Share News

India Trade Deficit Impact: అమెరికా–చైనా అడకత్తెరలో భారత్‌

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:31 AM

భారత్‌ ప్రస్తుతం రెండు ప్రపంచ కుబేర దేశాలైన అమెరికా మరియు చైనా నుంచి సవాళ్లు ఎదుర్కొంటుంది. ఆర్థిక సంబంధాల పరంగా, అమెరికాతో మనం వాణిజ్య మిగులు ఉన్నప్పటికీ, ట్రంప్‌ సుంకాల విధింపుతో మన ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది

India Trade Deficit Impact: అమెరికా–చైనా అడకత్తెరలో భారత్‌

నెల 2న ప్రారంభమైన సుంకాల యుద్ధంలో భారత్‌ రెండు దేశాల నుంచి సవాళ్ల నెదుర్కొంటున్నది. అవి అమెరికా, చైనా అని మరి చెప్పనవసరం లేదు. స్కిల్లా, చారిబ్డిస్‌ మధ్య (బిట్వీన్‌ స్కిల్లా అండ్‌ చారిబ్డిస్‌) భారత్‌ చిక్కుకున్నది. (గ్రీక్‌ పురాణ వీరుడు ఒడిస్సియస్‌ తన నౌకతో ఒక జలసంధి గుండా ప్రయాణించవలసి వచ్చినపుడు రెండు ప్రమాదాల నెదుర్కోవలసివచ్చింది. ఒకటి స్కిల్లా అనే ఆరు తలల రాక్షసి, మరొకటి చారిబ్డిన్‌ అనే సుడిగుండం. రెండు అవాంఛనీయమైన ఎంపికల మధ్య ఒకదాన్ని ఎంచుకోవడంలో ఉన్న కష్టనష్టాలను ఈ జాతీయం సూచిస్తుంది). మరో ఆంగ్ల జాతీయం కూడా భారత్‌ క్లిష్ట పరిస్థితికి అద్దం పడుతున్నది. అది ‘బిట్వీన్‌ ది డెవిల్‌ అండ్‌ డీప్‌ సీ’. అయితే ఏది దెయ్యం? ఏది లోతైన సముద్రం? ఇది సందిగ్ధతను సూచిస్తుంది. ఏ దేశాన్ని ఏ విధంగా భావించినా ప్రతికూల పరిస్థితుల నెదుర్కోవలసిరావడం అనివార్యం. రెండూ సంతోషదాయకం కాని ప్రత్యామ్నాయాలే మరి. సమస్యను మరింత వివరంగా చూద్దాం. 2024–25లో అమెరికా, చైనాలతో మన ఎగుమతులు, దిగుమతులు ఇలా ఉన్నాయి. తొలుత ఎగుమతులు : (అంకెలు అన్నీ డాలర్లలో) అమెరికాకు–88.51 బిలియన్‌; చైనాకు–14.25 బిలియన్‌, ప్రపంచ దేశాలకు–437.42 బిలియన్‌. దిగుమతులు: అమెరికా నుంచి–45.3 బిలియన్‌; చైనా నుంచి–113.45 బిలియన్‌; ప్రపంచ దేశాల నుంచి–720.24 బిలియన్‌. ఈ ప్రకారం ఆయా దేశాలతో మన వాణిజ్య మిగులు లేదా లోటు ఇలా ఉన్నది: అమెరికాతో మన వాణిజ్యం మిగులుతో జరుగుతుంది. అది +41.21 బిలియన్‌. చైనాతో మన వాణిజ్య లోటు ఇలా ఉన్నది: –99.20 బిలియన్‌. ప్రపంచ దేశాలతో మన వాణిజ్య లోటు: –282.82 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది.


ఈ గణాంకాలు చెబుతున్నదేమిటి? ప్రపంచ రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలతో వ్యవహరించవలసి వచ్చినప్పుడు భారత్‌ పూర్తిగా రెండు పరస్పర విరుద్ధ సవాళ్ల నెదుర్కొంటున్నది! అమెరికాతో మన వాణిజ్య ఖాతా మిగులుతో ఉన్నది. అమెరికాకు మన ప్రధాన ఎగుమతులు రత్నాలు, బంగారు ఆభరణాలు, ఔషధాలు, ఇంజినీరింగ్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కొన్ని వ్యవసాయక ఉత్పత్తులు. ఔషధాలు మినహా మిగతా సరుకులు, వస్తువులను మన దేశం నుంచి దిగుమతి చేసుకోవలసిన అవసరం అమెరికాకు లేదు. ఇతర దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవడం ద్వారా తన అవసరాలను తీర్చుకోగలుగుతుంది. అయితే మనం ఎగుమతి చేస్తున్న ప్రతి సరుకు, ఉత్పత్తి వేలాది స్త్రీ పురుషుల జీవనోపాధికి ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు భారీ సుంకాలు విధించేందుకు ట్రంప్‌ మహాశయుడు సిద్ధమవడంతో అమెరికాతో మన వాణిజ్య ఖాతాలోని మిగులు హరించుకుపోయే ప్రమాదమున్నది. సరే, ప్రతిపాదిత సుంకాల అమలును ట్రంప్‌ తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు ఫార్మాస్యూటికల్‌ ఉత్పత్తులకు అధిక సుంకాల నుంచి మినహాయింపునిచ్చారు. అయినప్పటికీ భారత్‌ శిరస్సుపై ట్రంప్‌ సుంకాల ఖడ్గం వేలాడుతూనే ఉన్నది. అమెరికా అధ్యక్షుడు సంకల్పించిన భారీ సుంకాలు అంతిమంగా అమలులోకి వచ్చినప్పుడు మన ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. లక్షలాది ఉద్యోగాలు మాయమవుతాయి. మన విదేశీమారకద్రవ్య నిల్వలు తగ్గి పోతాయి.


కరెంట్‌ ఖాతా సమతౌల్యం గతించిన విషయమైపోతుంది. ఈ కష్ట నష్టాలను దృష్టిలో ఉంచుకుని అమెరికాతో సంప్రతింపుల ద్వారా సుంకాల భారాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. భారీ సుంకాల విధింపుతో భారతీయ సరుకుల దిగుమతులను నిరోధించడం వల్ల అమెరికాకు లబ్ధి సమకూరదు. ఈ వాస్తవం ట్రంప్‌కు బాగా తెలుసు. భారతీయ దిగుమతులను అనుమతించేందుకు ఒక మార్గాన్ని ఆయన కనుగొంటారు. అయితే అందుకు భారత్‌ నుంచి పెద్ద ప్రయోజనాన్ని దక్కించుకోవడానికి ఆయన తప్పక ప్రయత్నిస్తారు. ద్వైపాక్షిక వాణిజ్యం సమతౌల్యపరిచేందుకు అమెరికా నుంచి భారత్‌ మరిన్ని ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆయన పట్టుబడతారు. నా ఊహ ఏమిటంటే సైనిక సామగ్రి, యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్‌ను ఆయన ఒత్తిడి చేయవచ్చు. ఆ రెండూ చాలా చాలా ఖరీదైన ఉత్పత్తులని మరి చెప్పనవసరం లేదు. భారత్‌ తనకు అవసరమైన ఉక్కు ఉత్పత్తులు, ఇనుప పరికరాలు, సేంద్రియ రసాయనాలు, ప్లాస్టిక్స్‌, ఖనిజాలు, లోహాలు, పెట్రోలియం ఉత్పత్తులు అమెరికాయేతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. అయితే ఈ అవసరాలను సైతం అమెరికా ఉత్పత్తులతో తీర్చుకోవడం వివేకవంతమైన, ప్రయోజనకరమైన చర్య అవుతుంది. ఇంతకూ అమెరికా నుంచి సైనిక సామగ్రి, యుద్ధ విమానాలు, ఇంకా అణు రియాక్టర్లను దిగుమతి చేసుకునేందుకు అయ్యే భారీ వ్యయాలను భారత్‌ ఏ మేరకు భరించగలదు? ఇదొక పెద్ద ప్రశ్న. సమాధానం అంత సులువైనది కాదు. ఇక చైనాతో వ్యవహారం పూర్తిగా భిన్నమైనది. ఈ దేశంతో భారత్‌ వాణిజ్య ఖాతా లోటు భారీ పరిమానంలో ఉన్నది. అది ఇంచుమించు 100 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నది! విద్యుత్‌ సామగ్రి, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మెషినరీ, సేంద్రియ రసాయనాలు, ప్లాస్టిక్‌లు, ఉక్కు ఉత్పత్తులు మొదలైన వాటికి భారత పారిశ్రామిక రంగం చైనాపైనే ఆధారపడి ఉన్నది.


చైనా ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడమే అందుకు కారణం కొన్ని సందర్భాలలో ఈ దిగుమతులు ‘డంపింగ్‌’ (ఎగుమతిదారుడి దేశీయ మార్కెట్‌లో అమ్మే ధర కంటే తక్కువ ధరకు విదేశీ మార్కెట్‌లో వస్తువులను విక్రయించే పద్ధతి) కిందకే వస్తాయి. తక్కువ ధరకు, అవసరమైన సమయానికి సరుకులు పొందేందుకు భారత్‌కు చైనా ఉత్పత్తుల కంటే ప్రత్యామ్నాయాలు లేవు దేశీయ వస్తూత్పత్తి రంగం (మన స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా కేవలం 13 లేదా 14 శాతంగా మాత్రమే ఉన్నది!) స్థితిగతులను మెరుగుపరచుకుని విస్తరించనంతవరకు చైనాపై ఆధారపడడం భారత్‌కు తప్పనిసరి అవుతుంది. చైనాకు భారత్‌ ప్రధానంగా వినియోగ వస్తువులు, ఖనిజ ఉత్పత్తులు, పెట్రోలియం ఆధారత ఇంధనాలు, సముద్ర ఆహారోత్పత్తులు, పత్తి, మరికొన్ని వ్యావసాయక ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నది. చైనా దేశీయంగా ఉత్పత్తి చేసుకోలేక పోతున్న, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోలేక పోతున్న విలువ ఆధారిత వస్తువులను భారత్‌ ఆ దేశానికి ఎగుమతి చేయగలదు. అయినా చేయలేకపోతుంది. ఎందుకని? వస్తూత్పత్తి రంగాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే భారత్‌కు ఈ దురవస్థ ప్రాప్తించింది. భారత్‌ నుంచి మరిన్ని వస్తువులు దిగుమతి చేసుకునేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలదా అన్న విషయం చర్చనీయాంశమే. చైనాతో వాణిజ్యలోటు భారత్‌ కరెంట్‌ ఖాతా లోటును ప్రకోపించుతోంది. ఇది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అమెరికాతో వాణిజ్య మిగులు, కొంతమేరకు చైనాతో వాణిజ్యలోటును భర్తీ చేస్తుంది. ట్రంప్‌ సుంకాలతో అమెరికాతో వాణిజ్య మిగులు హరించుకుపోయి, చైనాతో వాణిజ్యలోటు పెరిగిపోతే భారత్‌ ఆర్థిక రంగ పరిస్థితి దిగజారిపోతుంది. భారత్‌ క్వాద్‌ కూటమిలో భాగస్వామిగా ఉన్నది. అయితే అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా వ్యూహాత్మక ప్రాథమ్యాలు భారత్‌ వ్యూహాత్మక ప్రాథమ్యాలకు పూర్తిగా భిన్నమైనవి. చైనా విస్తరణవాదాన్ని అడ్డుకునే రక్షణ కుడ్యంగా క్వాద్‌ పరిణమించాలని అమెరికా ఆశిస్తోంది.


అయితే భారత్‌ వైఖరి భిన్నంగా ఉన్నది. నౌకా వాణిజ్య భద్రత, డిజిటల్‌ కనెక్టివిటీ, ప్రభవిస్తున్న నూతన సాంకేతికతల విషయంలో సహకారానికి క్వాద్‌ పరిమితం కావాలని భారత్‌ భావిస్తోంది. ఈ కూటమిని చైనా వ్యతిరేక బృందంగా మార్చివేసే సంకల్పాలు, ప్రయత్నాలకు భారత్‌ సుముఖంగా లేదు. చైనా ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకునే ఏ దేశమైనా భారీ మూల్యం చెల్లించవలసివస్తుందని చైనా ఇప్పటికే ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఈ వాస్తవాల దృష్ట్యా పెట్టుబడులు, అధునాతన సాంకేతికతలు సమకూర్చే అమెరికా, మధ్యస్థ వస్తువులు (వివిధ సరుకుల తయారీ ప్రక్రియలో వాడబడే వస్తువులు), ఉత్పాదక వస్తువులను సరఫరా చేసే చైనా మధ్య ఒక సమతుల్యతను భారత్‌ విధిగా పాటించాలి. భారత భూభాగాలను ఆక్రమించుకున్న శత్రుపూరిత పొరుగు దేశం చైనా అన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. క్వాద్‌లో భారత్‌ భాగస్వామ్యం ఇంతవరకు వాస్తవికంగా ఉన్నది అటు అమెరికాలోని, ఇటు భారత్‌లోని మితవాద వర్గాలు చైనాతో ఘర్షణపడేలా న్యూ ఢిల్లీని ప్రోద్భలించే అవకాశమున్నది. మరో ఆసక్తికరమైన విషయాన్నీ ప్రపస్తావించాలి: అధ్యక్షుడు ట్రంప్‌ జనవరి 20, 2029 దాకా మాత్రమే అధికారంలో ఉంటారు. అధ్యక్షుడు క్సి జిన్‌ పింగ్‌ తాను కోరుకున్నంతకాలం అధికారంలో ఉంటారు. చైనా పాలన ఆయన నియంత్రణలో ఉంటుంది. ట్రంప్‌ దుడుకుగా, మొరటుగా వ్యవహరించే వ్యక్తి. జిన్‌ పింగ్‌ జిత్తులమారి, వంచనాశీలి. దేశీయ పరిశ్రమల సంరక్షణ విధానాలను మోదీ అనుసరిస్తున్నారు. సుంకాల విషయంలో ట్రంప్‌ దుస్సాహసంతో ఆ విధానాలను మార్చివేయవలసిన అగత్యమేర్పడింది. మోదీ ఆ సంరక్షణ విధానాలను ఉపసంహరించుకోవాలి. ఆర్థిక నిపుణులను విస్తృతంగా సంప్రతించి విధాన నిర్ణయాలు తీసుకోవడాన్ని మోదీ అలవరచుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలను శత్రువులుగా పరిగణించే వైఖరికి ఆయన స్వస్తి చెప్పాలి.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Apr 26 , 2025 | 05:40 AM