Share News

Indian Air Force: సత్యాసత్యాలు

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:35 AM

పాకిస్తాన్‌పై భారత్ చేసిన దాడిలో భారత వైమానికదళానికి కూడా నష్టం జరిగిందని CDS చౌహాన్ ఒప్పుకున్నారు. విమానాలు కోల్పోయిన విషయంపై స్పష్టత ఇవ్వకపోయినా, వ్యూహాలను మెరుగుపరచామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Indian Air Force: సత్యాసత్యాలు

పాకిస్థాన్‌పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానికదళానికి కూడా నష్టం వాటిల్లిందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌ అంగీకరించారు. భారత్‌కు చెందిన ఆరువిమానాలను కూల్చేశానని పాకిస్థాన్‌ చెప్పడం శుద్ధ అబద్ధమని అంటూనే, ఎన్ని విమానాలను భారత్‌ కోల్పోయిందో ఇదమిత్థంగా చెప్పకుండా త్రిదళాధిపతి ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. విమానాలు కోల్పోవడం కంటే, ఎందుకు, ఎలా జరిగిందన్న కారణాలు తెలుసుకోవడం ముఖ్యం కనుక, వ్యూహాత్మక తప్పిదాలను సరిదిద్దుకొని, వ్యూహాలను మెరుగుపరుచుకొని అమలు చేశామని అన్నారాయన. ఆదిలో వేసిన ఈ తప్పుటడుగులవల్ల ఒనగూరిన నష్టమెంతో చెప్పలేదు కానీ, సరిదిద్దుకున్న అనంతరం పాకిస్థాన్‌ను అద్భుతంగా దెబ్బతీయగలిగామన్నారు. ఎంతో కచ్చితత్వంతో పాక్‌ స్థావరాలపై దాడులు చేయడంతో వాటిని ఆపాల్సిందిగా ఆ దేశం ప్రాధేయపడిందని ఆయన వివరించారు. చైనా చేయూతతో భారత్‌ను పాకిస్థాన్‌ గట్టిదెబ్బ కొట్టిందన్న ప్రచారం ఉధృతంగా జరిగిన నేపథ్యంలో, అసలు చైనా సమకూర్చిన రక్షణవ్యవస్థలు సరిగా పనిచేయనేలేదని కూడా ఆయన గాలి తీసేశారు. విపక్షాలకు చౌహాన్‌వ్యాఖ్యలు మంచి మందుగుండు సమకూర్చాయి. మోదీ సర్కారు దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నదనీ, గుట్టు విప్పడం లేదు, నిజం చెప్పడం లేదు అంటూ ఆదినుంచీ ఆగ్రహిస్తున్న విపక్షాలు ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను డిమాండ్‌ చేస్తున్నాయి. ఎన్ని విమానాలు?, ఏమిటవి అన్న ప్రశ్నలతో పాటు చాలా అనుమానాలు నివృత్తిచేసుకోవాలని, అమెరికా అధ్యక్షుడు ఒకటికి పదిసార్లు వాణిజ్యం బూచి చూపి తానే యుద్ధం ఆపానంటూ బల్లగుద్దుతున్న సంగతీ మాట్లాడుకోవాలని అవి అంటున్నాయి.


కాల్పుల విరమణ ఒప్పందంలో ఉన్నదేమిటో జనానికి తెలియనక్కరలేదా? అన్నది మంచిప్రశ్న. ఇప్పటివరకూ పొరుగుదేశం చెబుతున్న గొప్పలను, లెక్కలను సహజంగానే నమ్మకపోవడంతో పాటు, అంతర్జాతీయ మీడియానూ, రక్షణరంగ విశ్లేషణలను సైతం భారతీయులు అనుమానించారు. పాక్‌మీద ప్రేమతో పాశ్చాత్యదేశాలన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని భావించారు. కానీ, యుద్ధం ముగిసిన మూడువారాల తరువాత చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంతో పాటు కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. యుద్ధం అన్నాక నష్టాలు సహజం అని అప్పట్లో ఎయిర్‌మార్షల్‌ భారతి, ఇప్పుడు చౌహాన్‌ ప్రత్యేకంగా ఉద్ఘాటించాల్సిన అవసరం ఏమీ లేదు. పోరాటంలో నెగ్గడంతో పాటు, పోగొట్టుకోవడం కూడా ఉంటుందని సామాన్యుడికి సైతం తెలుసు. అయితే, ఐదువిమానాలను కూల్చినట్టుగా పాక్‌ తొలిరోజునే చేసిన ప్రకటనను వమ్ముచేయడానికి కాబోలు, వాయుసేన పైలట్లందరూ సురక్షితంగా తిరిగివచ్చారని చెప్పి వైమానిక నష్టాలేమీ జరగలేదన్నట్టుగా ఎయిర్‌మార్షల్‌ దేశప్రజలకో అభిప్రాయాన్ని కలిగించారు. సరికొత్త ఒప్పందంతో, ఫ్రాన్స్‌నుంచి మరింత ఖరీదుకు కొనుక్కున్న రాఫెల్‌కు అప్రదిష్ట రాకూడదన్న జాగ్రత్త అందులో ఉండివుండవచ్చు. ఇప్పుడు సీడిఎస్‌ చౌహాన్‌ పాకిస్థాన్‌ అంటున్న స్థాయిలో కాకున్నా నష్టం అధికంగానే సంభవించిందని తేల్చేశారు. యుద్ధకాలంలో పాక్‌ పని అయిపోయిందంటూ ఎన్నిరకాల ప్రచారాలు జరిగాయో, అందులో బీజేపీ నాయకులు ఎంత ముందున్నారో అందరికీ తెలుసు. ఆ ఉద్వేగాల మధ్య, మరోపక్క పాకిస్థాన్‌ దీనికి ప్రతిగా, ప్రతీకారంగా మరింత విషప్రచారం సాగించిన నేపథ్యంలో, వాస్తవిక స్థితిని చెప్పడానికి సైన్యం కత్తిమీద సాముచేయాల్సివచ్చింది. అయితే, సత్యాన్ని దాచడంవల్లనో, అర్థసత్యాలు చెప్పడం వల్లనో అసత్యప్రచారాలను వమ్ముచేయడం సాధ్యంకాదు. దేశం కోసం ప్రాణాలకు తెగించిపోరాడే సైన్యానికి రాజకీయాలతో నిమిత్తం లేదు కనుక, ఉన్నదివున్నట్టు చెప్పడానికి ఏ దశలోనూ సందేహించనక్కరలేదు. ఈ యుద్ధంలో పాకిస్థాన్‌కు తీరని నష్టం చేశామని, ఉగ్రస్థావరాలను కుప్పకూల్చి ఒక కొత్త లక్ష్మణరేఖ గీశామన్నది వాస్తవం. జాగ్రత్తగానైనా కొన్ని నిజాలు విప్పినందుకు చౌహాన్‌ను అభినందించాల్సిందే. అయితే, మూడువారాల తరువాత కూడా అది 145కోట్లమంది దేశప్రజల సమక్షంలో గాక, కఠినమైన ప్రశ్నలు, విశ్లేషణలు ఎదుర్కొనే సందర్భంలో, ఒక విదేశీ వేదికమీద జరగడం కాస్తంత అసంతృప్తిని కలిగిస్తున్న మాట నిజం.

Updated Date - Jun 03 , 2025 | 12:36 AM