Pahalgam Terror Attack: ఉగ్రవాదంపై భారత్ ఒంటరిపోరు
ABN , Publish Date - May 28 , 2025 | 06:18 AM
భారత్ పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ప్రపంచ మద్దతు ఆశించిన స్థాయిలో లభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ విదేశాంగ చొరవలు, ప్రపంచ నేతలతో సంబంధాలు పహల్గాం ఘటన వంటి సందర్భాల్లో ఫలప్రదంగా మారలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచంలో ఉగ్రవాదం బారినపడిన ప్రప్రథమ దేశాలలో భారత్ ఒకటి. ఉగ్రవాదం అంటే ఏమిటో ప్రపంచ ప్రజలకు తెలియని కాలంలో భారతదేశం ఆ రక్కసి దాడులకు గురయింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా ఎత్తుడుబిడ్డగా ఉన్న పాకిస్థాన్ ప్రేరేపించిన ఉగ్ర హింసాకాండకు వ్యతిరేకంగా విశాల భారతావని ఏకత్రాటిపై నిలబడి సమర్ధంగా పోరాడింది. గతంతో పోల్చితే ఇప్పుడు ఉగ్రవాద ఘాతుకాలు చాల వరకు తగ్గిపోయాయి. అయితే కశ్మీర్ లోయలో తరచు జరుగుతోన్న పాకిస్థాన్ ప్రేరేపిత రక్తపాతాన్ని ముక్త కంఠంతో ఖండించే విషయంలో ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఆశించిన విధంగా స్పందించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత విదేశాంగ విధానంలో తనదైన ఒక విశిష్ట శైలిని నెలకొల్పారు. పహల్గాం అమానుష మారణకాండను ఖండిస్తూ దానికి బాధ్యులను హెచ్చరింపజేయడంలో ప్రపంచ దేశాల మద్దతును ప్రధాని మోదీ సమీకరించలేకపోయారు. ఇరుగు పొరుగు నేపాల్, భూటన్ మొదలు అమెరికా దాకా ఎన్నో దేశాలు పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. అయితే పాకిస్థాన్‌ను ఒక్క పల్లెత్తు మాట అనలేదు! ఇది భారత ప్రభుత్వాన్ని, ప్రజలను విస్మయానికి గురి చేసింది. భారత సైనిక అవసరాలకు దన్నుగా ఉన్న రష్యా సైతం ఇరు దేశాలు సంయమనం పాటించాలని మాత్రమే విజ్ఞప్తి చేయడం గమనార్హం. ‘తన స్నేహితుడు’ అని ప్రధాని మోదీ సగర్వంగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్థాన్‌ను పల్లెత్తు మాట అనలేదు. అనకపోగా, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాకిస్థాన్‌ను మహోన్నత భారత్‌తో పోల్చి భారతీయులను అవమానపరిచారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠను ఇనుమడింపజేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత దశాబ్ద కాలంగా నిర్మాణాత్మక పాత్ర వహిస్తున్నారు, సందేహం లేదు. సంప్రదాయ దౌత్య నియమాలకు అదనంగా మోదీ తన వ్యక్తిగత శ్రద్ధాసక్తులతో విదేశాంగ విధాన దిశ, దశలను మార్చారు. తరుచు విదేశీ పర్యటనలు చేయడమే కాకుండా, ప్రపంచ శిఖరాగ్ర సదస్సుల సందర్భంగా చొరవ తీసుకుని ప్రభావశీలురు అయిన ప్రపంచ దేశాల అధినేతలతో చనువుగా మాట్లాడే తీరు, వ్యంగ్యోక్తులు విసిరే వైనం అమిత ఆసక్తికరంగా ఉంటుంది. అటువంటి చనువు, చొరవ జవహర్‌లాల్ నెహ్రూ సైతం ఎప్పుడూ తీసుకోలేదు. వృత్తిరీత్యా దౌత్యవేత్త అయిన విదేశాంగ మంత్రి జైశంకర్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ అయిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అనుభవం మోదీకి అదనంగా కలిసి వస్తున్న విశేష సానుకూల అంశం. మరి మోదీ విదేశీ పర్యటనలు, ప్రపంచ నేతలతో ఆయన వ్యక్తిగత మైత్రి పహల్గాం మారణకాండ అనంతరం ఎంత వరకు దేశానికి ఉపకరించాయి? ఇది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. సమస్త దౌత్య మర్యాదలను పక్కనపెట్టి 2019లో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలలో ట్రంప్‌కు మద్దతుగా మోదీ ప్రచారం చేశారు.
అయినా ట్రంప్ నోట సైతం పాకిస్థాన్ పట్ల ప్రశంసలు వినపడడాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? ప్రధాని మోదీ ప్రతిష్ఠ భారత విదేశాంగ విధానానికి ప్రామాణికమైతే, ప్రస్తుతం గల్ఫ్‌తో సహా వివిధ దేశాలకు అఖిలపక్ష ఎంపీ బృందాల పర్యటన అవశ్యకత ఎందుకు? ఇది సహజంగా స్ఫురించే ప్రశ్న. ప్రస్తుతం భారత పార్లమెంటేరియన్లు పర్యటిస్తున్న దేశాల రాయబార కార్యాలయాలన్నీ న్యూఢిల్లీలో ఉన్నాయి. అనుభవజ్ఞుడయిన విదేశాంగ మంత్రి రాయబారులకు ఇచ్చే విపుల వివరణల కంటే ఎక్కువగా, యువ పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయులు, హరీష్ బాలయోగిలతో కూడిన ఎంపీ బృందాలు విదేశీగడ్డపై విదేశీనేతలకు వివరించగలుగుతాయా? అందునా భద్రతా మండలి సభ్య దేశాలు, కీలక మిత్ర, ముస్లిం దేశాలకు భారతీయ పార్లమెంటేరియన్ల బృందాలను పంపించడం వల్ల భారత–-పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలలోని కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయం చేయడానికి పరోక్షంగా దోహదపడదూ? ఇది ఉపేక్షించదగని వాస్తవం. అందునా ఏరికోరి ముస్లిం రాజకీయ నాయకులను గల్ఫ్ దేశాలకు పంపించడం విడ్డూరంగా ఉంది. అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా భారతీయ సమాజం దేశ సార్వభౌమత్వాన్ని సంరక్షించుకోవడంలో సమైక్యంగా ఉన్నది, ఎప్పటికీ సమైక్యంగా ఉంటుంది. ఈ తిరుగులేని వాస్తవాన్ని ప్రపంచం ముందు రుజువు చేసుకోవల్సిన అవసరం లేదు. పాకిస్థాన్‌కు చైనా, టర్కీ, అజర్ బైజాన్ అండగా నిలిచాయి. మరి చైనాను మినహాయించి, మిగతా రెండు దేశాల ఉత్పత్తులు, సేవలను బహిష్కరించాలని కొందరు పిలుపునివ్వడాన్ని ఏ విధంగా అర్థంచేసుకోవాలి? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వడాన్ని దౌత్య పలుకుబడితో అడ్డుకోలేకపోయిన మనం ఒక మిఠాయి – మైసూర్ పాక్– పేరును మార్చుకుని మురిసిపోతున్నాం! మోదీ తన మిత్రుడని భావించే ట్రంప్, కశ్మీర్‌పై భారత్ సైనిక చర్య గురించి మాట్లాడిన తీరు భారతీయులకు అవమానకరం. ఒక్కసారి కాదు, వివిధ సందర్భాలలో ఆయన అదే బాణీని పునరుద్ఘాటించారు. ట్రంప్ ప్రకటనపై భారత ఖండనను అంతర్జాతీయ సమాజం పట్టించుకోనేలేదు. అంతర్జాతీయ మీడియాలో భారత్ వాదం వినిపించకపోవడమే అందుకు నిదర్శనం. భారతదేశం తన విదేశాంగ విధానాన్ని నిష్పాక్షికంగా సమీక్షించుకోవల్సిన సందర్భమిది.
-మొహమ్మద్ ఇర్ఫాన్ (ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)