India Russia Oil Trade: చమురు సెగలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 02:47 AM
రష్యా నుంచి చమురు కొనుగోలుచేయడం మీద భారత విదేశాంగశాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటన ఎన్నడూ లేనంత స్పష్టంగా
రష్యా నుంచి చమురు కొనుగోలుచేయడం మీద భారత విదేశాంగశాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటన ఎన్నడూ లేనంత స్పష్టంగా, నిర్దిష్టంగానే కాక, అమెరికా వీరంగాన్నీ, ఆ దేశాధ్యక్షుడి హెచ్చరికలనూ బేఖాతరుచేస్తున్న సందేశమూ అందులో అంతర్లీనంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఈ మూడేళ్ళలో, పలుమార్లు రష్యాచమురు మీద మనకు అమెరికానుంచి హెచ్చరికలు వచ్చినప్పటికీ, ఇంత గట్టిగా జవాబు ఇవ్వడం ఇదే తొలిసారి కావచ్చు. దేశప్రయోజనాలు, అవసరాలను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని, ఎటువంటి నిర్ణయానికైనా సిద్ధపడతామని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది. రష్యా చమురు బూచిని చూపి పాతికశాతం సుంకాలనుంచి మించి భారత్‌ను బాదేయాలని ట్రంప్ సిద్ధపడుతున్న నేపథ్యంలో, భారత్ తన వైఖరిని ఇలా స్పష్టపరిచి, దేనికైనా సిద్ధమన్న సందేశాన్నిచ్చినట్టు కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడికి రష్యా చమురు ఇప్పుడు నెత్తురులాగా ఎర్రగా కనిపిస్తోంది. ఒక మహాయుద్ధానికి కందెనలాగా ఉపకరిస్తున్నదని ఇప్పుడు అనిపిస్తోంది. రష్యా యుద్ధకండూతికి, ఊచకోతకు ఉక్రెయిన్‌లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నా భారత్‌కు ఎంతమాత్రం పట్టడం లేదనీ, రష్యానుంచి చవుక చమురు కొని, బహిరంగమార్కెట్‌లో అమ్ముకుంటూ భారీగా లాభాలు పోగేసుకుంటున్నదని ట్రంప్ ఆగ్రహిస్తున్నారు. పాతికశాతంతో సరిపెట్టకుండా మరింత భారీగా మనలను సుంకాలమీద సుంకాలతో దెబ్బతీయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ధీటుగానే జవాబు ఇచ్చింది. రష్యా చమురుతో వ్యాపారం చేస్తున్న ఇక్కడి కంపెనీలమీద ఇప్పటికే ఈయూ ఆంక్షలు విధించిన నేపథ్యంలో, తనను అమెరికా, ఈయూలు అకారణంగా లక్ష్యం చేసుకున్నాయంటూ విమర్శ లాంటి వివరణ ఒకటి భారత్ విడుదల చేసింది. రష్యానుంచి అమెరికా ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నవేమిటో, ఈయూ కొనుగోలుచేస్తున్నవి ఎంతో ఆ ప్రకటన వివరించింది. భారత్‌కంటే రష్యాతో ఇప్పటికీ యూరోపియన్ యూనియన్ (ఈయూ) అత్యధికవాణిజ్యం చేస్తున్నది.
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుకాగానే, ప్రపంచ ఇంధనమార్కెట్లు కల్లోలంలోకి జారుకుంటున్న తరుణంలో ఈ దిగుమతులను అమెరికా స్వయంగా ప్రోత్సహించింది. రష్యా ముడిచమురులో 80శాతం భారతదేశానికే చేరి, ఇక్కడ శుద్ధిచేసినదానిలో అధికశాతం తిరిగి యూరప్‌కే ఎగుమతి అవుతోంది. ఇలా, శుద్ధిచేసిన రష్యన్ చమురు విదేశాలకే తరలిపోతున్నా, సదరు దిగుమతులు మనదేశ ప్రజల ప్రయోజనార్థం జరుగుతున్నట్టుగా మంత్రులు చెబుతూంటారు. భారత్‌నుంచి ఈయూకు శుద్ధిచేసిన పెట్రోలియం ఎగుమతులు ఏటా రెట్టింపవుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒకశాతం కంటే లేదు. కానీ, ఈ యుద్ధం అందించిన ప్రయోజనంతో భారతదేశంలోని కంపెనీలు తాము లబ్ధిపొందుతూ, ఈయూను వెలిగిస్తూవచ్చాయి. యుద్ధాన్ని రష్యా అంతేబలంగా ఇప్పటికీ కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆయిల్ మీద ఆంక్షలతో రష్యాను బలహీనపరచాలన్న ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. మనను బెదిరిస్తున్న ఈయూ దేశాలు రష్యానుంచి ఒకపూట దిగుమతి చేసుకుంటున్న చమురు ఉత్పత్తులు మన మూడునెలల దిగుమతులతో సమానమని చమురుమంత్రి హర్‌దీప్ పురి ఇటీవల వ్యాఖ్యానిస్తూ ఈయూదేశాలు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు ఉత్పత్తుల లెక్కలను విప్పిచెప్పారు.
ట్రంప్ తొలివిడత పాలనలో బెదిరింపులకు లొంగి వెనెజువెలా, ఇరాన్‌ల నుంచి చవుకైన చమురు దిగుమతులను వదులకున్నట్టుగా, ఇప్పుడు రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయడానికి భారత్ సిద్ధపడకపోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గాలతో ప్రజాప్రయోజనాలను ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకుంటామన్న మన విదేశాంగశాఖ వ్యాఖ్యలో అమెరికాకు అంతర్లీనంగా ఓ హెచ్చరిక కూడా ఉన్నది. డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ తమ చమురుకంపెనీలను ఇబ్బడిముబ్బడిగా చమురు తోడిపోసుకోమంటున్న ట్రంప్ ఇలా మనలను బెదిరిస్తూ, అమెరికా చమురు అమ్మకానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. హెచ్చిన అమెరికా సుంకాలనూ, రష్యా చమురు దిగుమతులనూ బేరీజు వేసుకొని ఏది కావాలో, ఏది వదులుకోవాలో తేల్చుకోవాలన్నది ట్రంప్ బెదిరింపుల సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, మై ఫ్రెండ్...ఇండియాస్ ఫ్రెండ్ అంటూ ట్రంప్‌ను ఘనంగా కీర్తించిన ఒకప్పటి ఆప్తమిత్రుడు నరేంద్రమోదీ, ట్రంప్ మారిన వైఖరితో ఇంటాబయటా ఇబ్బందిలో పడినమాట వాస్తవం. ఎంతోకాలం తరువాత మోదీనోట స్వదేశీ మాట వినిపించడం వెనుక కొత్త విధానం కంటే ఈ విరక్తి ఎక్కువగా పనిచేసివుండవచ్చు.