నిటినీ కూల్చివేసినట్టు మన సీనియర్ సైనికాధికారులు ధ్రువీకరించారు. రెండు రోజుల అనంతరం భారత్‌కు కొంత ‘నష్టం’ సంభవించినట్టు అధికారికంగా అంగీకరించారు. యుద్ధంలో రెండుపక్షాలకు నష్టం వాటిల్లడం సహజమే కదా. జరిగిన నష్టానికి ఇండియా ఏమీ ఆందోళన చెందలేదు. భారత ప్రజలూ కలవరపడలేదు. మే 10న ట్రంప్ తన వ్యక్తిగత సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన ట్వీట్‌తో కలవరం మొదలయింది. ఆ రోజు సాయంత్రం 5.25 గంటలకు ట్రంప్ తన ట్వీట్‌లో అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చల గురించి ప్రస్తావిస్తూ భారత్, పాకిస్థాన్‌లు తక్షణమే, పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకరించాయని ప్రకటించేందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాలను అభినందించారు. కొద్ది నిమిషాల అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఒక ‘తటస్థ’ ప్రదేశంలో చర్చలకు భారత్, పాకిస్థాన్‌లు సమావేశమవనున్నాయని ట్వీట్ చేశారు. అంతకు ముందు రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ మోదీతో టెలిపోన్‌లో జరిపిన సంభాషణల్లో ఆందోళనకరమైన గూఢచార సమాచారాన్ని తెలియజేసినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.ఈ ట్వీట్‌లు అన్నీ ఆసక్తికరంగానూ, దిగ్భ్రాంతికరంగాను ఉన్నాయి. మే 10 మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్, పాకిస్థాన్ డీజీఎమ్‌ఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)ల మధ్య చర్చలు జరిగాయని, సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని అదే రోజు సాయంత్రం 6 గంటలకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ధ్రువీకరించారు. మే 12న ‘అణు యుద్ధ’ ప్రమాదాన్ని నివారించామని ట్రంప్ పేర్కొన్నారు. ‘ఆ భయంకర యుద్ధానికి పాల్పడవద్దు. మీరు సంయమనంతో వ్యవహరిస్తేనే మీతో మేము వాణిజ్యం చేస్తామ’ని ఆయన అన్నారు. ‘మీరు గనుక యుద్ధాన్ని ఆపకపోతే మేము ఎటువంటి వాణిజ్యమూ చేయం’ అని ఆయన పేర్కొన్నారు. (సౌదీ అరేబియా, ఖతర్ పర్యటనలలో కూడా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రకటనలను పునరుద్ఘాటించారు). మే 13న ‘కొత్త సాధారణ పరిస్థితి’ గురించి మోదీ ప్రస్తావించారు. ‘అణు బ్లాక్ మెయిల్’కు తాము భయపడమని, తలొగ్గమని స్పష్టం చేశారు. కొన్ని సహేతుకమైన ప్రశ్నలు: మూడు అంశాల సూత్రంలో ‘కొత్త’ విషయమేమీ లేదు.
ఉగ్రవాద దాడికి దీటుగా ప్రతిస్పందించడం; అణు బ్లాక్‌మెయిల్‌ను సహించకపోవడం; రాజ్య ఉగ్రవాదం, ఉగ్రదాడుల వ్యూహ ప్రజ్ఞాధురీణుల మధ్య వ్యత్యాసాన్ని పాటించకపోవడం. ఈ సువ్యవస్థిత సిద్ధాంతాన్నే కదా మోదీ పునరుద్ఘాటించింది? (2) ఉపాధ్యక్షుడు వ్యాన్స్, విదేశాంగ కార్యదర్శి రూబియో మే 8, 9న కాల్పుల విరమణ గురించి మాట్లాడారా? అదే సమయంలో వారు పాకిస్థాన్ నేతలతో కూడా మాట్లాడారా? మాట్లాడి ఉన్నట్టయితే అది మధ్యవర్తిత్వం కిందకు వస్తుంది కదా. (3) మే 9న మోదీతో ‘ఆందోళనకరమైన గూఢచార సమాచారాన్ని’ ఉపాధ్యక్షుడు వ్యాన్స్ పంచుకున్నారా? అణ్వస్త్రాలను ప్రయోగిస్తామన్న పాకిస్థాన్ బెదిరింపునకు సంబంధించినదేనా ఆ సమాచారం? కానట్టయితే ప్రధానమంత్రి (మే 12), రక్షణ మంత్రి (మే 15) అణు బ్లాక్‌మెయిల్ గురించి ఎందుకు ప్రస్తావించారు? (4) మే 10న మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్, పాకిస్థాన్‌ల డీజీఎమ్‌ఓలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టు ట్రంప్‌కు ఎలా తెలిసింది? ఆ విషయాన్ని అదే రోజు సాయంత్రం 5.25 గంటలకు తన ట్వీట్‌లో ఆయన ఎలా ప్రకటించారు? (5) ట్రంప్ ఏప్రిల్ 2న సుంకాల సమరాన్ని ప్రారంభించిన తరువాత భారత్ మారు ప్రతిపాదనలు పంపలేదా? ఉపాధ్యక్షుడు వ్యాన్స్ తన ఇండియా పర్యటనలో మోదీతో జరిపిన సంభాషణల్లో ‘వాణిజ్య ఒప్పందం’ విషయాన్ని ప్రస్తావించిందా? (6) భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం చేశామని, వాణిజ్యం అంశాన్ని ఉపయోగించుకుని కాల్పుల విరమణ పాటించేలా బలవంతం చేశామని ట్రంప్ పదే పదే చెప్పుతుండడంపట్ల అమెరికాకు ఇండియా నిరసన తెలిపిందా? పాకిస్థాన్‌కు ఐఎమ్‌ఎఫ్ రుణం మంజూరుకు సంబంధించిన సమావేశానికి ఇండియా ఎందుకు గైర్హాజరయింది? ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయలేదు? ఇంకా వివిధ ప్రశ్నలు ఉన్నాయి. అయితే వాటిని ప్రస్తావించేందుకు తగిన సమయం ఆసన్నమవలేదు. డోనాల్డ్ ట్రంప్ ఎవరికీ లొంగే వ్యక్తి కాదు. భారత్, పాకిస్థాన్ ఘర్షణ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉండరు, ఉండబోరు. ఇబ్బంది కలిగించే ప్రకటనలు చేస్తూనే ఉంటారు. ఇంకా అనేక ప్రశ్నలకు ఆస్కారమిచ్చే విపుల సమాచారాన్ని ఆయన తప్పకుండా ఇస్తారు. అది లేవనెత్తే ప్రశ్నలు అన్నిటికీ మనకు సమాధానాలు లభిస్తాయా? లేక మౌనమే సమాధానమా?
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)