Share News

India on Alert Over Chinas: చైనా డ్యామ్‌తో జాగ్రత్త

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:43 AM

ఉగ్రవాదమే ఊపిరిగా జీవిస్తూ– నిరంతరం, నిరంతరాయంగా నెత్తుటేర్లు పారిస్తున్న పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు భారత్‌ ఇటీవల..

India on Alert Over Chinas: చైనా డ్యామ్‌తో జాగ్రత్త

ఉగ్రవాదమే ఊపిరిగా జీవిస్తూ– నిరంతరం, నిరంతరాయంగా నెత్తుటేర్లు పారిస్తున్న పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు భారత్‌ ఇటీవల సింధూ జలాలను బిగపట్టింది. పాక్‌ చిరకాల మిత్రదేశం చైనా– అందుకు తక్షణ ప్రతీకార చర్యగా ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై బ్రహ్మాండమైన డ్యామ్‌ నిర్మాణానికి భారీ ఎత్తున ప్రారంభోత్సవం జరిపింది. ప్రపంచంలోని దాదాపు 40 శాతం జనాభా 276 అంతర్జాతీయ నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తోంది. మొత్తం తాగు, సాగు యోగ్య జలాల్లో 60 శాతం అక్కడి నుంచే లభిస్తున్నాయి. వాటిలో వాటా కోసమే నీటిలో నిప్పులు. 170 బిలియన్‌ డాలర్ల (సుమారు 15 లక్షల కోట్ల రూపాయల) ఖర్చుతో బ్రహ్మపుత్ర (యార్లంగ్‌ జాంగ్బో) నదిపై చైనా చేపట్టిన మెడాగ్‌ డ్యామ్‌ నిర్మాణం పెను ప్రకంపనలు సృష్టిస్తున్న తీవ్ర విపరిణామం. భారత సరిహద్దుల వెంబడి టిబెట్‌ పీఠభూమిలో చైనా నిర్మిస్తున్న 60 వేల మెగావాట్ల పంచవర్ష ప్రాజెక్టు ఇది. ‘దేశీయ ఆర్థిక అభివృద్ధి కోసమే ఈ భారీ డ్యాం’ అని చైనా నమ్మబలుకుతున్నప్పటికీ, అంతరార్థం ఏమిటన్నది లోతుగా పరిశీలించాల్సిందే.


సరిహద్దు దేశాలతో డజన్లకొద్దీ నదులను చైనా పంచుకుంటోంది. వాటిలో చాలా భాగం ఎగువన ఉన్న చైనా నుంచి దిగువకు ప్రవహిస్తున్నవే. దాంతో ఆర్థిక, రాజకీయ, దౌత్య ప్రయోజనాల కోసం ఆ నదీ జలాలను వాడుకొనే అవకాశం చైనా చేజిక్కింది. ఇప్పుడు బ్రహ్మపుత్ర విషయంలోనూ చైనా అనేక ఇతర ప్రయోజనాలను అన్వేషిస్తూ ఉండొచ్చు కూడా. బ్రహ్మపుత్ర జలాల్ని చైనా ఈ డ్యామ్‌ ద్వారా అడ్డుకున్నా లేక హఠాత్తుగా వదలిపెట్టినా దిగువన ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాల్లో వ్యవసాయం, జీవనోపాధులు కొంతమేరకు దెబ్బతినే ప్రమాదం ఉంది. నదీ జల వివాదాలపై రెండు దేశాల మధ్య కొన్ని అవగాహన ఒప్పందాలు, నిపుణుల స్థాయి యంత్రాంగం ఉన్నప్పటికీ– అవేవీ క్రియాశీలంగా లేవు. బ్రహ్మపుత్ర నదీ జలాల వివరాల పేరిట ఇప్పటికే భారత్‌ కొన్ని కోట్ల రూపాయలను భారత్‌ నష్టపోయింది. ఆ అవగాహనకూ 2014తో కాలం చెల్లింది. ఇప్పటికే సొంత ఉపగ్రహ సమాచారం, రిమోట్‌ సెన్సింగ్‌పై భారత్‌ దృష్టి సారించాల్సి ఉంది. బ్రహ్మపుత్ర నదీ జలాల్లో 80 శాతం, ఆ నది భారత భూ భాగంలోకి ప్రవేశించాక హిమనీనదాలు, భారీ వర్షాలు, వరదల ద్వారా జమపడుతున్నవే. పైపెచ్చు చైనా నిర్మిస్తున్న మెడాగ్‌ మెగా డ్యామ్‌ ప్రధానంగా జల విద్యుత్‌ ఉత్పత్తి కోసమే. అందువల్ల, భారీ స్థాయిలో నదీ జలాల్ని అదే పనిగా నిలిపి ఉంచేసుకోవడం అసాధ్యం. ఒకవేళ కొంతమేరకు అడ్డుకున్నా, ఉన్నట్టుండి వదిలేసినా భయపడాల్సినంత భారీ స్థాయిలో విధ్యంసమేమీ జరగదు. కాల్వలు, విస్తృత నీటి పారుదల వ్యవస్థల నిర్మాణం, నిర్వహణ ఇలాంటప్పుడు మనకు కీలకం. ఇందులో భాగంగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లాలో బహుళార్థసాధక నీటి నిల్వ ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులకు నచ్చజెప్పి, ఒప్పించగలిగితే– డ్యామ్‌ సంబంధిత భయాలకు, నష్టాలకు చెక్‌ పెట్టే దిశగా ఓ అవరోధాన్ని అధిగమించినట్లే!

– పి. దత్తారాం ఖత్రీ, సీనియర్‌ జర్నలిస్టు

Updated Date - Aug 20 , 2025 | 07:03 AM