India China Rapprochement : ఈ సయోధ్య స్థిరమేనా
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:19 AM
ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు షాంఘై సహకార సంస్థ ఎస్సీవో వేదిక కావచ్చును కానీ, ఈ సందర్భంగా మనకు కనిపిస్తున్న దృశ్యాలు అంతకుమించిన ప్రాధాన్యం ఉన్నవి...
ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) వేదిక కావచ్చును కానీ, ఈ సందర్భంగా మనకు కనిపిస్తున్న దృశ్యాలు అంతకుమించిన ప్రాధాన్యం ఉన్నవి. మారిన పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా అతివేగంగా పడిన అడుగులు ఉభయ దేశాలను చేరువచేశాయి. ‘మన అధ్యక్షుడు అహానికి పోయి భారత ప్రధాని మీద ఒత్తిడిపెంచుతున్నాడు కానీ, మూడు దేశాలను కలిపి ముడివేస్తున్నానని తెలుసుకోవడం లేదంటూ’ అమెరికా పత్రిక ఒకటి గతంలో చేసిన వ్యాఖ్యానానికి తియాంజిన్‌లో మోదీ-, పుతిన్, జిన్‌పింగ్ ఆత్మీయతలు, చిరునవ్వులు, ముచ్చట్లు అద్దంపడుతున్నాయి. పహల్గాం ఘాతుకానికి పాకిస్థాన్ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నప్పుడు, ఆయుధ సాయంతో పాటు అత్యంత కీలకమైన ఇంటలిజెన్స్ సమాచారాన్ని కూడా అందించిన చేతులు ఇవేనని జిన్‌పింగ్‌తో కరచాలనం చేస్తున్నప్పుడు మోదీకి గుర్తొచ్చే ఉంటుంది. ఆ చేదు అనుభవాన్ని మనసులోనే వెనక్కునెట్టి, మంచి భవిష్యత్తుకోసం భారత్ చైనాలు కలిసి అడుగులు వేయాలని మోదీ కాంక్షించారు. చైనా అధ్యక్షుడు అయితే ఏకంగా డ్రాగన్, ఏనుగు కలిసి డాన్స్ చేయాలంటున్నారు. నాలుగేళ్ళపాటు రెండుదేశాలు సరిహద్దుల్లో ముష్టిఘాతాలకు దిగిన గతానికి స్వస్తిచెప్పాలన్న ఇరువురి సంకల్పం మెచ్చుకోదగింది. ఇకపై అంతా శుభమే అన్నట్టుగా ఈ సంభాషణలూ ఉన్నప్పటికీ, ట్రంప్ సుంకాలు, వీరంగాలు పునాదిగా ఈ సయోధ్య సాధ్యపడిన వాస్తవం కాదనలేనిది. మూడోదేశంతో ముడివడని రీతిలో ఈ బంధం కలకాలం నిలవాలన్న ఆశ, ఆకాంక్ష నెరవేరుతుందో లేదో చూడాలి.
ఉమ్మడి శత్రువు కమ్ముకొచ్చినప్పుడు, కోటలు కూలదోస్తున్నప్పుడు ఇలా చేయీచేయీ కలపాల్సివస్తుంది. కడదాకా నిలుస్తాడని అనుకున్న ట్రంప్ శత్రువును మించి కత్తులు దూస్తున్నందున రక్షణకవచాలు అవసరపడ్డాయి. అయినా, కాలం ఒకేలా ఉండదనీ, మిత్రులు, శత్రువులు శాశ్వతం కాదన్న స్పృహతోనే మోదీ ప్రయాణం నిర్ణయమైందని విశ్లేషకులు అంటారు. చైనాకు శత్రువు, అమెరికాకు దీర్ఘకాలిక మిత్రదేశమైన జపాన్‌లో మొదట కాలూని, భారీ ఒప్పందాలు కుదర్చుకొని, సాంకేతికతల బదలాయింపు గురించి మాట్లాడుకొని, అక్కడనుంచి ఎస్సీవో సదస్సుకు ప్రయాణం కట్టడం వెనుక చైనాకు, అమెరికాకు అవసరమైన సందేశాలున్నాయని అంటారు. మనంత కాకున్నా, జపాన్ కూడా ప్రస్తుతానికి ట్రంప్ బాధితదేశమే కనుక, ఆ లెక్కకూడా సరిపోతుంది. ఆలింగనాలవరకూ వెళ్ళిన మోదీ ట్రంప్ బంధం ఇప్పుడు అలకలూ, ఆగ్రహాల దశలో ఉంది. చైనాతో కరచాలనాలే తప్ప, ఆలింగనాలు ఉండవని మోదీకి తెలుసు. భారత్‌ను చైనాకు పోటీగా నిలబెట్టి, బలోపేతం చేసే దశాబ్దాలనాటి విధానాన్ని ఈ సుంకాల సమరంలో పడి ట్రంప్ విస్మరించాడు. ట్రంప్‌ను నమ్ముకొని చైనాతో ఘర్షణలు పెంచుకున్న మనకు ఇప్పుడు మళ్ళీ చైనాతో చేయికలపాల్సిన పరిస్థితి తీసుకువచ్చాడు. దశాబ్దాలపాటు ఒక్క బుల్లెట్ కూడా పేలని సరిహద్దు ఇప్పుడు ఘర్షణలు, చొరబాట్లు, దురాక్రమణలతో సతమతమవుతోంది. ఏదో అవసరార్థం సయోధ్య కుదిరినా, ఆ శాంతి ఎక్కువకాలం నిలిచే అవకాశం లేదు. పరస్పర నమ్మకం, గౌరవం వంటివి మాటలకే తప్ప, ఇరుదేశాల మధ్య ఆచరణలో అంతరించిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పడుతున్న ఈ కొత్త అడుగుతో ఇరుదేశాల మధ్య అతుకు ఎంతబలంగా ఏర్పడుతుందో చూడాలి.
గత ఏడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు భారత్, చైనా తమ ఘర్షణాత్మకవైఖరిని సడలించుకొనేందుకు వీలు కల్పించింది. పలువిడతల చర్చల అనంతరం సరిహద్దులు కాస్తంత శాంతించినప్పటికీ, మోహరించివున్న సైన్యాన్ని వెనకకురప్పించే చర్యలు సత్వరమే జరగలేదు. ఉన్నతస్థాయి సంకల్పం అవసరపడిన దశలోనే ట్రంప్ వీరంగాలు భారత్, చైనా సయోధ్యను వేగవంతం చేశాయి. రష్యా చమురు ఇంధనంలాగా పనిచేసింది. ట్రంప్ ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగకుండా స్థిరంగా నిలబడిన మనపక్షాన చైనా, రష్యాలు రెండూ నిలిచాయి. అంతకుముందు కొన్ని ఉత్పత్తులమీద విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేసి, మార్కెట్లు తెరిచేందుకు చైనా తయారవుతోంది. వాణిజ్యం గురించి ఇరుదేశాధినేతలూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్న ఈ వాతావరణమార్పు ఐదారునెలలక్రితం కూడా ఎవరి ఊహకూ అందనిది. వచ్చే ఏడాది బ్రిక్స్ సదస్సులోగా తుఫానులేవీ సంభవించబోవని ఆశిద్దాం.