Share News

First National Song: తొలి జాతీయగీతం @ 1857!

ABN , Publish Date - Dec 03 , 2025 | 02:43 AM

1857 నాటి స్వాతంత్ర్య పోరాటం‌లో ప్రముఖపాత్ర వహించిన నానా సాహెబ్ ఆంతరంగిక కార్యదర్శి అజీమ్ ఉల్లాఖాన్. అతను వ్యవహారదక్షుడే గాక గొప్ప యుద్ధ వ్యూహకర్త కూడా.....

First National Song: తొలి జాతీయగీతం @ 1857!

1857 నాటి స్వాతంత్ర్య పోరాటం‌లో ప్రముఖపాత్ర వహించిన నానా సాహెబ్ ఆంతరంగిక కార్యదర్శి అజీమ్ ఉల్లాఖాన్. అతను వ్యవహారదక్షుడే గాక గొప్ప యుద్ధ వ్యూహకర్త కూడా. 1857 సంగ్రామ కాలం‌లో అజీమ్‌ ఉల్లాఖాన్‌ ‘పయామ్–ఎ–ఆజాదీ’ పేరుతో ఒక రహస్య పత్రికను నడిపాడు. అందులో అవధి (లక్నో) ప్రాంతానికి చెందిన సమరయోధుడు మౌల్వీ లియాఖత్ ఆలీ రాసిన గేయం ఒకటి ప్రచురితమైంది. మనం జాతీయ గీత రచయితలుగా ప్రముఖంగా చెప్పుకునే బంకించంద్ర, మహమ్మద్ ఇక్బాల్, రవీంద్రనాథ్ టాగోర్, గురజాడ, సుబ్రహ్మణ్య భారతి తదితరులు రాసిన గీతాలన్నిటికంటే ముందుగానే మౌల్వీ లియాఖత్‌ ఆలీ ఈ గీతాన్ని రాశారు కాబట్టి దీనినే తొట్టతొలి జాతీయ గీతం అనుకోవచ్చు. గుంటూరువాసి సయ్యద్ నశీర్ అహ్మద్ రాసిన ‘స్వాతంత్ర్య సంగ్రామం‌లో ముస్లిం యోధులు’ పుస్తకం‌లో ఈ ఉర్దూ గేయాన్ని తెలుగు అక్షరాలలో ప్రచురించారు.

నేడు జాతీయ గీతాలపై చర్చ నేపథ్యంలో

ఈ గీతం తెలుగులో....

హిందుస్థాను మన దేశం – దీనికి మనమే వారసులం

పవిత్రమైనది మా దేశం – స్వర్గం కంటే మహాప్రియం

సమస్త సంపద మాదేలే–హిందుస్థాను మనదేలే!

దీని వైభవం దీని ప్రాభవం

వెలుగులు చిమ్మును జగమంతా

అతి ప్రాచీనం ఎంతో ధాటి

దీనికి లేదుర ఇలలో సాటి!

హిందుస్థాను మన దేశం–దీనికి మనమే వారసులం!

గంగా యమునలు పారు నిండుగా

మా నేలల్లో బంగారు పండగ

దిగువున పరుచుకు మైదానాలు

దిగ్గున ఎగసే సంద్రపుటలలు

మంచు నిండినా ఎత్తు కొండలు

కావలి దండిగ, మాకు అండగా!

హిందుస్థాను మన దేశం–దీనికి మనమే వారసులం!

దూరం నుండి వచ్చిన దుష్టులు

చేసిరి కంతిరి మాయ చేష్టలు

ప్రియాతి ప్రియమవు దేశాన్నంత

దోచివేసిరి రెండు చేతులా!

హిందుస్థాను మన దేశం–దీనికి మనమే వారసులం!

అమరవీరులు విసిరిన సవాలు

దేశవాసులు వినరండి

బానిస సంకెలు తెంచండి

నిప్పుల వానై కురవండి!

హిందుస్థాను మన దేశం–దీనికి మనమే వారసులం!

హిందూ, ముస్లిం, సిక్కులందరం

ప్రియాతి ప్రియమవు సోదరులం

అదిగదిగో మన స్వతంత్ర జెండా

చేస్తాం సలాము గుండెల నిండా!

చేస్తాం సలాము గుండెల నిండా!

ఉర్దూ మూలం:

మౌల్వి లియాఖత్ అలీ

తెలుగు అనువాదం: దివికుమార్

Updated Date - Dec 03 , 2025 | 02:43 AM